కేంద్ర ఎన్నికల కమిషన్‌కు రాజకీయ పార్టీల విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ఓటర్లను ప్రలోభపెట్టే కార్యక్రమాలు సాగుతున్నందున డబ్బు, మద్యం నియంత్రణకు మరింతగా నిఘాను పెంచాలని కేంద్ర ఎన్నికల కమిషన్‌కు ప్రధాన రాజకీయ పక్షాలు విజ్ఞప్తి చేశాయి. ఎన్నికల నేపథ్యంలో కేంద్ర ఎన్నికల కమిషన్ శనివారం హైదరాబాద్‌లోని జూబ్లీహాల్‌లో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో సమావేశమైంది. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, సీపీఎం, సీపీఐ, తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రతినిధులు కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ సంపత్‌ను కలసి వివిధ అంశాలపై సూచనలతోపాటు కొన్ని ఫిర్యాదులు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడారు.
ప్రశాంతంగా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిగేలా బందోబస్తు పెంచాలని, డబ్బు, మద్యం పంపిణీ నియంత్రణకు నిఘాను ఇంకా పెంచాలని కోరినట్లు కాంగ్రెస్ నేతలు కమలాకర్‌రావు, ఉమామల్లేశ్వరరావు తెలిపారు. లోక్‌సభకు, అసెంబ్లీకి సంబంధించిన ఈవీఎంలను వేర్వేరు గదుల్లో పెట్టాలని కోరామని బీజేపీ ప్రతినిధి ప్రేమేందర్‌రెడ్డి తెలిపారు.
ఎన్నికల నియమావళికి సంబంధించిన మార్గదర్శకాలను ఎన్నికల కమిషన్ స్పష్టంగా పేర్కొన్నా రిటర్నింగ్ అధికారులకు అవగాహన లేక ఇబ్బంది పెడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు టీఆర్‌ఎస్ ప్రతినిధి రామచంద్రరావు తెలిపారు. ‘త్రీడీ పనిచేసేది రాత్రే. అయితే రాత్రి త్రీడీ వాడరాదని రిటర్నింగ్ అధికారులు అంటున్నారు’ అని ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఇలా జరగకుండా చర్యలు తీసుకుంటామని కమిషన్ ప్రతినిధులు తెలిపారన్నారు.
డబ్బు, మద్యం పంపిణీపై నిఘా
Published Sun, Apr 20 2014 1:07 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement
Advertisement