ముంబై: ఇటీవల జరిగిన మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీయే కూటమి భారీ విజయాన్ని నమోదు చేసిన విషయం తెలిసిందే. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలుండగా... మహాయుతి కూటమి 235 స్థానాల్లో విజయం సాధించింది. బీజేపీ 132 స్థానాలను గెలుచుకొని అతిపెద్ద పార్టీగా అవతరించింది. ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన 57, అజిత్ పవార్‌కు చెందిన ఎన్‌సీపీ 41 స్థానాలు దక్కించుకున్నాయి.
ఏ పార్టీకి దక్కని ప్రతిపక్ష హోదా!
ఊహించని విధంగా రికార్డు బద్దలు కొడుతూ భారీ మెజార్టీతో మహాయుతి కూటమి విజయ దుందుభి మోగించగా ప్రతిపక్ష నేత ఎవరనేదానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. ప్రతిపక్షంలోని ఏ పార్టీ కూడా పది శాతం స్థానాలు రాబట్టుకోలేక పోయాయి. దీంతో ప్రతిపక్ష పదవిలో ఎవరు ఉండక పోవచ్చని తెలుస్తోంది. మహారాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు (ఎల్‌ఓపీ) లేకపోవడం ఆరు దశాబ్దాల తర్వాత ఇదే తొలిసారి.
రాష్ట్ర శాసన మండలి నియమాల ప్రకారం మొత్తం స్థానాల్లో పది శాతం స్థానాలు దక్కించుకున్న పార్టీకే ప్రతిపక్ష పదవి లభిస్తుంది. కానీ శనివారం వెలువడిన ఫలితాల్లో మహా వికాస్ అఘాడీలోని యూబీటీ, కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్పీ) మిత్రపక్షాల్లోని ఏ ఒక్క పార్టీకి పది శాతం స్థానాలు రాలేకపోయాయి.
ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ కూటమి కేవలం 49 చోట్ల గెలుపొందింది. ప్రస్తుతం కాంగ్రెస్ వద్ద 16, యూబీటీ–శివసేన వద్ద 20, ఎన్సీపీ (ఎస్పీ) వద్ద 10 స్థానాలున్నాయి. దీంతో ఏ పార్టీ వద్ద తగినంత సంఖ్యాబలం లేకపోవడంతో ప్రతిపక్ష పీఠంపై ఉత్కంఠ నెలకొంది.
సీఎం పీఠంపై వీడని ఉత్కంఠ
మరోవైపు మహారాష్ట్ర నూతన ముఖ్యమంత్రి ఎవరన్న దానిపై తీవ్ర ఉత్కంఠ నెలకొంది. మహాయుతి కూటమిలోని మూడు పార్టీల నేతలూ ఇందుకోసం పోటీ పడుతున్నట్టు సమాచారం. ప్రస్తుత సీఎం, శివసేన (షిండే) అధినేత ఏక్‌నాథ్ షిండే మరోసారి అవకాశం ఆశిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తం ఆ పోస్టు కోసం పోటీలో ఉన్నారు.
బీజేపీ మాత్రం ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర పార్టీ ముఖ్య నేత దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఇప్పటికే ఖరారు చేసినట్లు ప్రచారం సాగుతోంది. ప్రస్తుత శాసనసభ గడువు మంగళవారంతో తీరనుంది. కనుక ఆలోపు కొత్త సర్కారు కొలువుదీరడం తప్పనిసరి.
Comments
Please login to add a commentAdd a comment