ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహావికాస్ అఘాడి ఘోర పరాజయం పాలైన విషయం తెలిసిందే. 288 స్థానాలున్న అసెంబ్లీలో కాంగ్రెస్, ఎన్సీపీ(శరద్‌పవార్, శివసేన(ఉద్దవ్)చెందిన కూటమి కేవలం 49 స్థానాల్లోనే గెలుపొందింది. ప్రతిపక్ష కూటమిలో ప్రధాన పార్టీగా ఉన్న కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. దీంతో తీవ్ర ఓటమితో ఇప్పటికే ఖంగుతున్న ఎంవీఏ కూటమిలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి పార్టీ ఓటమికి బాధ్యత వహిస్తూ మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్ష పదవికి నానా పటోలే సోమవారం రాజీనామా చేశారు. మొత్తం 103 స్థానాల్లో పోటీ చేసిన కాంగ్రెస్ 16 స్థానాల్లో మాత్రమే గెలిచి 12.42 శాతం ఓట్లు సాధించింది. మహారాష్ట్ర ఏర్పడిన నాటినుంచి ఎన్నడూ లేనంత బలహీనంగా కాంగ్రెస్ మారిపోయింది.
ఇక సకోలీ నుంచి పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్ర చీఫ్ నానా పటోలే 208 ఓట్ల తేడాతో గట్టెక్కారు. ఈ క్రమంలోనే పార్టీ ఘోర పరాజయానికి బాధ్యత వహిస్తూ నానా పటోలే అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ అయిన పటోలే 2021లో మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఆ తర్వాత ఇటీవల జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచింది. 17 స్థానాలకు గాను 13 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది.
అయితే, ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో మాత్రం బోల్తా కొట్టింది. మొత్తం మీద 49 సీట్లు మాత్రమే గెలుచుకుంది. నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్చంద్ర పవార్) 10 సీట్లు, కాంగ్రెస్ 16, శివసేన (ఉద్దవ్) 20 సీట్లు గెలుచుకున్నాయి. మరోవైపు మహాయుతి కూటమి 233 స్థానాల్లో విజయం సాధించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment