నాలుగు రోజుల క్రితం ఎగ్జిట్‌పోల్స్ అంచనాలు వచ్చాయి. మంగళవారం కౌంటింగ్ మొదల య్యాక ఉదయం 9 గంటల వేళ తొలి ఫలితాల సరళీ వచ్చింది. కానీ, ఆశ్చర్యకరంగా అంతా మారి పోయింది. హర్యానా, జమ్ము–కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో అంచనాలు, ఆశాభావాలు తలకిందుల య్యాయి. పోటాపోటీతో హంగ్ అవుతుందని బీజేపీ ఆశపడ్డ జమ్ము – కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ – కాంగ్రెస్ కూటమి గెలిచింది.
హర్యానాలో కాంగ్రెస్‌దే విజయం అని ఎగ్జిట్‌పోల్స్ కోడై కూసినచోట అవన్నీ తోసిరాజని విజయంతో బీజేపీ అబ్బురపరిచింది. 1966 హర్యానా ఏర్పాటయ్యాక ఇప్పటి దాకా ఏ పార్టీ సాధించని హ్యాట్రిక్‌తో రికార్డ్ సృష్టించింది. పార్టీల నుంచి ఎగ్జిట్ పోల్స్ నిర్వాహకుల దాకా ప్రతి ఒక్కరికీ ఈ ఫలితాలు పాఠాలు నేర్పడం గమనార్హం. ఏ ఎన్నికా చిన్నది కాదనీ, ప్రతిదీ కీలకమేననీ, అతి విశ్వాసం పనికిరాదనీ మరోసారి ఈ ఫలితాలు తేల్చాయి.
దశాబ్దం తర్వాత, అదీ 2019 ఆగస్ట్‌లో ఆర్టికల్ 370 రద్దు చేశాక, జమ్ము–కశ్మీర్‌ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించాక... తొలిసారిగా జరిగిన ఎన్నికల్లో ప్రజాతీర్పు ఆసక్తికరమే. కొన్నేళ్ళుగా ‘నయా కశ్మీర్’గా ఎంతో చేశామని చెప్పుకున్నప్పటికీ, జమ్మూను దాటి కశ్మీర్ లోయలో బీజేపీ తన ప్రభావం చూపలేకపోయింది. దోడా స్థానం గెలిచి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) కశ్మీర్‌లో ఖాతా తెరవడం విశేషం.
మరోపక్క హర్యానాలో ‘తిమ్మిని బమ్మిని చేసి బీజేపీ తెచ్చుకున్న గెలుపు’ అని కాంగ్రెస్ వ్యాఖ్యానించింది. ఎన్నికల సంఘం (ఈసీ) వెబ్‌సైట్ ఫలితాల సరళిని చూపిన తీరు, ఈవీఎంల బ్యాటరీల శాతమూ అనుమానాస్పదమన్నది ఆ పార్టీ ఆక్షేపణ, ఆరోపణ. ఆ మధ్య లోక్ సభ ఎన్నికల్లో లానే ఇప్పుడూ ఈసీ ఆ ఆరోపణల్ని బాధ్యతారహితమంటూ కొట్టిపారేసింది. ఆరోపణల్ని పక్కనబెట్టి అసలు జరిగింది ఇప్పటికైనా పరిశీలించుకోవడం అన్ని వర్గాలకూ కీలకం.
కశ్మీర్ సంగతి అటుంచి, హర్యానానే తీసుకుంటే... ‘జవాన్... కిసాన్... పహిల్వాన్’ నినాదంతో ముందుకెళ్ళిన కాంగ్రెస్ హర్యానాలో ఆ అంశాలు బీజేపీని మట్టికరిపిస్తాయని భావిస్తూ వచ్చింది. కానీ, జరిగింది వేరు. పదేళ్ళుగా హర్యానాను పాలిస్తున్న బీజేపీ పట్ల అధికారపక్ష వ్యతిరేకత ఒకటికి రెండింతలు ఉన్నప్పటికీ దాని నుంచి ఎందుకు ప్రతిపక్ష కాంగ్రెస్ లబ్ధి పొందలేకపోయింది.
అందుకు కారణాలను ఇప్పటికైనా ఆత్మావలోకనం చేసుకోవాలి. సమైక్య ప్రతిపక్షంగా బీజేపీకి అడ్డుకట్ట వేయాల్సింది పోయి, కాంగ్రెస్ తన బలాన్ని అతిగా అంచనా వేసుకొని భంగపడింది. ఆప్‌కి హర్యా నాలో చెప్పుకోదగిన స్థాయిలో ఓటు బ్యాంకు ఉందని తెలిసినా, సీట్ల సర్దుబాటు, పొత్తు విషయంలో కాంగ్రెస్ మొండిపట్టుతో పోవడం గట్టి దెబ్బ తీసింది.
ఆప్ సీట్ల డిమాండ్ 20 దగ్గర మొదలై, 10 దగ్గరకు వచ్చి ఆగి, చివరకు 5 స్థానాల దగ్గరకు వచ్చి ఆగినా, పొత్తు పొడవనే లేదు. తప్పక గెలిచే 3 సీట్లిచ్చినా చాలు... ‘ఆప్’ ఓకే అంటుందని తెలిసినా, ఆఖరికి రాహుల్ సైతం పొత్తుకే మొగ్గు చూపినా, కాంగ్రెస్ దూతలు పడనివ్వలేదు. చివరకు మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది.
అధిష్ఠానం జోక్యం చేసుకొని పరాజయానికి బాధ్యులెవరో చూడాలంటూ కుమారి సెల్జా గొంతు విప్పారు. దీన్నిబట్టి ఆ రాష్ట్రంలో కాంగ్రెస్‌లో వర్గవిభేదాలకు కొదవ లేదని అర్థమవుతోంది. సీట్ల పంపిణీ వేళ భూపీందర్ సింగ్ హూడా తన వర్గం వారికే ఎక్కువ సీట్లివ్వడం ఇతర సీనియర్ నేతల్లో అసంతృప్తికి దారి తీసింది.
ఆ అంతర్గత కుమ్ములాటలు ఆఖరికి మొత్తంగా రాష్ట్రంలో పరాజయానికీ దారి తీశాయన్నది ప్రాథమిక విశ్లేషణ. కాంగ్రెస్ ప్రధానంగా నిరుద్యోగం, ద్రవ్యోల్బణం సహా జాతీయ అంశాలపై ఎక్కువగా దృష్టి పెట్టింది. స్థానిక అంశాలతో పాటు సూక్ష్మపరిశీలనతో ఎన్నికల మేనేజ్‌మెంట్‌పై శ్రద్ధ పెట్టడం, సీఎంనూ, కొన్నిచోట్ల అభ్యర్థులనూ మార్చడం కమలనాధులకు కలిసొచ్చింది. ఇటీవల లోక్‌సభ ఎన్నికల్లో కనిపించని ఆర్‌ఎస్‌ఎస్ ఈసారి ప్రభావం చూపింది.
అలాగే, ప్రధాని మోదీ సభలు, మాటలు నాన్ – జాట్ వర్గాలను ఆకర్షించాయని చెప్పక తప్పదు. కాంగ్రెస్ పూర్తిగా జాట్లు – దళితుల ఓట్‌బ్యాంక్‌పైనే అతిగా ఆధారపడి, జాట్లు మినహా మిగతా వర్గాలు, ఓబీసీలు కాషాయఛత్రం కింద ఏకమవుతున్న సంగతి కనిపెట్టలేకపోవడం ఘోర తప్పిదమైంది. కాంగ్రెస్ పక్షాన సీఎం అభ్యర్థి ఎవరన్నదానిపై నెలకొన్న గందరగోళం, గతంలో సాగిన హుడా హయాం పట్ల అసంతృప్తి, ఆయనే మళ్ళీ సీఎం కావచ్చనే అభిప్రాయం ఓటర్లను కాంగ్రెస్ వైపు మొగ్గకుండా ఆపింది.
మొత్తంగా రెండు పార్టీల మధ్య ఓట్ల శాతంలో తేడా 1 శాతం కన్నా తక్కువే. అయితే, సీట్ల పరంగా బీజేపీ గణనీయ విజయం సొంతం చేసుకోవడం క్షేత్రస్థాయి వ్యూహ∙ఫలితం. ఎగ్జిట్ పోల్స్‌లో ఓట్ల శాతం అంచనా కాస్త అటూ ఇటూగా అంతేవున్నా, వచ్చే సీట్ల సంఖ్యపై అతిగా జోస్యం చెప్పడం ఎదురుతన్నింది. వెరసి, ఎగ్జిట్ పోల్స్ కచ్చితత్వాన్ని అనుమానంలోకీ, నిర్వాహకుల్ని ఆత్మపరిశీలనలోకీ నెట్టాయి.
ఆప్, కాంగ్రెస్ గనక కలసి పోటీ చేసివుంటే, ఆ రాష్ట్ర ఫలితాలు కచ్చితంగా మరోలా ఉండేవని ఓట్ షేర్ శాతాన్ని బట్టి విశ్లేషణ. కశ్మీర్‌లో వాస్తవం గుర్తించి, పొత్తు పెట్టుకున్న కాంగ్రెస్ ఆ పని హర్యానాలో చేయకపోవడమే విడ్డూరం. ఇప్పుడిక రానున్న మహారాష్ట్ర, జార్ఖండ్, ఢిల్లీ ఎన్నికలపైకి ఫోకస్ మారనుంది. ఇప్పటికే హర్యానా ఫలితానికి కాంగ్రెస్‌ను ఆప్ తప్పుబట్టడం మొదలుపెట్టింది.
మరి, ఫిబ్రవరిలోగా జరగనున్న ఢిల్లీ ఎన్నికలకైనా ఈ పార్టీలు జత కడతాయో, లేదో చూడాలి. ఏమైనా, తప్పక గెలుస్తారనుకున్న ఎన్నికల్లో సైతం ఆఖరి క్షణంలో కోరి చేతులారా ఓటమి కొని తెచ్చుకోవడం కాంగేయులకు పరిపాటి అయింది. క్షేత్రస్థాయి లోపాల్ని సరిదిద్దక, పోటీకి ముందే గెలుపు ధీమాతో అతిగా వ్యవహరిస్తే ఎవరికైనా ఎదురుదెబ్బలు ఖాయమని గుర్తిస్తే మంచిది.
అనుకున్నదొకటి... అయ్యిందొకటి!
Published Wed, Oct 9 2024 4:29 AM | Last Updated on Wed, Oct 9 2024 4:29 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment