కనుమరుగే
సాక్షి, బెంగళూరు : దేశంలో కాంగ్రెస్ పార్టీ తన అస్థిత్వాన్ని కోల్పోనుందని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు, కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప జోస్యం చెప్పారు. ఇందుకు ఆదివారం వెలువడిన హర్యానా, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల ఫలితాలే ఉదాహరణ అని విశ్లేషించారు. మీడియాతో ఆయన ఆదివారం మాట్లాడారు.
ఈ రెండు రాష్ట్రాలో కాంగ్రెస్ పార్టీలో అతిరథ మహారథులనుకునే వారందరూ ఎన్నికల్లో ఓటమి చవిచూశారని తెలిపారు. అంతేకాక ఇరు రాష్ట్రాల్లో ఫలితాల విషయంలో బీజేపీనే మొదటి స్థానంలో ఉందని గుర్తుచేశారు. హర్యానాలో సొంత బలంతో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. మహారాష్ర్టలో మిత్రపక్షమైన శివసేనతో పొత్తు కుదుర్చుకుని ప్రజలకు ఉత్తమ పాలన అందిస్తామని భరోసా ఇచ్చారు. ఇక్కడ కూడా బీజేపీ నాయకుడే ముఖ్యమంత్రి పదవిని చేపడతారని ధీమా వ్యక్తం చేశారు.
ఎన్నికల ప్రచారంలో శివసేన పార్టీ గురించికాని, ఆ పార్టీ నాయకుల గురించి కాని ప్రధాని నరేంద్రమోడీ ఎటువంటి ఘాటు విమర్శలు చేయలేదన్నారు. అందువల్ల ఆ పార్టీతో బీజేపీ పొత్తు ఖచ్చితమని యడ్యూరప్ప ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కల్పోతోందన్నారు. అభిద్ధి కుంటుబడటం, సంక్షేమపథకాలు అమలు కాకపోవడం, శాంతిభద్రతలు క్షీణించడం ఇందుకు ప్రధాన కారణాలని పేర్కొన్నారు.
కాగా, మహారాష్ట్ర, హర్యాణ శాసనసభ ఎన్నికల్లో బీజేపీకు ఉత్తమ ఫలితాలు రావడంతో రాష్ట్రంలోని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆనందానికి అంతులేకుండా పోయింది. ఇరు రాష్ట్రాల్లో బీజేపీ మొదటిస్థానంలో ఉందని సమాచారం అందగానే వందలాది మంది కార్యకర్తలు నగరంలోని మల్లేశ్వరంలో ఉన్న భారతీయ జనతా పార్టీ కర్ణాటక శాఖ ప్రధాన కార్యాలయం వద్దకు చేరుకుని బాణాసంచా కాలుస్తూ గంతులు వేశారు. ఒకరికి ఒకరు మిఠాయిలు తినిపించుకుంటూ ఆనందం వ్యక్తం చేశారు.