- ఓటింగ్ తగ్గడంతో మెజార్టీపై ప్రభావం
- కాంగ్రెస్ నేతల్లోనూ ఉత్కంఠ
నందిగామ : భారీ మెజార్టీపై ఆశలు పెట్టుకున్న అధికార పార్టీలో ఆందోళన మొదలైంది. గత ఎన్నికల్లో కన్నా ఎక్కువ ఓట్లు సాధించి ఉనికి చాటుకోవాలని తాపత్రయపడుతున్న కాంగ్రెస్‌కు కష్టాలు తప్పేలా లేవు. ఆశించిన స్థాయిలో పోలింగ్ శాతం నమోదు కాకపోవడంతో రెండు పార్టీల నేతలు నిరాశకు గురయ్యారు. నియోజకవర్గంలో మొత్తం 1,84,064 ఓట్లకు గానూ, 1,27,906 ఓట్లు పోలయ్యాయి. 69.46 శాతం పోలింగ్ నమోదైంది. నందిగామ మండలంలో 65.21 శాతం, చందర్లపాడులో 72.02 శాతం, వీరులపాడులో 76.27, కంచికచర్లలో 67.19 శాతం పోలింగ్ నమోదైంది.
సర్వశక్తులు ఒడ్డారు
సానుభూతి, సెంటిమెంట్‌తో ఘన విజయం సాధించాలనే ఏకైక అజెండాతో అధికార టీడీపీ సర్వశక్తులు ఒడ్డింది. తమ అభ్యర్థి తంగిరాల సౌమ్య గెలుపు కోసం జిల్లా మంత్రులు, పార్టీ ముఖ్యులు విస్తృత ప్రచారం నిర్వహించారు. మద్యం, డబ్బు భారీగానే పంపిణీ చేశారు. జిల్లా మంత్రి దేవినేని ఉమా ఈ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.
కనీసం 25 వేల ఓట్ల మెజార్టీ సాధించే దిశగా వ్యూహ రచన చేశారు. దీనికి అనుగుణంగా అన్ని పనులు చక్కబెట్టారు. అయితే అధికార పార్టీకి పట్టున్న కంచికచర్ల మండలంలో పోలింగ్ శాతం తగ్గింది. వీరులపాడు మండలంలో పోలింగ్ శాతం పెరిగినప్పటికీ గతంతో పోలిస్తే ప్రస్తుతం తక్కువగానే నమోదైంది. పోలింగ్ శాతం తగ్గడంతో సానుభూతితో సౌమ్య గెలుపొందినా, టీడీపీ నేతలు భావించిన మెజారిటీ వచ్చే అవకాశం లేదని పరిశీలకులు భావిస్తున్నారు.
అధికార పార్టీ దందా
ఎన్నికల ప్రచారం నుంచి అధికార పార్టీ హడావుడి కొనసాగింది. బరిలో ప్రధాన పోటీదారుగా ఉన్న కాంగ్రెస్‌ను పరోక్షంగా ఇబ్బంది పెడుతూనే వచ్చింది. పోలింగ్ రోజు 15 బూత్‌లలో కాంగ్రెస్ తరఫున ఏజెంట్లు లేకపోవడంతో టీడీపీ నేతల హవా సాగింది. అధికారులు, పోలీసులు కూడా అధికార పార్టీ నేతల ఆగడాలను చూసీచూడనట్లు వ్యవహరించారు.
పోలింగ్ సరళి తక్కువగా ఉండటంతో ఆందోళనకు గురైన టీడీపీ నేతలు సాయంత్రం ఐదు గంటల సమయంలో నందిగామలోని జెడ్పీ స్కూల్లో ఒక్కొక్కరితో మూడు, నాలుగు ఓట్లు వేయించినట్లు సమాచారం. మోగులూరు, గనిఆత్కూరు, మున్నలూరు, తునికెనపాడులో కాంగ్రెస్‌కు ఏజెంట్లు లేరు. వీరులపాడు మండలం పొన్నవరంలో ఉన్న కాంగ్రెస్ ఏజెంట్‌ను టీడీపీ నేతలు బెదిరించి బూత్‌కు రాకుండా చేశారు.