కాంగ్రెస్ కూటమికి 'మహా' ఓటమి!
మహారాష్ట్రలో కాంగ్రెస్ - ఎన్సీపీ కూటమి ఎన్నికల్లో చావుదెబ్బ తింది. ఇక్కడ మొత్తం 48 ఎంపీ స్థానాలుండగా.. సార్వత్రిక ఎన్నికల్లో ఆ కూటమి మొత్తానికి లభించినవి కేవలం ఆరంటే ఆరే సీట్లు!! అందులోనూ కాంగ్రెస్వి రెండు, ఎన్సీపీవి నాలుగు. దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగరంలో ఒక్క సీటూ దక్కలేదు. అదే 2009లో అయితే అక్కడున్న మొత్తం ఆరు సీట్లనూ ఈ కూటమే ఎగరేసుకుపోయింది. అక్టోబర్ నెలలో ఈ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పుడొచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కూటమి గుండెల్లో గుబులు రేపుతున్నాయి. బీజేపీ- శివసేన కూటమి మహారాష్ట్ర అసెంబ్లీలో కూడా తిష్ట వేస్తుందేమోనన్న భయం ఇప్పుడు కాంగ్రెస్ నాయకులకు పట్టుకుంది.
శివసేన మొత్తం 22 స్థానాల్లో పోటీచేసి, 18 స్థానాలను గెలుచుకుంది. బీజేపీ 26 స్థానాలకు గాను 23 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ నుంచి గెలిచిన ఇద్దరిలో ఒకరు మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ (నాందేడ్), యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు రాజీవ్ సతావో (హింగోలి). మహారాష్ట్రలోని విదర్భ, మరాఠ్వాడా, కొంకణ్, ఉత్తర మహారాష్ట్ర... నాలుగు ప్రాంతాల ప్రజలు కాంగ్రెస్ -ఎన్సీపీ కూటమిని ఛీకొట్టారు. ఇక రాజ్ ఠాక్రే నేతృత్వంలోని ఎంఎన్ఎస్ కూడా ఇంతకుముందులా బీజేపీ-శివసేన కూటమి నుంచి ఓట్లను పెద్దగా చీల్చలేకపోయింది. మరోవైపు మహారాష్ట్రలో విద్యుత్ కోతలు, అవినీతి లాంటి వాటిపై రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోలేకపోవడం కూడా సమస్యగానే మిగిలింది. కేంద్ర మంత్రులు సుశీల్ కుమార్ షిండే, ప్రఫుల్ పటేల్తోపాటు రాష్ట్ర మంత్రి ఛగన్ భుజ్బల్ లాంటి పెద్దపెద్ద నాయకులు కూడా ఈ గాలికి కొట్టుకుపోయారు.