రాంచీలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు లైన్ లో నిల్చున్న ఓటర్లు
జమ్మూకశ్మీర్‌లో 72%, జార్ఖండ్‌లో 65.46% పోలింగ్
శ్రీనగర్/జమ్మూ/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో మంగళవారం జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చైతన్యం వెల్లివిరిసింది. జమ్మూకశ్మీర్‌లోని 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల భయం, జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడుల భయం మధ్య జరిగిన ఈ దశ పోలింగ్ ఒక్క అవాంఛనీయ ఘటనా జరగకుండానే ప్రశాంతంగా ముగియడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే.
వేర్పాటువాదులకు చెంపపెట్టు
జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును బేఖాతరు చేస్తూ ఓటర్లు ఉదయం నుంచే భారీ క్యూలలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాలు, కశ్మీర్ లోయలోని రెండు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. రెండో దశ ఎన్నికలకు ముందు జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఉగ్ర దాడులు, ఎన్‌కౌంటర్‌లు జరిగిన నేపథ్యంలో పోలింగ్ రోజున భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది.
తుది గణాంకాలు అందాక పోలింగ్ శాతం ఒకటి, రెండు శాతం మేర పెరుగుతుందని ఆశిస్తున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్షీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే రీసీలో అత్యధికంగా 80 శాతం, ఉధంపూర్‌లో 76 శాతం, పూంచ్‌లో 75 శాతం, కుప్వారాలో 68 శాతం, కుల్గామ్‌లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైందన్నారు. వాతావరణం అనుకూలించి మంచు కురవకపోవడం కూడా పోలింగ్ భారీగా నమోదవడానికి కారణమైందన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 61.04 శాతం పోలింగ్‌కన్నా, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 68.79 శాతం పోలింగ్ కన్నా రెండో దశ పోలింగ్ శాతం అధికమన్నారు. రెండో దశ ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో నలుగురు మంత్రులు, 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు.
ఈవీఎంలలో అర్జున్ ముండా, కోడా భవిత
జార్ఖండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలో రెండో దశ పోలింగ్ జరిగింది. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో 18 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే పోలింగ్ చేపట్టగా మరో రెండు నియోజకవర్గాలైన జంషెడ్‌పూర్ తూర్పు, జంషెడ్‌పూర్ పడమర నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధు కోడా, ముగ్గురు మంత్రులు, 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది.