మహరాష్ట్ర, హర్యానాల్లో మోదీ మ్యాజిక్ | Narendra Modi Magic in Maharastra, Haryana | Sakshi
Sakshi News home page

మహరాష్ట్ర, హర్యానాల్లో మోదీ మ్యాజిక్

Published Mon, Oct 20 2014 12:47 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

మహరాష్ట్ర, హర్యానాల్లో మోదీ మ్యాజిక్ - Sakshi

మహరాష్ట్ర, హర్యానాల్లో మోదీ మ్యాజిక్

మహరాష్ట్ర, హర్యానాల్లో బీజేపీకే పట్టం
  అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ హవా
  హర్యానాలో వికసించిన కమలం, సొంతంగా మెజారిటీ
మహరాష్ట్రలో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ
  బేషరతుగా బయట నుంచి మద్దతిస్తామన్న ఎన్సీపీ
  పరిశీలిస్తామని ప్రకటించిన కమలనాథులు
  నేడు శాసనసభాపక్ష నేతలను ఎన్నుకునే అవకాశం
  ప్రజల నమ్మకాన్ని వమ్ము చేయం: ప్రధాని మోదీ
 
న్యూఢిల్లీ: మోదీ మ్యాజిక్ మరోసారి పనిచేసింది. అన్నీ తానై వ్యవహరించి మరో రెండు రాష్ట్రాలను ‘కమలం’ ఖాతాలో వేశారు. దీంతో కేంద్రంలో అధికారం చేపట్టిన తర్వాత ఎదురైన తొలి పరీక్షలో ప్రధాని నరేంద్ర మోదీ విజయవంతంగా నెగ్గారు. మహరాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాషాయ పార్టీ విజయదుందుభి మోగించింది. గత లోక్‌సభ ఎన్నికల హవాను బీజేపీ కొనసాగించింది. మోదీ ప్రభంజనంలో కాంగ్రెస్ తదితర పక్షాలన్నీ కొట్టుకొనిపోయాయి. హర్యానాలో కమలనాథులు పూర్తి మెజారిటీ సాధించి తొలిసారిగా అధికార పీఠాన్ని చేజిక్కుంచుకున్నారు. మహారాష్ర్టలోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా నిలిచింది. అత్యధిక సీట్లు గెలుపొంది రాష్ర్టంలో అధికార పగ్గాలు చేపట్టడాన్ని ఖాయం చేసుకుంది. ఈ రెండు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆదివారం వెల్లడయ్యాయి. 
 
90 సీట్లున్న హర్యానాలో బీజేపీ 47 స్థానాలను సొంతం చేసుకుని స్పష్టమైన మెజారిటీ సాధించింది. పదేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ను చిత్తుచేసింది. 19 సీట్లతో ఐఎన్‌ఎల్‌డీ రెండో స్థానంలో నిలవగా, కేవలం 15 చోట్ల నెగ్గిన కాంగ్రెస్ మూడో స్థానానికి దిగజారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు సీట్లు మాత్రమే గెలుచుకున్న కమల దళం ఈసారి ఏకంగా అధికారాన్నే చేజిక్కించుకోవడం విశేషం. 
 
ఇక రాజకీయ పోటీ తీవ్రంగా ఉన్న మహారాష్ర్టలోనూ 288 సీట్లకు గాను మరో మూడు చిన్న పార్టీలతో కలిసి బీజేపీనే అత్యధిక స్థానాలను కైవసం చేసుకుంది. బీజేపీ సొంతంగా 122 సీట్లను కూటమి ఖాతాలో వేసుకుని సాధారణ మెజారిటీకి మరో 23 సీట్ల దూరంలో నిలిచింది. అయినా రాష్ర్టంలో అధికారం చేపట్టడం మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. దీర్ఘకాలంగా మిత్రపక్షంగా ఉండి ఈ ఎన్నికల ముందే తన బంధాన్ని తెంచుకున్న శివసేన మద్దతు తీసుకునేందుకు ద్వారాలు తెరిచే ఉండగా.. మరోవైపు అనూహ్యంగా ఎన్సీపీ కూడా ఇందుకు ముందుకొచ్చింది. తాము బయటినుంచి బేషరతుగా మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది.
 
15 ఏళ్లుగా కాంగ్రెస్‌తో కలిసి అధికారం పంచుకున్న ఎన్సీపీ ఈసారి ఒంటరిగానే పోటీ చేసింది. 41 సీట్లు సాధించిన ఈ పార్టీ సహకారంతోనూ బీజేపీ సునాయాసంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే వీలుంది. 63 సీట్లు నెగ్గిన శివసేనను కాదని ఎన్సీపీ మద్దతు తీసుకునేందుకూ కమలనాథులు సిద్ధంగానే ఉన్నట్లు తెలుస్తోంది. ఆ పార్టీతో జట్టు కట్టేందుకు తమకు అభ్యంతరం లేదని బీజేపీ జాతీయాధ్యక్షుడు అమిత్ షా కూడా స్పష్టమైన సంకేతాలిచ్చారు. మొత్తానికి రెండు రాష్ట్రాల ఎన్నికల్లోనూ మోదీనే ప్రధాన ఆకర్షణగా నిలిచారు. 
 
ప్రధాని హోదాలో కూడా ఆయన విస్తృత ప్రచారం నిర్వహించారు. మహరాష్ట్రలో 27, హర్యానాలో 11 బహిరంగ సభల్లో పాల్గొని పార్టీని విజయతీరాలకు చేర్చడంలో కీలకపాత్ర పోషించారు. హర్యానాలో బీజేపీకి ఓట్ల శాతం 9 నుంచి ఏకంగా 33కు పెరగగా..మహరాష్ట్రలో ఇది 14 శాతం నుంచి 27.8 శాతానికి చేరింది. కాగా, హైదరాబాద్‌లో బలంగా ఉన్న మజ్లిస్ పార్టీ మహారాష్ర్టలో ఈసారి ఖాతా తెరిచింది. ఇక్కడ తొలిసారి పోటీ చేసి రెండు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. ఇక గత అసెంబ్లీలో 13 సీట్లున్న ఎంఎన్‌ఎస్ పార్టీ ఈసారి ఒక్క స్థానానికే పరిమితమైంది. 
 
 బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ
 ఎన్నికల ఫలితాలు వెల్లడికాగానే బీజేపీ పార్లమెంటరీ బోర్డు అత్యవసరంగా భేటీ అయింది. మోదీ, అమిత్ షాతో పాటు రాజ్‌నాథ్‌సింగ్, సుష్మా స్వరాజ్, శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి పార్టీ సీనియర్లు ఈ భేటీకి హాజరయ్యారు. మహారాష్ర్టలో ప్రభుత్వ ఏర్పాటుకు అవలంబించాల్సిన వ్యూహంపైనే ప్రధానంగా చర్చిం చారు. బయటినుంచి మద్దతిచ్చేందుకు సిద్ధమని ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ ప్రకటించడంతో ఈ అవకాశంపైనా బీజేపీ నేతలు దృష్టిసారించారు. సీఎంలను ఎంపిక చేసేందుకు వీలుగా రెండు రాష్ట్రాలకు ఇద్దరు చొప్పున పరిశీలకులను పంపాలని పార్లమెంటరీ బోర్డు నిర్ణయించింది. మహారాష్ర్టకు రాజ్‌నాథ్‌సింగ్, జేపీ నద్దాను.. హర్యానాకు మంత్రి వెంకయ్యనాయుడు, పార్టీ ఉపాధ్యక్షుడు దినేశ్ శర్మను పరిశీలకులుగా ఎంపిక చేసింది. ఇక 2 రాష్ట్రాల్లో కొత్తగా గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలంతా సోమవారం సమావేశమై తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశముంది.
 
 మరోవైపు అమిత్ షా మీడియాతో మాట్లాడుతూ ఈ 2 రాష్ట్రాల్లో పార్టీ విజయంతో మోదీ సర్కారు పనితీరుకు ప్రజామోదం లభిం చినట్లేనన్నారు. ఈ ఫలితాలతో కాంగ్రెస్ రహిత భారత్ లక్ష్యం దిశగా మరో రెండడుగులు ముందుకు పడ్డాయని ఆయన వ్యాఖ్యానించారు. మోదీ హవా సునామీలా విరుచుకుపడిందని, విపక్షాలన్నీ అందులో కొట్టుకుపోయాయని షా అన్నారు. కాగా మహారాష్ర్టలో శివసేనతో మితృత్వాన్ని పునరుద్ధరించుకోవడమే మేలని బీజేపీ అగ్రనేత అద్వానీ అభిప్రాయపడ్డారు. ఎన్సీపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం లేదన్నారు. తమ పార్టీ కోరితే శివసేనతో చర్చించడానికి తాను సిద్ధమేనని అద్వానీ తెలిపారు. లోక్‌సభ ఎన్నికల ఫలితాలే పునరావృతమయ్యాయన్నారు. మరోవైపు ఎన్సీపీ మద్దతు తీసుకునే అంశాన్ని పరిశీలిస్తున్నామని బీజేపీ మహారాష్ర్ట చీఫ్ దేవేంద్ర ఫడ్నవీస్ పేర్కొనడం గమనార్హం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement