జమ్ముకశ్మీర్, హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆధ్యంతం ఉత్కంఠభరితంగా సాగాయి. రెండు రాష్ట్రాల్లోనూ ఎగ్జిట్ పోల్స్ అంచనాలు తారుమారవ్వడంతో.. పార్టీలు కంగుతున్నాయి. హర్యానా పోరులో బీజేపీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది.90 స్థానాలకు గానూ 48 చోట్ల విజయ కేతనం ఎగురవేసి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్దమైంది.. ఇక హర్యానా ఫలితాలు హస్తానికి తీవ్ర నిరాశపరిచాయి. ఈసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం పక్కా అంటూ ధీమా మీదున్న కాంగ్రెస్ కేవలం 37 స్థానాలకే పరిమితమైంది.
అటు జమ్మూకశ్మీర్‌లో నేషనల్ కాన్ఫరెన్స్ - కాంగ్రెస్ కూటమికి ఓటర్లు స్పష్టమైన మెజార్టీ ఇచ్చారు. మెజార్టీ ఫిగర్‌ను దాటి 49 స్థానాలను గెలుచుకుంది. దీంతో ఎన్సీ నేత ఓమర్ అబ్దుల్లా జమ్ముకశ్మీర్ సీఎంగా అవతరించనున్నారు. బీజేపీ 29 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే రెండు రాష్ట్రాల్లోనూ పలువురు ప్రముఖ నేతలకు ఫలితాలు షాక్ ఇచ్చాయి. పార్టీ చీఫ్‌లు, మాజీ సీఎంలు ఓటమిని చవిచూశారు.. వారిలో
హర్యానా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్
హర్యానా కాంగ్రెస్ అధ్యక్షుడు ఉదయ్ భాన్ హోడల్ అసెంబ్లీ నియోజకవర్గంలో పరాజయం పాలయ్యారు. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భాన్.. బీజేపీ అభ్యర్థి హరీందర్ సింగ్ చేతిలో 2,500 ఓట్ల తేడాతో ఓడిపోయారు, 2014 అసెంబ్లీ ఎన్నికల్లో హోడల్ సీటును గెలుచుకున్న ఆయనతే 2019 ఎన్నికల్లో బీజేపీకి చెందిన జగదీష్ నాయర్ చేతిలో ఓడిపోయారు. ఇక 2022 నుంచి హర్యానా కాంగ్రెస్ చీఫ్‌గా పనిచేస్తున్నారు.
అభయ్ చౌతాలా
ఐఎన్‌ఎల్‌డీకి చెందిన అభయ్ చౌతాలా ఎల్లినాబాద్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి భరత్ సింగ్ బెనివాల్ చేతిలో 15,000 ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు.
అనురాగ్ ధండా
కలయత్ నుంచి బరిలోకి దిగిన ఆప్ సీనియర్ నేత, రాష్ట్ర ఉపాధ్యక్షుడు అనురాగ్ ధండా ఓటమి చెందారు. కలయత్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగిన ధండా.. ఏడోస్థానానికి పరిమితమయ్యారు. ఇక్కడి నుంచి కాంగ్రెస్‌కు చెందిన వికాస్ సహారన్ గెలుపొందారు.
దుష్యంత్ చౌతాలా
జననాయక్ జనతాపార్టీ నాయకుడు దుష్యంత్ చౌతాలా భారీ ఓటమిని ఎదుర్కొన్నారు. ఉచానా కలాన్ నుంచి బరిలో దిగిన దుష్యంత్ చౌతాలా .. ఐదో స్థానానికి పరిమితయ్యారు. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ భుజ్ 32 ఓట్ల తేడాతో సమీప ప్రత్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఐఏఎస్ అధికారి బ్రిజేంద్ర సింగ్‌పై విజయం సాధించారు.
దిగ్విజయ్ సింగ్ చౌతాలా
ననాయక్ జనతాపార్టీ మరో నేత దిగ్విజయ్ సింగ్ చౌతాలా దబ్వాలి నియోజకవర్గం నుంచి ఓటమిని చవిచూశారు. తన దూరపు బంధువు ఆదిత్య దేవి లాల్ చేతిలో ఓడిపోయారు. కాగా దిగ్విజయ్, ఆదిత్య ఇద్దరూ హర్యానా మాజీ ముఖ్యమంత్రి దేవి లాల్‌తో బంధుత్వం కలిగి ఉన్నారు. వీరు భారతదేశ ఉప ప్రధానమంత్రిగా కూడా పనిచేశారు.
గెలిచిన ప్రముఖులు
హర్యానా సీఎం నాయబ్ సింగ్ సైనీ ఘన విజయం సాధించారు. లాడ్వా అసెంబ్లీ సెగ్మెంట్ నుంచి బరిలోకి దిగిన సైనీ.. సమీప కాంగ్రెస్ అభ్యర్థి మేవా సింగ్ సింగ్రోహాపై గెలుపొందారు.
హర్యానా మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత భూపిందర్ సింగ్ హుడా విజయం సాధించారు. గర్హి సంప్లా-కిలోయ్ నియోజకవర్గం నుంచి బీజేపీ అభ్యర్థిపి మంజుపై 71, 465 ఓట్ల తేడాతో గెలుపొందారు.
స్వతంత్ర అభ్యర్థి, భారతదేశపు అత్యంత సంపన్న మహిళ సావిత్రి జిందాల్ హిసార్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. ఆమె బీజేపీకి చెందిన కమల్ గుప్తా, కాంగ్రెస్ అభ్యర్థి రామ్ నివాస్ రారాపై 18,941 ఓట్ల తేడాతో విజయం సాధించారు. జిందాల్ కుటుంబానికి చెందిన 74 ఏళ్ల మాతృమూర్తి.. మూడోసారి హిసార్‌లో గెలిచారు, గతంలో 2005, 2009లో కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచారు.
భారత రెజ్లర్, కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలోకి దిగిన వినేశ్ ఫొగట్ హర్యానా ఎన్నికల్లో విజయం సాధించారు. జులానా నియోజవర్గంలో తమ ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌పై 5763 ఓట్ల తేడాతో వినేశ్ పైచేయి సాధించారు.
జమ్ము కశ్మీర్- ఓటమి చెందిన నాయకులు
ఇల్తిజా ముఫ్తీ
పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి, జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ కూతురు ఇల్తిజా ముఫ్తీఓటమి పాలయ్యారు. శ్రీగుఫ్వారా – బిజ్‌బెహరా నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ అభ్యర్థి బషీర్ అహ్మద్ చేతిలో ఓటమి చవిచూశారు. ఈ మేరకు తన ఓటమిని ఇల్తిజా అంగీకరించారు. ప్రజా తీర్పును గౌరవిస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ పెట్టారు. తన గెలుపు కోసం కష్టపడిన పీడీపీ కార్యకర్తలకు ఈ సందర్భంగా ఆమె కృతజ్ఞతలు తెలిపారు.
బీజేపీ చీఫ్ రవీందర్ రైనా
నౌషేరా నియోజకవర్గం నుంచి పోటీ చేసిన రాష్ట్ర బీజేపీచీఫ్ రవీందర్ రైనా ఓటమి చెందారు. నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్ధి సురీందర్ చౌదరి చేతిలో 7, 819ఓట్ల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూశారు. ఈసీ ప్రకారం.. చౌదరికి 35,069 ఓట్లు రాగా, రైనాకు 27,250 ఓట్లు వచ్చాయి.
- పార్లమెంటుపై దాడి కేసులో దోషిగా ఉన్న అఫ్జల్ గురు సోదరుడైన స్వతంత్ర అభ్యర్థి ఐజాజ్ అహ్మద్ గురూ ఉత్తర కాశ్మీర్‌లోని సోపోర్ నియోజకవర్గంలో 26,846 ఓట్ల తేడాతో ఓడిపోయారు. ఇక్కడి నుంచి నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ఇర్షాద్ రసూల్ కర్ విజయం సాధించారు.
- జమ్మూకశ్మీర్ అప్నీ పార్టీ అధినేత సయ్యద్ అల్తాఫ్ బుఖారీ శ్రీనగర్‌లోని చన్నపోరా నియోజకవర్గంలో నేషనల్ కాన్ఫరెన్స్ అభ్యర్థి ముస్తాక్ గురూ చేతిలో ఓడిపోయారు.
- జమ్ముకశ్మీర్‌లోని రియాసి నుంచి బీజేపీ నేత కుల్దీప్ రాజ్ దూబే 18815 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాంగ్రెస్‌కు చెందిన ముంతాజ్ అహ్మద్‌ను ఓడించాడు.
- ఇక జమ్ముకశ్మీర్ నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా తాను పోటీ చేసిన గందర్ బాల్, బుద్గాం స్థానాల్లో విజయం సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment