కలెక్టర్లను ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్
సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సంపత్‌తో పాటు ఎన్నికల కమిషనర్లు బ్రహ్మ, నాసిమ్ జైదీ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి సమీక్షించారు.
పోలింగ్ శాతం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూర్చోవడానికి షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించాలని, తద్వారా అక్కడి సిబ్బంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కలుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన సూచన పట్ల ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది.
ట్రాన్స్‌కో సీఎండీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అభ్యర్థికి ఇచ్చే ఓటర్ల జాబితా, ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న జాబితా ఒకేలా ఉండాలని, అందులో ఎవరి పేర్లూ కొట్టివేయడం, తొలగించడం చేయవద్దని కలెక్టర్లను ఆదేశించింది. నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించాలన్న కలెక్టర్ల వినతిపై స్పందిస్తూ, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.
రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారి నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి పోలీసులు చేపట్టిన చర్యలు బాగున్నాయని, ఇకపై ఇదే ఒరవడిని కొనసాగించాలని పోలీసుశాఖను సంపత్ అభినందించారు. శనివారం ఆయన డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు.
90 శాతం లక్ష్యంగా చర్యలు: వి.ఎస్.సంపత్
Published Sun, Apr 20 2014 1:01 AM | Last Updated on Wed, Aug 29 2018 8:56 PM
Advertisement