అసెంబ్లీ ఎన్నికలకు ముగిసిన ప్రచారం
హర్యానా, మహారాష్ర్టల్లో రేపే పోలింగ్
పోటాపోటీగా ప్రచారం నిర్వహించిన పార్టీలు
న్యూఢిల్లీ: హర్యానా, మహారాష్ర్ట అసెంబ్లీ ఎన్నికలకు సోమవారం సాయంత్రంతో ప్రచారం ముగిసింది. కొద్ది రోజులుగా పోటాపోటీ ప్రచారం నిర్వహించిన ప్రధాన రాజకీయ పార్టీలు చివరి రోజున సాధ్యమైనంత విస్తృతంగా సభలు నిర్వహించాయి. సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెర పడటంతో రెండు రాష్ట్రాల్లోనూ లౌడ్‌స్పీకర్లు మూగబోయాయి. మహారాష్ర్టలోని 288 సీట్లు, హర్యానా అసెంబ్లీలోని 90 సీట్లకు బుధవారం ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీకి ఘనవిజయం సాధించిపెట్టిన ప్రధాని నరేంద్ర మోదీ ఈ అసెంబ్లీ ఎన్నికల్లోనూ దాన్ని పునరావృతం చేయాలని కంకణం కట్టుకున్నారు. అందుకే ఆయన సుడిగాలి పర్యటనలు చేశారు. ఎన్నో బాధ్యత లతో ఊపిరిసలపకుండా ఉన్నప్పటికీ రెండు రాష్ట్రాల్లో ఏకంగా 30 సభల్లో ఆయన ప్రసంగించడం విశేషం. బీజేపీ పూర్తిగా మోదీ చరిష్మాపైనే ఆశలు పెట్టుకుంది. ఇక మహారాష్ర్టలో నిన్నమొన్నటి వరకు మిత్రపక్షంగా ఉన్న శివసేనను ఎక్కడా విమర్శించకుండా ప్రధాని జాగ్రత్తపడ్డారు. కాంగ్రెస్, ఎన్సీపీలనే లక్ష్యంగా చేసుకుని ప్రచారం నిర్వహించారు. ఇక అభివృద్ధి మంత్రం పఠిస్తూ కాంగ్రెస్ తన ప్రచారాన్ని కొనసాగించింది. అటు హర్యానాలోనూ కాంగ్రెస్ అవినీతినే ప్రచారాస్త్రంగా చేసుకుని మోదీ ప్రసంగాలు సాగాయి. ఆ పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ అల్లుడు రాబర్ట్ వాద్రా భూ లావాదేవీల వ్యవహారం ఎన్నికల్లో చర్చనీయాంశమైంది. ఐఎన్‌ఎల్‌డీ నేతలపైనా విమర్శలు గుప్పించారు. కాగా, మహారాష్ర్టలో 8.25 కోట్ల మంది ఓటర్లు.. 1,699 మంది స్వతంత్రులు సహా 4,119 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని తేల్చనున్నారు. బీజేపీ 257 సీట్లలో, దాని మిత్రపక్షాలు 31సీట్లలో పోటీ చేస్తున్నాయి. కాంగ్రెస్, ఎన్సీపీలు మొత్తం స్థానాలకు తమ అభ్యర్థులను పోటీకి దింపాయి. శివసేన కూడా మెజారిటీ స్థానాల్లో పోటీలో నిలిచింది. 1989 తర్వాత ప్రధాన పార్టీలన్నీ విడివిడిగా పోటీ చేయడం ఇదే తొలిసారి.
ఇటు హర్యానాలో బీజేపీ తొలిసారిగా మొత్తం 90 స్థానాల్లో పోటీ చేస్తోంది. ఈసారి హర్యానాలో రెండు కొత్త పార్టీలు(హర్యానా జనచేతన పార్టీ, హర్యానా లోకహిత్ పార్టీ) తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. కాంగ్రెస్‌కు ఎలాగైనా మూడోసారి అధికారాన్ని కట్టబెట్టడానికి సీఎం భూపిందర్‌సింగ్ హూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మరోవైపు సోనియా గాంధీ తన ప్రచారంతో బీజేపీ, ఐఎన్‌ఎల్‌డీలపై దాడి చేశారు. ఇక టీచర్ల నియామకం కుంభకోణం కేసులో మాజీ ముఖ్యమంత్రి ఓంప్రకాశ్ చౌతాలా జైలు పాలవడంతో ఎన్నికల్లో పోటీకి దూర మయ్యారు. దీంతో ఐఎన్‌ఎల్‌డీని గట్టెక్కించే బాధ్యత ఆయన కుమారుడు అభయ్ సింగ్‌పై పడింది. ఈ నెల 19న రెండు రాష్ట్రాల్లోనూ కౌంటింగ్ జరగనుంది. కాగా, రెండు రాష్ట్రాల్లో ఎన్నికల తేదీలు ప్రకటించినప్పట్నుంచి సోమవారం వరకు.. ఓటర్లకు పంచేందుకు ఉద్దేశించిన రూ. 18 కోట్ల నగదు, 4.5 లక్షల లీటర్ల అక్రమ మద్యాన్ని ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
వారసత్వానికి స్వస్తి చెప్పండి మహారాష్ట్ర ప్రజలకు మోదీ పిలుపు
కంకావ్లీ(మహారాష్ట్ర): కాంగ్రెస్, ఎన్సీపీలవి కుటుంబ వారసత్వ రాజకీయాలని, అసెంబ్లీ ఎన్నికల్లో ఆ పార్టీలను రాష్ట్రం నుంచి తరిమికొట్టాలని ప్రధాని నరేంద్ర మోదీ మహారాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాష్ట్రంలో చివరి రోజు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన కంకావ్లీ, రత్నగిరి, పాల్ఘర్‌లలో జరిగిన సభల్లో ప్రసంగించారు. ‘కాంగ్రెస్, ఎన్సీపీల నాయకులు భూస్వామ్య వ్యవస్థ నెలకొల్పారు. తండ్రి అధికారంలోకి వస్తాడు, కొన్ని జిల్లాల సంగతి చూసుకోవాలని తన పిల్లలకు చెబుతాడు. కాంగ్రెస్, ఎన్సీపీలు రాష్ట్రాన్ని దోచుకున్నాయి. రాష్ట్రం వారసత్వ రాజకీయాల బంధనాల నుంచి బయటపడాలి’ అని అన్నారు. సుపరిపాలన కోసం అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి పూర్తి మెజారిటీ ఇవ్వాలని కోరారు. పాల్ఘర్ సభలో మాట్లాడుతూ.. పాక్ జైళ్లలో మగ్గుతున్న పాల్ఘర్ జిల్లా జాలర్ల కష్టాలను గత కాంగ్రెస్ ప్రభుత్వాలు పట్టించుకోలేదని, తన ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఈ అంశాన్ని పాక్ ముందు లేవనెత్తిందని అన్నారు. తాను పాక్ ప్రధానితో మాట్లాడానని, గత పదేళ్లలో తొలిసారి ఆ దేశం 200 మంది భారత జాలర్లను, 50 పడవలను వదలిపెట్టిందన్నారు.