మహారాష్ట్ర ఎన్నికల్లో మహాయుతి కూటమి గెలుపు ప్రభావం
మళ్లీ 80 వేల స్థాయిపైకి సెన్సెక్స్
24 వేల పాయింట్ల ఎగువకు నిఫ్టీ
ముంబై: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ప్రాతినిధ్యం వహించిన మహాయుతి కూటమి ఆఖండ విజయంతో బుల్ రెండోరోజూ రంకెలేసింది. సెన్సెక్స్ 993 పాయింట్లు పెరిగి 80 వేల స్థాయిపైన 80,110 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 315 పాయింట్లు లాభపడి 24 వేల స్థాయిపైన 24,221 వద్ద నిలిచింది. అంతర్జాతీయ ఈక్విటీ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయమే భారీ లాభాలతో మొదలయ్యాయి.
సెన్సెక్స్ 1,076 పాయింట్లు బలపడి 80,193 వద్ద, నిఫ్టీ 346 పాయింట్లు ఎగసి 24,253 వద్ద ట్రేడింగ్ ప్రారంభించాయి. అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో ఒక దశలో సెన్సెక్స్ 1,356 పాయింట్లు ఎగసి 80,473 వద్ద, నిఫ్టీ 445 పాయింట్లు దూసుకెళ్లి 24,352 వద్ద ఇంట్రాడే గరిష్టాలు నమోదు చేశాయి. డాలర్ మారకంలో రూపాయి విలువ 12 పైసలు బలపడి 84.29 స్థాయి వద్ద స్థిరపడింది.
అమెరికా ఆర్థికమంత్రిగా అంతర్జాతీయ ఇన్వెస్టర్, మార్కెట్‌కు అనుకూల ‘స్కాట్ బెసెంట్’ను ట్రంప్ నామినేట్ చేయడంతో ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో సానుకూల సంకేతాలు నెలకొన్నాయి. ఆసియాలో చైనా, హాంగ్‌కాంగ్, సింగపూర్ మినహా అన్ని దేశాల సూచీలు 1.50% ర్యాలీ చేశాయి. యూరప్ మార్కెట్లు అరశాతం లాభపడ్డాయి. అమెరికా మార్కెట్లు ఒకశాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
→ సెన్సెక్స్ సూచీలో 30కి 26 షేర్లూ లాభాలతో ముగిశాయి. అత్యధికంగా ఎల్‌అండ్‌టీ, ఎస్‌బీఐ, అదానీ పోర్ట్స్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు 4 – 2.50% లాభపడ్డాయి. బీఎస్‌ఈలో రంగాల వారీగా ఇండ్రస్టియల్, ఆయిల్‌అండ్‌గ్యాస్ 3%, ఇంధన 2.50%, రియల్టీ, బ్యాంకెక్స్, ఫైనాన్షియల్ సరీ్వసెస్ 2%, ఫార్మా సూచీలు ఒకశాతం లాభపడ్డాయి. మిడ్, స్మాల్ క్యాప్ సూచీలు వరుసగా 2% నుంచి ఒకటిన్నర శాతం పెరిగాయి.
→ అదానీ గ్రూప్ కంపెనీ షేర్లు మిశ్రమంగా స్పందించాయి. ఈ గ్రూప్‌లో పదింటికిగానూ అయిదు కంపెనీల షేర్లు లాభపడ్డాయి. అదానీ పోర్ట్స్ 2.55%, ఏసీసీ 2.54%, అదానీ ఎంటర్‌ప్రైజెస్ 1.26%, అదానీ విల్మార్ 2%, అంబుజా సిమెంట్స్ 1% లాభపడ్డాయి. అదానీ గ్రీన్ ఎనర్జీ 8%, అదానీ ఎనర్జీ సొల్యూషన్స్ 4%, అదానీ పవర్ 3%, ఎన్‌డీటీవీ 2%, అదానీ టోటల్ గ్యాస్ 1.50% నష్టపోయాయి.
→ బీఎస్‌ఈ సెన్సెక్స్ సూచీలో చోటు దక్కించుకోవడంతో జొమాటో కంపెనీ షేరు 3.58% పెరిగి రూ.274 వద్ద స్థిరపడింది. ఇంట్రాడేలో 7.62% ఎగసి రూ.284 వద్ద గరిష్టాన్ని తాకింది. ఇదే సూచీలో స్థానం కోల్పోయిన జేఎస్‌డబ్ల్యూ స్టీల్ షేరు 2.5% నష్టపోయి రూ. 953 వద్ద ముగిసింది.
గడిచిన రెండు రోజుల్లో సెన్సెక్స్ 2,954 పాయింట్లు(4%) ర్యాలీ చేయడంతో రూ.14.20 లక్షల కోట్ల సంపద సృష్టి జరిగింది. ఇన్వెస్టర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలోని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ.439.58 లక్షల కోట్ల (5.22 ట్రిలియన్ డాలర్లు)కు చేరింది. సోమవారం ఒక్కరోజే ఇన్వెస్టర్లు రూ.6.11 లక్షల కోట్లు ఆర్జించారు.
Comments
Please login to add a commentAdd a comment