జమ్మూ– కశ్మీర్‌లో తొలి విడత పోలింగ్‌కు మరొక్క వారమే మిగిలింది. హర్యానాలో నామినేషన్ల దాఖలుకు గడువు నేటితో ముగియనుంది. ఈ పరిస్థితుల్లో కశ్మీర్‌లో ప్రచారం ఊపందుకుంటుంటే, హర్యానాలో అభ్యర్థుల ఖరారు తుది అంకానికి చేరింది. కశ్మీర్‌ను అటుంచితే... కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)ల మధ్య సీట్ల సర్దుబాటు విఫలమవడంతో హర్యానా ఆసక్తి రేపుతోంది. బహుముఖ పోటీ అనివార్యమయ్యేసరికి పరిస్థితి సంక్లిష్టంగా మారింది.
ఆప్ ఒంటరి పోరుకు దిగడమే కాక, మొన్నటి లోక్‌సభ ఎన్నికల్లో కలాయత్ లాంటి చోట్ల గెలిచిన ఊపుతో, సిట్టింగ్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలున్న స్థానాల్లో అభ్యర్థుల్ని నిలిపి, పట్టణ ప్రాంతాలకే కాక మిగతా చోట్లకూ తన ఉనికిని విస్తరించు కోవాలని సాహసిస్తోంది. వీధికెక్కి పోరాడినా, లైంగిక వేధింపుల సమస్యను పరిష్కరించని కేంద్ర సర్కార్ వైఖరితో విసిగిన రెజ్లర్లు వినేశ్ ఫోగట్, బజ్‌రంగ్ పూనియాలు కాంగ్రెస్‌లో చేరడంతో రాజకీయం మరింత వేడెక్కింది. మహిళా రెజ్లర్లపై జనంలో సానుభూతి, పాలకుల నిర్లక్ష్యంతో రైతుల ఆగ్రహం, జాట్లు సహా వివిధ వర్గాల్లో అసంతృప్తి మధ్య అధికార బీజేపీ ఎదురీదుతోంది.
మొత్తం 90 స్థానాలకు గాను కాషాయపార్టీ ఇప్పటికే 87 స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించింది. మిగతా 3 స్థానాలను హర్యానా లోక్‌హిత్ పార్టీ (హెచ్‌ఎల్పీ) లాంటి చిరు మిత్రపక్షాల కోసం అట్టి పెట్టింది. అభ్యర్థుల ప్రకటనపై పార్టీలో తీవ్ర అసంతృప్తి చెలరేగింది. తొలి విడత అభ్యర్థుల జాబితా ప్రకటనతోనే అసంతృప్తి జ్వాలలు రగిలినా, రెండో విడత జాబితా కూడా ప్రకటించేసరికి అది మరింత పైకి ఎగసింది. పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలకూ, మంత్రులకూ, మాజీ మంత్రులకూ టికెట్లు నిరాకరించేసరికి సమస్య పెద్దదైంది.
పార్టీ రాష్ట్ర శాఖ ఆఫీస్ బేరర్ల మొదలు పలువురు సీనియర్ నాయకులు రాజీనామా చేయడం గమనార్హం. బీజేపీ హర్యానా శాఖ వైస్ ప్రెసిడెంటైన మాజీ డిప్యూటీ స్పీకర్, అలాగే రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి, కొందరు మంత్రులు, మాజీ మంత్రులు సైతం అసెంబ్లీ టికెట్ దక్కలేదని కినుక వహించి, పార్టీని వీడారంటే పరిస్థితిని అర్థం చేసు కోవచ్చు. క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న అసలైన కార్యకర్తల్ని నిర్లక్ష్యం చేసి, పనిచేయనివారికీ, అసలు ఆ నియోజకవర్గ పౌరులే కానివారికీ సీట్లు కేటాయిస్తోందని సొంత పార్టీ వారే ఆరోపిస్తున్నారు.
నిజానికి ఇతర వెనుకబడిన కులాలకు (ఓబీసీ) చెందిన నయబ్ సైనీని కొంతకాలం క్రితం సీఎంను చేశాక హర్యానాలో పార్టీ గ్రాఫ్ కొంత పెరిగింది. ఇప్పుడూ సైనీనే సీఎం అభ్యర్థిగా చూపుతూ బీజేపీ ఎన్నికలకు వెళుతోంది. అయితే, ఆచరణలో మాత్రం ఆయన ప్రమేయం పెద్దగా లేకుండానే బీజేపీ టికెట్ల కేటాయింపు ప్రక్రియ జరిగిపోయిందని చెబుతున్నారు. ఏళ్ళ తరబడిగా పార్టీ కోసం పనిచేస్తున్నవారిని కాదని కొత్తవారికీ, ఇతర పార్టీల నుంచి ఫిరాయించి వచ్చిన వారికీ బీజేపీ పట్టం కట్టడం సైతం రేపు ఎన్నికల్లో పార్టీని కొంత దెబ్బ తీయవచ్చు.
దానికి తోడు పార్టీలో అంతర్గత విభేదాలు, ఆశావహ సీఎం అభ్యర్థుల తాకిడి ఉండనే ఉన్నాయి. పదేళ్ళుగా అధికారంలో కొనసాగాక బీజేపీకి ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం చిత్రమే. ఈసారి ఎన్నికల్లోనూ గెలిచి, వరు సగా మూడోసారి గద్దెనెక్కాలని చూస్తున్న కాషాయపార్టీకి ఇప్పుడది సులభం కాకపోవచ్చు. కాంగ్రెస్ పుంజుకున్నట్టు కనిపిస్తోంది. పైగా ఎన్నికలంటే ఎక్కడైనా అధికార పక్షం పట్ల వ్యతిరేకత సహజం. బీజేపీలోని వర్గవిభేదాలు, రైతులు – జాట్ల లాంటి వర్గాలతో సహా గ్రామీణ ప్రాంతాల్లో దాని పట్ల అసంతృప్తి కనిపిస్తున్నాయి. ఇవన్నీ కలసి అక్టోబర్ 8న పోలింగ్‌లో విపక్షానికి అనుకూలించవచ్చు.
లోక్‌సభ ఎన్నికల ఫలితాల సరళి, ప్రాథమిక ఒపీనియన్ పోల్స్‌ను బట్టి చూస్తే, కాంగ్రెస్‌కు కొంత అనుకూలత కనిపిస్తోంది. కానీ, అంతర్గత విభేదాలు ఆ పార్టీనీ పీడిస్తున్నాయి. స్వతంత్రు లుగా బరిలోకి దిగే అసమ్మతులతో అన్ని పార్టీలకూ చిక్కే. మరోపక్క ఎన్నికలిప్పుడు బీజేపీ,కాంగ్రెస్, ఆప్‌ల మధ్య త్రిముఖ పోటీ కావడంతో అధికారపక్ష వ్యతిరేక ఓటు ఏ మేరకు చీలుతుంది, అది బీజేపీకి ఎంత మేర లాభిస్తుంది అన్నది ఆసక్తికరం. గతంలోకి వెళితే –∙2019 ఎన్నికల్లో హర్యా నాలో హంగ్ అసెంబ్లీ ఏర్పడింది. అంతకు పదేళ్ళ ముందూ అలాగే జరిగింది.
అలాంటి పరిస్థితుల్లో చిన్న పార్టీల వారు, స్వతంత్రులు కీలకమవుతారు. ఈ ‘ఇతరులు’ పాతికేళ్ళ క్రితం 30 శాతం ఓట్లు సాధిస్తే, క్రితంసారి అది 18 శాతానికి పడిపోయింది. అయితేనేం, ప్రతిసారీ వారు 8 నుంచి 16 సీట్ల మధ్య గెలుస్తున్నారని మర్చిపోలేం. 2009లో కాంగ్రెస్ స్వతంత్రులు, చిన్న పార్టీల మద్దతుతోనే గద్దెనెక్కింది. 2019లో బీజేపీ సైతం జననాయక్ జనతా పార్టీ (జేజేపీ)తో ఎన్నికల అనంతర పొత్తుతోనే అధికారం చేపట్టింది. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో ‘ఇతరుల’కు 8 శాతం ఓట్లే వచ్చినా, స్థానిక అంశాలు ప్రధానమయ్యే అసెంబ్లీ ఎన్నికల్లో వారి పాత్ర గణనీయమవుతుంది.
కాకపోతే, స్థానికమైన జేజేపీ గ్రామీణ ప్రాంతాల్లోని తన పట్టును నిలుపుకోలేకపోతోందనీ, సాంప్ర దాయిక రైతు ఓటర్లున్న ఇండియన్ నేషనల్ లోక్‌దళ్ (ఐఎన్‌ఎల్డీ) బలం ప్రస్తుతం కొద్ది స్థానాలకే పరిమితమనీ విశ్లేషకులు చెబుతున్నారు. అదే సమయంలో పెరుగుతున్న నిరుద్యోగం, లోపించిన పారిశ్రామికీకరణ, వివాదాస్పద అగ్నిపథ్ పథకం లాంటి అంశాలు బీజేపీని వెనక్కి లాగుతున్నాయి.
హర్యానా జనాభా 20 శాతం దళితులే. తాజా లోక్‌సభ ఎన్నికల్లో వారిలో 68 శాతం మంది, అలాగే సగానికి పైగా ఓబీసీలు ‘ఇండియా’ కూటమికి మద్దతునిచ్చినట్టు విశ్లేషణ. ఇప్పుడూ అదే ధోరణి కొనసాగి, జాట్లు సహా ఇతర చిరకాల సమర్థక వర్గాల నుంచి విపక్షానికే మద్దతుంటే... అధికార పక్షా నికి చిక్కులు తప్పకపోవచ్చు. నిరుడు కర్ణాటక లానే ఇప్పుడు హర్యానాలో బీజేపీకి శృంగభంగం జరగవచ్చు. అక్టోబర్ 5న జరగనున్న ఎన్నికలు బీజేపీ ప్రతిష్ఠకు పెనుసవాలుగా మారింది అందుకే!
Haryana: ఆసక్తికరమైన పోరు
Published Thu, Sep 12 2024 12:23 AM | Last Updated on Mon, Sep 16 2024 11:51 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment