అక్టోబర్ 8 నాటి ఎన్నికల ఫలితాలు కేంద్రంలోని అధికార ఎన్డీఏ కూటమికీ, ప్రతిపక్ష ‘ఇండియా’ కూటమికీ సమాన స్కోర్లు అందించాయి. హర్యానాలో బీజేపీ, జమ్ము–కశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) – కాంగ్రెస్ కూటమి విజయం సాధించడంతో లెక్క సమం అయింది. అయితే, ఈ ఫలితాల అసలు ప్రభావం ఈ అంకెల లెక్కకు మించినది. అన్ని అంచనాలనూ తలకిందులు చేస్తూ... హర్యానాలో వరుసగా మూడోసారి విజయంతో బీజేపీ రికార్డ్ సృష్టించడం ఒక ఎత్తయితే, జమ్ము–కశ్మీ ర్‌లో దాదాపు ఆరేళ్ళ పైచిలుకు తర్వాత మళ్ళీ ప్రజలెన్నుకున్న ప్రభుత్వం కొలువు తీరనుండడం మరో ఎత్తు. కశ్మీర్ ఎన్నికల ఫలితాలు అనేక కారణాల రీత్యా అత్యంత కీలకమైనవి.
వాటి ప్రకంపనలు, ప్రభావం కేవలం ఆ ప్రాంతానికే పరిమితం కావు. లెఫ్టినెంట్ గవర్నర్‌కు ప్రాధాన్యమిచ్చి, శాసనవ్యవస్థ అధికారానికి రెక్కలు కత్తిరించిన పరిస్థితుల్లో కశ్మీర్‌లో ప్రభుత్వాన్ని నడపడం కత్తి మీద సాము కానుంది. అదే సమయంలో రాష్ట్రహోదాను పునరుద్ధరించాలన్న ప్రజాకాంక్ష అక్కడి ఎన్నికల ఫలితాల్లోనూ ప్రతిఫలించడంతో ఎన్సీ కూటమి ఆ దిశగా కృషి చేయాల్సి ఉంటుంది. రాష్ట్ర హోదాపై ఎన్నికల వేళ ఇచ్చిన హామీని కేంద్ర పెద్దలు, బీజేపీ అధినాయకులు నిలబెట్టుకుంటారా, లేక తమ పార్టీ అధికారంలోకి రాలేదు గనక ‘అంతా తూbŒ ’ అనేస్తారా అన్నది చర్చనీయాంశమైంది.
కశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370 రద్దు తర్వాత, రాష్ట్రాన్ని జమ్ము – కశ్మీర్, లద్దాఖ్ అంటూ రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత జరిగిన తొట్టతొలి ఎన్నికలు ఇవే. ఆసక్తిగా చూస్తుండగా, పోటాపోటీగా, అదే సమయంలో శాంతియుతంగా ఈ ఎన్నికలు సాగడం విశేషం. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల కన్నా 5 శాతం పైచిలుకు ఎక్కువగా, పెద్దయెత్తున 63.9 శాతం వరకు ఓటింగ్ జరగడం గమనార్హం.
అంటే, ఎన్నికల ప్రజాస్వామ్యం వైపు ప్రజల మొగ్గు సుస్పష్టం. జనమిచ్చిన మెజారిటీతో కశ్మీర్‌లో ఇక ఎన్సీ – కాంగ్రెస్ కూటమి ప్రభుత్వం కొలువు తీరనుంది. అతి పెద్ద పార్టీగా అవతరించిన ఎన్సీ పక్షాన ఒమర్ అబ్దుల్లా సీఎం కానున్నారు. ఇలా కశ్మీర్‌లో ప్రజాస్వామ్యబద్ధ ప్రభుత్వం తిరిగి రావడం ఒక శుభసూచన. ఎన్నికైన సర్కారుండడంతో స్థానిక ప్రజలు తమ కష్టనష్టాల పరిష్కారానికై ప్రజాప్రతినిధుల్ని ఆశ్రయించే వీలు చిక్కింది.
అతివాద బీజేపీని ద్వితీయ స్థానానికే పరిమితం చేసి, మితవాద దృక్పథమున్న ఎన్సీకి పట్టం కట్టడం ద్వారా ప్రజాపాలనకై తాము తహతహలాడుతున్నట్టు కశ్మీరీలు చెప్పకనే చెప్పారు. ఒమర్ తండ్రి ఫరూఖ్ అబ్దుల్లా నేతృత్వంలోని ఎన్సీ – కాంగ్రెస్ కూటమి కశ్మీర్ లోయ వరకు మొత్తం 47 సీట్లలో 42 స్థానాలను గెలవడం విశేషం. ముస్లిమ్ జనాభా అధికంగా ఉండే లోయలో కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల పట్ల స్థానిక ప్రజల వ్యతిరేకతకు అది అద్దం పడుతోంది.
ఇక లోయలో ఖాతా తెరవలేకపోయినా, హిందువులు ఎక్కువైన జమ్ములో మాత్రం పోటీ చేసిన 43 సీట్లలో 29 గెలిచి, బీజేపీ తన బలం నిరూపించుకుంది. కాంగ్రెస్ మొత్తం 6 సీట్లలో విజయంతో మూడో స్థానంలో నిలిచింది. మెహబూబా ముఫ్తీ సారథ్యంలోని పీడీపీ 3 సీట్లు, ‘ఇంజనీర్’ రషీద్ సారథ్యంలోని వేర్పాటువాద అవామీ ఇత్తెహాద్ పార్టీ ఒక సీటే గెలిచి, బరిలో చతికిలబడ్డాయి.
ఒకప్పుడు ఉమ్మడి కశ్మీర్‌కు సీఎంగా పనిచేసిన ఒమర్ ఇప్పుడు లద్దాఖ్‌ను విడగొట్టిన తర్వాత ఏర్పడ్డ విభజిత కశ్మీర్‌కు తొలి సీఎం. కానీ, ప్రభుత్వాన్ని నడపడం సులభం కాదు. సవాళ్ళు తప్పవు. ఆ మాట అంగీకరిస్తూనే, కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు పెట్టుకుంటామనీ, అదే సమయంలో రద్దయిన ప్రత్యేక ప్రతిపత్తి ఆర్టికల్ 370 పునరుద్ధరణకు డిమాండ్ చేస్తూనే ఉంటామనీ ఒమర్ స్పష్టం చేశారు.
అది ఆయన అనివార్యత, లోయ ప్రజల ఆకాంక్ష. అయితే అంతకన్నా ముఖ్యం... జనం వర్గాలుగా చీలి, ఓటేసిన నేపథ్యంలో జమ్మూను వేరుగా చూడకుండా కలుపుకొని పోతూ, అక్కడి ప్రజాప్రతినిధులకు క్యాబినెట్‌లో పెద్దపీట వేయడం! ఆ సంగతి ఒమర్‌కూ తెలుసు. జమ్ముతో పోలిస్తే కశ్మీర్ లోయలోనే ఎక్కువ స్థానాలొచ్చినా రెండు ప్రాంతాలూ తమకు సమానమే ననీ, అందరి ప్రభుత్వంగా ప్రాంతాల మధ్య అంతరాన్ని తొలగిస్తామనీ ఆయన ప్రకటించారు.
ఆర్టికల్ 370 పాత చరిత్ర, తప్పొప్పుల మాట అటుంచితే, అంత కన్నా ముఖ్యమైనది జమ్ము – కశ్మీర్‌కు రాష్ట్ర హోదాను పునరుద్ధరించడం! ఎందుకంటే, కేంద్రపాలిత ప్రాంతమయ్యే సరికి 370 రద్దుకు ముందు రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నన్ని అధికారాలు ఉండవు. చివరకు పోలీసులు సైతం కేంద్రం కనుసన్నల్లోనే ఉంటారు. ఎన్నికలు పూర్తయి, ప్రజాప్రభుత్వం వచ్చింది గనక, తక్షణమే రాష్ట్రహోదా దిశగా అడుగులేయాలి.
గత డిసెంబర్‌లో సుప్రీమ్‌కోర్ట్ సైతం సత్వరమే పూర్తిస్థాయి రాష్ట్ర హోదాను పునరుద్ధరించాలని చెప్పిందన్నది గమనార్హం. అన్ని రాజకీయ పక్షాలూ కోరు తున్నట్టు ఆ విషయంలో కేంద్రం తన హామీని నిలబెట్టుకోవాలి. కశ్మీర్‌లో సైతం అన్ని రాష్ట్ర ప్రభు త్వాల తరహాలోనే కొత్త సర్కార్ పని చేసే వీలు కల్పించాలి. కశ్మీర్‌కి ప్రత్యేక భౌగోళిక, సాంస్కృతిక చరిత్ర ఉన్న మాట నిజమే కానీ, దాన్ని గుర్తిస్తూనే ఆ ప్రాంతం మిగతా దేశంతో కలసి అడుగులు వేసేలా కృషి సాగాలి.
యువతరంలో నిరుద్యోగం దేశంలోనే అధికంగా ఉన్న ఆ ప్రాంత సామాజిక, ఆర్థిక పురోగతి అందుకు కీలకం. అలాగే గత అయిదేళ్ళలో స్థానిక ఆకాంక్షలకు భిన్నంగా తీసుకున్న మైనింగ్, భూసేకరణ లాంటి విధానాల పునఃసమీక్ష అవసరం. లెఫ్టినెంట్ గవర్నర్, కేంద్రం సహకరిస్తేనే అది సాధ్యం. లేదంటే, ఢిల్లీలో ఆప్ సర్కార్ తరహా కథే కశ్మీర్‌లో పునరావృతమవుతుంది. ఎన్నికలు జరిపి కూడా ప్రజాతీర్పును తోసిపుచ్చినట్టే అవుతుంది. పైగా, సరిహద్దులో శత్రు వులు పొంచి ఉండే సున్నితమైన ప్రాంతంలో అలాంటి రాజకీయ క్రీడలు ప్రమాదకరం.
సరికొత్త అధ్యాయమయ్యేనా?!
Published Thu, Oct 10 2024 4:44 AM | Last Updated on Thu, Oct 10 2024 4:44 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment