బీజేపీ హ్యాట్రిక్ కలలు కల్లలే!
ఎగ్జిట్ పోల్స్ ఏకగ్రీవ జోస్యం
కశ్మీర్లో ఎన్‌సీ–కాంగ్రెస్‌కి మొగ్గు
న్యూఢిల్లీ: హరియాణాలో బీజేపీ హ్యాట్రిక్ కలలకు కాంగ్రెస్ గండి కొట్టడం ఖాయమని ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి. శనివారం జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించనుందని ఇండియాటుడే మొదలుకుని పీపుల్స్ పల్స్ దాకా అన్ని పోల్స్ ముక్త కంఠంతో పేర్కొన్నాయి. ఆ పార్టీ అలవోకగా మెజారిటీ మార్కును దాటేస్తుందని జోస్యం చెప్పాయి. ఆప్ సున్నా చుడుతుందని, ప్రాంతీయ పార్టీల్లో ఐఎన్‌ఎల్‌డీ 2 నుంచి 4, జేజేపీ ఒకటి నుంచి రెండు స్థానాలకు పరిమితమవుతాయని పేర్కొన్నాయి. ఇక జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్, కాంగ్రెస్ సంకీర్ణం ఆధిక్యం సాధిస్తుందని తెలిపాయి.
ఆ కూటమికి మెజారిటీ రావచ్చని ఇండియాటుడే, పీపుల్స్ పల్స్ పేర్కొనగా అందుకు అతి సమీపానికి వస్తుందని చాలా పోల్స్ అంచనా వేశాయి. బీజేపీకి 20 నుంచి 35 స్థానాల వరకు రావచ్చని పేర్కొన్నాయి. ఎన్‌సీ ఏకైక పెద్ద పార్టీగా అవతరిస్తుందని అభిప్రాయపడ్డాయి. మరో ప్రాంతీయ పార్టీ పీడీపీకి 6 నుంచి గరిష్టంగా 18 స్థానాలిచ్చాయి.
ఈ అంచనాలను ఫక్తు టైంపాస్ వ్యవహారంగా ఆ పార్టీ నేత ఒమర్ అబ్దుల్లా కొట్టిపారేశారు. తమకు స్పష్టమైన మెజారిటీ ఖాయమన్నారు. బీజేపీ మాత్రం తామే అతి పెద్ద పార్టీగా అవతరిస్తామని ధీమా వెలిబుచ్చింది. జమ్మూకశ్మీర్‌లో సెపె్టంబర్ 18, 25, అక్టోబర్ 1న మూడు విడతలుగా పోలింగ్ జరిగింది. హరియాణాలో పోలింగ్ ప్రక్రియ శనివారం ఒకే విడతలో ముగిసింది. రెండు రాష్ట్రాల్లోనూ అక్టోబర్ 8న ఫలితాలు వెల్లడవనున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment