V.S sampath
-
డబ్బు, మద్యం పంపిణీపై నిఘా
కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీల విజ్ఞప్తి సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు సాగుతున్నందున డబ్బు, మద్యం నియంత్రణకు మరింతగా నిఘాను పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రధాన రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్ఎస్) ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్‌ను కలసి వివిధ అంశాలపై సూచనలతోపాటు కొన్ని ఫిర్యాదులు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు పెంచాలని, డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణకు నిఘాను ఇంకా పెంచాలని కోరినట్లు కాంగ్రెస్ నేతలు కమలాకర్‌రావు, ఉమామల్లేశ్వరరావు తెలిపారు. లోక్‌సభకు, అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలను వేర్వేరు గదుల్లో పెట్టాలని కోరామని బీజేపీ ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు. ఎన్నికల నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొన్నా రిటర్నింగ్ అధికారులకు అవగాహన లేక ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు టీఆర్ఎస్ ప్రతినిధి రామచంద్రరావు తెలిపారు. ‘త్రీడీ పనిచేసేది రాత్రే. అయితే రాత్రి త్రీడీ వాడరాదని రిటర్నింగ్ అధికారులు అంటున్నారు’ అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ ప్రతినిధులు తెలిపారన్నారు. -
90 శాతం లక్ష్యంగా చర్యలు: వి.ఎస్.సంపత్
కలెక్టర్లను ఆదేశించిన కేంద్ర ఎన్నికల కమిషన్ సాక్షి, హైదరాబాద్: ఈ ఎన్నికల్లో 90 శాతం పోలింగ్ లక్ష్యంగా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్లను, ఎస్పీలను కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ వి.ఎస్.సంపత్ ఆదేశించారు. ఎన్నికల ఏర్పాట్లపై శనివారం జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో సంపత్తో పాటు ఎన్నికల కమిషనర్లు బ్రహ్మ, నాసిమ్ జైదీ, డిప్యూటీ ఎన్నికల కమిషనర్ వినోద్ జుత్సి సమీక్షించారు. పోలింగ్ శాతం పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై సూచనలు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు కూర్చోవడానికి షామియానాలు, కుర్చీలు ఏర్పాటు చేయాలని సూచించారు. పోలింగ్ రోజున పరిశ్రమలకు విద్యుత్ హాలిడే ప్రకటించాలని, తద్వారా అక్కడి సిబ్బంది ఓటింగ్‌లో పాల్గొనే అవకాశం కలుగుతుందని మెదక్ జిల్లా కలెక్టర్ చేసిన సూచన పట్ల ఎన్నికల కమిషన్ సానుకూలంగా స్పందించింది. ట్రాన్స్‌కో సీఎండీతో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సూచించింది. అభ్యర్థికి ఇచ్చే ఓటర్ల జాబితా, ప్రిసైడింగ్ ఆఫీసర్ వద్ద ఉన్న జాబితా ఒకేలా ఉండాలని, అందులో ఎవరి పేర్లూ కొట్టివేయడం, తొలగించడం చేయవద్దని కలెక్టర్లను ఆదేశించింది. నక్సల్ ప్రభావిత నియోజకవర్గాల్లోనూ పోలింగ్ సమయాన్ని సాయంత్రం 6 గంటల వరకు పొడిగించాలన్న కలెక్టర్ల వినతిపై స్పందిస్తూ, పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని తెలిపింది. రాష్ట్రంలో మహిళా ఓటర్ల సంఖ్య తక్కువగా ఉండటంపై అసంతృప్తి వ్యక్తం చేసింది. వారి నమోదు పెరిగేలా చర్యలు తీసుకోవాలని సూచించింది. కాగా, రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగడానికి పోలీసులు చేపట్టిన చర్యలు బాగున్నాయని, ఇకపై ఇదే ఒరవడిని కొనసాగించాలని పోలీసుశాఖను సంపత్ అభినందించారు. శనివారం ఆయన డీజీపీ బి.ప్రసాదరావు, పోలీసు అధికారులతో సమావేశమయ్యారు. -
తొలివిడతలోనే..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్ : సార్వత్రిక ఎన్నికల నగారా మోగింది. జిల్లాలో రెండు పార్లమెంట్, తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు ఏప్రిల్ 30న ఎన్నిక లు జరగనున్నాయి. ఈ మేరకు ప్రధాన ఎన్నికల కమిషనర్ వీఎస్ సంపత్ బుధవారం ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించారు. రాష్ట్రంలో రెండు విడతల్లో ఎన్నికలు జరగనుండగా, మొదటి విడతలోనే జిల్లాలో ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే నెల 2న ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. నామినేషన్ల స్వీకరణకు ఏప్రిల్ 9 వరకు చివరి తేదీ కాగా, నామినేషన్ల పరిశీలన 10న ముగుస్తుంది. వివిధ రాష్ట్రాలలో పోలింగ్ ముగిసిన తర్వాత మే 16న ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెండు పార్లమెంట్, 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో అభ్యర్థుల గెలుపు, ఓటముల ఫలితాలు వెలువడనున్నాయి. ఇదిలా వుండగా... కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో ఇప్పటికే జిల్లాలో ఎన్నికల కోడ్ అమలులో ఉంది. తాజాగా బుధవారం పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ సైతం విడుదల కావడంతో జిల్లాలో ఎన్నికల సందడి పెరిగింది. రూ.దేళ్లలో పెరిగిన ఓటర్లు 1,78,966.. 2,005కు చేరిన పోలింగ్స్టేషన్లు.. రూ.దేళ్లలో జిల్లాలో 1,78,966 ఓటర్లు పెరిగారు. 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 2009 ఎన్నికల నాటికి 16,25,799 ఓటర్లున్నారు. రూ.దేళ్లలో ఓటర్ల చేర్పులు, మార్పుల అనంతరం ఈ ఏడాది జనవరి 31న అధికారులు ప్రకటించిన గణాంకాల ప్రకారం ఓటర్ల సంఖ్య 18,05,765కు చేరింది. ఈ సారి కూడా జిల్లా ఓటర్లలో పురుషుల కంటె మహిళలే అధికంగా ఉన్నారు. మొత్తం 18,05,765 ఓటర్లలో 8,72,753 మంది పురుషులుంటే.. 9,31,911 మంది మహిళా ఓటర్లున్నారు. 101 మంది ఇతరులు (హిజ్రా)లు ఈ సారి తమ ఓటుహక్కును వినియోగించుకోనున్నారు. 2009లో పోలింగ్స్టేషన్ల సంఖ్య 1,929 కాగా, ఈ సారి 2,005కు చేరింది. అయితే రాష్ట్రంలో అతి తక్కువ పోలింగ్స్టేషన్లు ఉన్న జిల్లా కూడ మనదే. రెండు ఎన్నికల్లో నోటిఫికేషన్ తేదీల మార్పు... ఫలితాలు మాత్రం ఒకే రోజు.... 2009 సార్వత్రిక ఎన్నికలతో 2014 ఎన్నికల షెడ్యూల్‌ను పోలిస్తే తేదీలు అటు ఇటుగా ఉండగా... ఓట్ల లెక్కింపు మాత్రం ఒకే రోజు జరగనుంది. 2009లో ఎన్నికల షెడ్యూల్‌ను మార్చి 2న విడుదల చేస్తే, ఈ సారి 5న ప్రకటించారు. 2009లో నోటిఫికేషన్ మార్చి 23న జారీ కాగా ఈ సారి 10 రోజుల ఆలస్యంగా ఏప్రిల్ 2న జారీ చేయనున్నారు. ఇదే తరహాలో నామినేషన్ల స్వీకరణ, పరిశీలన తేదీల్లోను కొంత తేడా ఉండగా, గత ఎన్నికలకు పోలింగ్ ఏప్రిల్ 16న జరిగితే... ఈ సారి ఏప్రిల్ 30న పోలింగ్ జరగనుంది. అయితే 2009, 2014 ఎన్నికల్లో ఓట్ల లెక్కింపు మే 16నే జరగనుండటం చర్చనీయాంశం అవుతోంది.