ముంబై: మహారాష్ట్రలో కాంగ్రెస్ అతి విశ్వాసమే అసెంబ్లీ ఎన్నికల్లో మహా వికాస్ అఘాడీ కూటమి ఓటమికి కారణమని మిత్ర పక్షం శివసేన ఆరోపించింది. ఎంవీయేలో సీట్ల పంపకాల విషయంలో కాంగ్రెస్ ప్రదర్శించిన వైఖరి.. కూటమి విజయావకాశాలను దెబ్బతిశాయని సంచలన వ్యాఖ్యలు చేసింది. ఈ మేరకు శివసేన(యూబీటీ) సీనియర్ నేత, మహారాష్ట్ర లెజిస్లేటివ్ కౌన్సిల్ ప్రతిపక్ష నేత అంబాదాస్ దాన్వే మాట్లాడుతూ.. ఉద్ధవ్ ఠాక్రేను ముఖ్యమంత్రి అభ్యర్థిగా పేర్కొంటూ మహా వికాస్ అఘాడి ఎన్నికలకు వెళ్లాల్సిందని అన్నారు.
"లోక్‌సభ ఎన్నికల ఫలితాల తర్వాత హర్యానా, జమ్మూ కాశ్మీర్‌లో మాదిరిగానే మహారాష్ట్రలోనూ కాంగ్రెస్‌కు మితిమీరిన ఆత్మవిశ్వాసం ఉంది. ఇదే ఫలితాల్లో ప్రతిబింబించింది. సీట్ల పంపకాల చర్చల సమయంలో కాంగ్రెస్ వైఖరి మమ్మల్ని బాధించింది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఉద్దవ్‌ను ప్రకటించాల్సి ఉండేది. అలా చేయకపోవడం మా అవకాశాలను దెబ్బతీసింది. అలా చేసి ఉంటే ఫలితాలు మరోలా ఉండేవి.’ దాన్వే పేర్కొన్నారు.
కాగా ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో మహారాష్ట్రకు సంబంధించిన 48 స్థానాల్లో మహా వికాస్ అఘాడి అత్యధికంగా 30 చోట్ల గెలుపొందింది. మిత్ర పక్షాలతో పోలిస్తే కాంగ్రెస్ ఎక్కువగా 13 స్థానాల్లో విజయం సాధించింది. ఇదే జోష్ మీదున్న కాంగ్రెస్.. రాష్ట్ర ఎన్నికలకు ముందు సీట్ల భాగస్వామ్య చర్చల సమయంలో గట్టిగా బేరసారాలు చేసింది. ఇది కూటమిలో ఘర్షణకు దారితీసింది.
చివరకు 103 స్థానాల్లో పోటీ చేసినా కేవలం 16 మాత్రమే గెలుపొందింది. 89 స్థానాల్లో పోటీ చేసిన సేన (యూబీటీ) 20 స్థానాల్లో విజయం సాధించింది. మూడో మిత్రపక్షమైన శరద్ పవార్ ఎన్సీపీ 87 స్థానాల్లో పోటీ చేసి 10 స్థానాల్లో విజయం సాధించింది.
మరోవైపు శనివారం వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ సారథ్యంలోని పాలక మహాయుతి కూటమి అఖండ విజయం సాధించిన విషయం తెలిసిందే. బీజేపీ 132 చోట్ల విజయం కేతనం ఎగురవేసి అతిపెద్ద పార్టీగా అవతరించింది. షిండే శివసేన 57 స్థానాల్లో గెలుపొందగా.. అజిత్‌పవార్ ఎన్సీపీ41 చోట్ల విజయం సాధించింది.
Comments
Please login to add a commentAdd a comment