సంఘ్ మూలాలు, మోదీ అండ
ఫడణ్‌విస్ విజయ రహస్యం
ముంబై: మహారాష్ట్ర సీఎం పగ్గాలు చేపట్టనున్న 44 ఏళ్ల దేవేంద్ర ఫడణ్‌విస్ రాజకీయ ప్రస్థానం సాఫీగా సాగింది. బలమైన ఆరెస్సెస్ మూలాలు, ప్రధాని మోదీ, బీజేపీ చీఫ్ అమిత్‌షా అండదండలు, పార్టీ రాష్ట్ర కమిటీలోని పలువురి మద్దతు ఆయన విజయానికి బాటలు పరిచాయి. ఎలాంటి అవినీతి ఆరోపణలూ లేకపోవడం కూడా కలిసొచ్చింది. రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా అధికారంలోకి రానున్న ఆయన శివసేన నేత మనోహర్ జోషి తర్వాత ఆ పదవి చేపట్టనున్న రెండో బ్రాహ్మణుడు.
తొలినుంచీ సీఎం పదవి రేసులో ముందంజలో ఉండి అనుకున్నది సాధించిన ఫడణ్‌విస్ రాష్ట్రానికి 27వ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయనున్నారు. విదర్భ ప్రాంతం నుంచి ఆ పదవి చేపట్టనున్న నాలుగో వ్యక్తి కానున్నారు. ఫడణ్‌విస్ దేశానికి నాగ్‌పూర్ ఇచ్చిన కానుక అని మోదీ ఎన్నికల ప్రచారంలో కొనియాడారు. లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో మోదీనే ప్రధాన ఆకర్షణగా నిలిచినా బీజేపీ గెలుపు ఘనతలో కొంత భాగం ఫడణ్‌విస్‌కూ దక్కుతుంది. రాష్ట్రంలోని మొత్తం 48 లోక్‌సభ స్థానాలకు గాను బీజేపీ, శివసేన, మరో కాషాయ పార్టీ స్వాభిమాని షెట్కారీ పక్షలు కలిసి 42 స్థానాలు సాధించాయి.
మృదువైన మాటలతో ఆకట్టుకునే దేవేంద్ర ఫడణ్‌విస్ 1970 జూలై 22న నాగ్‌పూర్‌లో జన్మిచారు. ఆయన తండ్రి దివంగత జనసంఘ్, బీజేపీ నేత గంగాధర్ ఫడణ్‌విస్. దేవేంద్ర ఫడణ్‌విస్ న్యాయశాస్త్రంలో డిగ్రీ, బిజినెస్ మేనేజ్‌మెంట్‌లో పీజీ చేశారు. ఆర్థిక శాస్త్రంపై రెండు పుస్తకాలు రాశారు. ఆయనకు భార్య అమృత, కూతురు దివిజ ఉన్నారు. 1989లో ఏబీవీపీలో చేరి రాజకీయ ప్రస్థానం ప్రారంభించారు. 22 ఏళ్ల వయసులో నాగ్‌పూర్ కార్పొరేటర్‌గా గెలిచి, నగర చరిత్రలో అత్యంత పిన్నవయసు కార్పొరేటర్‌గా రికార్డు సృష్టించారు. 1997లో 27 ఏళ్ల వయసు లోనే నగర మేయర్‌గా ఎన్నికై రికార్డులకెక్కారు.
2001లో బీజేవైఎం జాతీయ అధ్యక్షుడయ్యారు. 1999లో తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. గత ఏడాది బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా పగ్గాలు చేపట్టారు. తాజా అసెంబ్లీ ఎన్నికల్లో నాగ్‌పూర్ నైరుతి స్థానం నుంచి ఎన్నికైన ఆయన విదర్భ రాష్ట్ర డిమాండ్‌కు గట్టి మద్దతుదారు. అయితే రాష్ట్ర సమైక్యత డిమాండ్ నేపథ్యంలో స్వరం తగ్గించారు. ప్రస్తుతం నాలుగో పర్యాయం ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఒక్కసారీ మంత్రిగా పనిచేయకున్నా ఆరెస్సెస్ మూలాలు, క్లీన్ ఇమేజి, మోదీ, షా మద్దతుతో ఆటంకాలు అధిగమించారు.