
కాంగ్రెస్‌ను 3న ఆహ్వానించిన ఈసీ
సాక్షి, న్యూఢిల్లీ: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు ప్రతీ దశలోనూ పారదర్శకంగా జరిగాయని కేంద్ర ఎన్నికల సంఘం(సీఈసీ) స్పష్టం చేసింది. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోలింగ్, కౌంటింగ్ సమయంలో అవకతవకలు జరిగాయని, ఆధారాలు చూపేందుకు అపాయింట్‌మెంట్ ఇవ్వాలని కాంగ్రెస్ రాసిన లేఖకు ఈసీ స్పందించింది. అనుమానాల నివృత్తి కోసం డిసెంబర్ 3న ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందాన్ని ఈసీ ఆహ్వానించింది. ఎన్నికల ప్రక్రియ ప్రతి దశలోనూ కాంగ్రెస్‌తోపాటు అన్ని రాజకీయ పార్టీ అభ్యర్థులు/ఏజెంట్ల ప్రమేయం ఉందని వివరించింది.
ఓటింగ్ సరళిపై ఎలాంటి అనుమానాలకు అక్కర్లేదని, పోలింగ్ బూత్‌ల వారీగా అభ్యర్థులందరికీ ఆ డేటాను పూర్తిస్థాయిలో అందుబాటులో ఉంచామని నొక్కి చెప్పింది. కాంగ్రెస్ పార్టీకి ఉన్న చట్టపరమైన ఆందోళనలను, అనుమానాలను పరిశీలించి రాతపూర్వకంగా బదులిస్తామని ఈసీ స్పష్టం చేసింది. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో 288 స్థానాలకు మహాయుతి కూటమిలోని బీజేపీ 132, శివసేన (షిండే) 57, ఎన్సీపీ (అజిత్) 41 సీట్లు సాధించగా, మహా వికాస్ అఘాడీ పక్షాలైన కాంగ్రెస్‌కు 16, శివసేన (ఉద్ధవ్)కు 20, ఎన్సీపీ (శరద్) పార్టీకి 10 స్థానాలు దక్కడం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment