మాట్లాడుతున్న మంత్రి హరీశ్‌రావు
మెదక్: కర్ణాటక నుంచి అవినీతి డబ్బును తరలించి, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని మంత్రి టి.హరీశ్ రావు ఆరోపించారు. బెంగళూరు ఐటీ దాడుల్లో దొరికిన రూ.42 కోట్లు అక్కడి కాంట్రాక్టర్ అంబికా పతిదని, ఆయన భార్య కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొ రేటర్ అని తెలిపారు. శుక్రవారం మంత్రి మెదక్‌లో విలేకరులతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై ధ్వజమె త్తారు.
తెలంగాణలో డబ్బులు పంపిణీ చేసి, అడ్డదారిలో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ కుటిల ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు. ఐటీ దాడులతో కాంగ్రెస్ పార్టీ నోట్ల కట్టలు బయట పడ్డాయని, అక్రమంగా సంపాదించిన అవినీతి సొమ్మును తెలంగాణకు బదిలీ చేసేందుకు ఆ పార్టీ ప్రయత్నం చేయడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. కర్ణాటకలో కాంట్రాక్టర్ల వద్ద గత బీజేపీ ప్రభుత్వం 40% కమీషన్ తీసుకుంటే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం 50% కమీషన్ తీసుకుని, ఆ డబ్బు తో ఓట్లు కొనేందుకు తెలంగాణపై దండయాత్ర చేస్తోందని మండిపడ్డారు.
ఐటీ దాడుల్లో దొరికిన డబ్బు గురించి కాంగ్రెస్ పార్టీ సమాధానం చెప్పాలని హరీశ్ డిమాండ్ చేశారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, కాంగ్రెస్ నేత ఈశ్వరప్పలకు అంబికాపతి అత్యంత సన్నిహితు డని తెలిపారు. కర్ణాటకలో బిల్డర్లు, వ్యాపారులు, కాంట్రాక్టర్ల దగ్గర నుంచి రూ.1,500 కోట్లు వసూలు చేసి తెలంగాణ ఎన్నికల్లో ఖర్చు చేయాల ని కాంగ్రెస్ పార్టీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు.
చెన్నై మీదుగా హైదరాబాద్‌కు డబ్బులు పంపాలని ఆ పార్టీ పథకం వేస్తోందని అన్నారు. వ్యాపారాలు చేసుకోకుండా రాజకీయాలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని ఆయన కాంట్రాక్టర్లను హెచ్చరించారు. కాగా, అసెంబ్లీ ఎన్నికల్లో కనీసం అభ్యర్థులను ఎంపిక చేసుకోలేని స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందని మంత్రి హరీశ్ విమర్శించారు. సగం సీట్లలో కాంగ్రెస్ పార్టీకి అభ్యర్థులు లేరని ఎద్దేవా చేశారు. షెడ్యూల్ వచ్చినా టికెట్లు ప్రకటించలేని దుస్థితి కాంగ్రెస్ పార్టీదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment