vinod zutshi
-
‘రెండో దశ’లోనూ ఓట్ల చైతన్యం
జమ్మూకశ్మీర్‌లో 72%, జార్ఖండ్‌లో 65.46% పోలింగ్ శ్రీనగర్/జమ్మూ/రాంచీ: జమ్మూకశ్మీర్, జార్ఖండ్‌లలో మంగళవారం జరిగిన రెండో దశ అసెంబ్లీ ఎన్నికల్లోనూ ఓట్ల చైతన్యం వెల్లివిరిసింది. జమ్మూకశ్మీర్‌లోని 18 స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 72 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లోని 20 మావోయిస్టు ప్రభావిత నియోజకవర్గాలకు జరిగిన ఎన్నికల్లో 65.46 శాతం పోలింగ్ నమోదైంది. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడుల భయం, జార్ఖండ్‌లో మావోయిస్టుల దాడుల భయం మధ్య జరిగిన ఈ దశ పోలింగ్ ఒక్క అవాంఛనీయ ఘటనా జరగకుండానే ప్రశాంతంగా ముగియడం విశేషం. జమ్మూకశ్మీర్‌లో నవంబర్ 25న 15 సీట్లకు జరిగిన తొలి దశ ఎన్నికల్లో రికార్డు స్థాయిలో 71.28 శాతం పోలింగ్ నమోదవగా, జార్ఖండ్‌లో 13 సీట్లకు అదే రోజు జరిగిన తొలి దశ ఎన్నికల్లో 61.92 శాతం పోలింగ్ నమోదవడం తెలిసిందే. వేర్పాటువాదులకు చెంపపెట్టు జమ్మూకశ్మీర్‌లో వేర్పాటువాదుల ఎన్నికల బహిష్కరణ పిలుపును బేఖాతరు చేస్తూ ఓటర్లు ఉదయం నుంచే భారీ క్యూలలో నిలబడి తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. జమ్మూ ప్రాంతంలోని మూడు జిల్లాలు, కశ్మీర్ లోయలోని రెండు జిల్లాల పరిధిలో ఈ పోలింగ్ జరిగింది. రెండో దశ ఎన్నికలకు ముందు జమ్మూకశ్మీర్‌లో పలుచోట్ల ఉగ్ర దాడులు, ఎన్కౌంటర్లు జరిగిన నేపథ్యంలో పోలింగ్ రోజున భద్రతను కట్టుదిట్టం చేయడంతో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. తుది గణాంకాలు అందాక పోలింగ్ శాతం ఒకటి, రెండు శాతం మేర పెరుగుతుందని ఆశిస్తున్నట్లు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్షీ ఢిల్లీలో విలేకరులకు తెలిపారు. జిల్లాలవారీగా చూస్తే రీసీలో అత్యధికంగా 80 శాతం, ఉధంపూర్‌లో 76 శాతం, పూంచ్‌లో 75 శాతం, కుప్వారాలో 68 శాతం, కుల్గామ్‌లో 60 శాతానికిపైగా పోలింగ్ నమోదైందన్నారు. వాతావరణం అనుకూలించి మంచు కురవకపోవడం కూడా పోలింగ్ భారీగా నమోదవడానికి కారణమైందన్నారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికల్లో నమోదైన 61.04 శాతం పోలింగ్‌కన్నా, 2008 అసెంబ్లీ ఎన్నికల్లో నమోదైన 68.79 శాతం పోలింగ్ కన్నా రెండో దశ పోలింగ్ శాతం అధికమన్నారు. రెండో దశ ఎన్నికల్లో 175 మంది అభ్యర్థులు పోటీ చేశారు. ఇందులో నలుగురు మంత్రులు, 11 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈవీఎంలలో అర్జున్ ముండా, కోడా భవిత జార్ఖండ్‌లోని ఏడు జిల్లాల పరిధిలో రెండో దశ పోలింగ్ జరిగింది. మావోయిస్టుల దాడుల నేపథ్యంలో 18 నియోజకవర్గాల్లో ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 3 వరకే పోలింగ్ చేపట్టగా మరో రెండు నియోజకవర్గాలైన జంషెడ్పూర్ తూర్పు, జంషెడ్పూర్ పడమర నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 5 గంటల వరకూ పోలింగ్ జరిగింది. ఈ దశ ఎన్నికల్లో మొత్తం 223 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా వారిలో మాజీ ముఖ్యమంత్రులు అర్జున్ ముండా, మధు కోడా, ముగ్గురు మంత్రులు, 18 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. వారి భవితవ్యం ఈవీఎంలలో నిక్షిప్తమైంది. -
90 శాతం లక్ష్యంగా చర్యలు: వి.ఎస్.సంపత్
కలెక్టర్లను ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సంపత్తో పాటు ఎన్నికల కమిషనర్లు బ్రహ్మ, నాసిమ్ జైదీ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి సమీక్షించారు. పోలింగ్ శాతం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూర్చోవడానికి షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించాలని, తద్వారా అక్కడి సిబ్బంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కలుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన సూచన పట్ల ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. ట్రాన్స్‌కో సీఎండీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అభ్యర్థికి ఇచ్చే ఓటర్ల జాబితా, ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న జాబితా ఒకేలా ఉండాలని, అందులో ఎవరి పేర్లూ కొట్టివేయడం, తొలగించడం చేయవద్దని కలెక్టర్లను ఆదేశించింది. నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించాలన్న కలెక్టర్ల వినతిపై స్పందిస్తూ, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారి నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి పోలీసులు చేపట్టిన చర్యలు బాగున్నాయని, ఇకపై ఇదే ఒరవడిని కొనసాగించాలని పోలీసుశాఖను సంపత్ అభినందించారు. శనివారం ఆయన డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. -
నేడు ఎన్నికల ఏర్పాట్లపై ఈసీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వీఎస్ సంపత్, కమిషనర్లు హెచ్ఎస్ బ్రహ్మ, డాక్టర్ నాసిమ్ జైదీతో పాటు డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సీ శుక్రవారం రాత్రి హైదరాబాద్ చేరుకున్నారు. విమానాశ్రయంలో వీరికి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ స్వాగతం పలికారు. శనివారం జూబ్లీహాల్లో ఉదయం 9.30 గంటల నుంచి 11.30 గంటల వరకు రాజకీయ పార్టీల ప్రతినిధులతో వేర్వేరుగా కేంద్ర ఎన్నికల కమిషన్ సమావేశం కానుంది. ఎన్నికల ఏర్పాట్లు, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలుపై ఇందులో చర్చిస్తారు. అనంతరం మధ్యాహ్నం 3.30 గంటల వరకు ఎన్నికల ఏర్పాట్లు, శాంతి భద్రతలు, పోలింగ్ రోజుల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో కమిషన్ సమావేశం అవుతుంది. అనంతరం 4.30 గంటల వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మహంతి, డీజీపీ ప్రసాదరావు, హోంశాఖ ముఖ్యకార్యదర్శితో కమిషన్ సమావేశమవుతుంది. -
'ఆంధ్రప్రదేశ్ లో 8 రోజుల్లో 16 కోట్లు పట్టుకున్నాం'
ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభపెట్టేందుకు తరలిస్తున్న అక్రమ ధనంపై ఎన్నికల కమిషన్ కొరడా ఝళిపిస్తోంది. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన తర్వాత అనధికారికంగా తరలిస్తున్న అక్రమ ధనాన్ని భారీ మొత్తంలోనే అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గత ఎనిమిది రోజుల్లో కేవలం ఆంధ్రప్రదేశ్ లోనే 16 కోట్ల రూపాయలను స్వాధీనం చేసుకున్నామని డిప్యూటి ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్షి తెలిపారు. ఎన్నికల్లో పెద్ద మొత్తంలో ధనాన్ని పంచవచ్చనే కొన్ని జిల్లాలపై దృష్టి సారించామని ఆయన తెలిపారు. మాకున్న ఇంటిలిజెన్స్ ద్వారా అక్రమంగా తరలిస్తున్న ధనాన్ని స్వాధీనం చేసుకుంటున్నామన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో కొన్ని జిల్లాలపై అధ్యయనం చేశామన్నారు. ప్రతి పార్లమెంటరీ నియోజకవర్గానికి ఒక జనరల్ అబ్జర్వర్ ను, అసెంబ్లీ నియోజకవర్గాలకు మరో ఇద్దర్ని నియమించామన్నారు. ఇప్పటి వరకు అధికారికంగా అందిన సమాచారం ప్రకారం ఆంధ్రప్రదేశ్ లో ఓటర్ల సంఖ్య 6,25,83,653 అని వినోద్ తెలిపారు. నామినేషన్లు దాఖలు చేసే రోజు వరకు ఓటర్లుగా నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు. మార్చి 9 తేదిన నిర్వహించిన ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమానికి మంచి స్పందన లభించిందన్నారు. మార్చి 9 తేదిన సుమారు 9 లక్షల మంది ఓటరుగా నమోదు చేసుకున్నారని వినోద్ తెలిపారు. -
గవర్నర్‌కు కూడా ఎన్నికల కోడ్!
హైదరాబాద్ : గవర్నర్‌కు కూడా ఎన్నికల కోడ్ వర్తిస్తుందని డిప్యూటి ఎన్నికల కమిషనర్, రాష్ల్ర ఎన్నికల నిర్వహణ బాధ్యుడు వినోద్ జుట్సి చెప్పారు. ఓటర్లను ప్రభావితం చేసేలా గవర్నర్ వ్యవహరించకూడదని ఆయన చెప్పారు. నామినేషన్ల చివరరోజు వరకు కొత్త ఓటర్ల నమోదు కొనసాగుతుందన్నారు. ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఎక్కువగా ఉండే ప్రాంతంగా ఆంధ్రప్రదేశ్‌ను గుర్తించినట్లు ఆయన తెలిపారు. డబ్బు, మద్యం ప్రభావాన్ని తగ్గించేలా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే 16 కోట్ల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు జుట్సి తెలిపారు.