జాట్, మరాఠా... విరుగుడు మంత్రం | BJP's success in the two states as a single. | Sakshi
Sakshi News home page

జాట్, మరాఠా... విరుగుడు మంత్రం

Published Fri, Oct 24 2014 11:42 PM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM

జాట్, మరాఠా... విరుగుడు మంత్రం - Sakshi

జాట్, మరాఠా... విరుగుడు మంత్రం

అసాధ్యమనుకున్న రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా విజయాలను సాధించగలిగింది. అమిత్ షా ‘సోషల్ ఇంజనీరింగ్’ నైపుణ్యం ఈ విజయాలకు ఒక ప్రధాన కారణమా? అయితే అది కాంగ్రెస్ రాజకీయాలకు ప్రత్యామ్నాయంగా ఒక సరికొత్త బీజేపీ మార్కు ‘సామాజిక అమరిక’కు తెర తీస్తోందా?... లేదంటే ఎటువంటి అమరికలు, అరమరికలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా అన్ని వర్గాలనూ తన వెంట నడుపుకోడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా?... తద్వారా అది ఓటు బ్యాంకు రాజకీయాలను చావుదెబ్బ తీస్తుందా... వేచి చూడాలి.
 
సాంఘికశాస్త్రం

 
కహాఁ భోజ్‌రాజ్? కహాఁ గంగూతేలీ? (భోజరాజు ఎక్కడ? గంగూతేలీ ఎక్కడ?). నక్క ఎక్కడా? నాగలోకమెక్కడా? అనే మన సామెతను పోలిన ఉత్తరాది సామెత అది. బీజేపీ తరఫున ప్రధాని అభ్యర్థిగా నరేంద్ర మోదీ పేరును ప్రకటించగానే కాంగ్రెస్ నాయకుడు గులాంనబీ ఆజాద్ అవహేళనగా ఈ సామెతను ఉటంకించారు. పూర్వకాలంలో గంగూ అనే తేలి కులస్థుడు (గానుగతో నూనె తీసే కులం) భోజరాజు కంటే తానే గొప్పవాడినని ప్రచారం చేసుకొనేవాడని ఒక కథ ఉంది. అతని మీద విమర్శగా ఈ సామెత పుట్టిందంటారు. ఇక్కడ నరేంద్ర మోదీ కూడా గుజరాత్‌కు చెందిన ఘాంచీ కులస్తుడు. గానుగ ద్వారా నూనెను తీసి అమ్ముకోవడం ఈ కులం వారి వృత్తి. తెలుగు రాష్ట్రాల్లో వీరిని తెలికల, గాండ్లవారని పిలుస్తారు. గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లోని వైశ్యుల్లో కూడా మోదీ ఇంటిపేరు ఉంది. ఆ కారణంగా నరేంద్ర మోదీని కూడా వైశ్యునిగానే చాలామంది భావించేవారు. ఎప్పుడైతే నరేంద్ర మోదీ జాతీయ రాజకీయాల్లో ప్రధానపాత్ర పోషించడం మొదలైందో, అప్పటినుండే అతని ఓబీసీ మూలాలను వెతికి పట్టుకొని, ప్రత్యర్థులు ప్రచారం చేయడం మొదలైంది. ఒకరకంగా మోదీకి వారు మేలు చేసినట్టుగానే లెక్క. అయితే యూపీఏపై వ్యతిరేకత, అభివృద్ధికి నమూనాగా మోదీని ఫోకస్ చేయడం అనే అంశాలే గడచిన పార్లమెంట్ ఎన్నికలను ఎక్కువగా ప్రభావితం చేశాయి. ఉత్తరప్రదేశ్ లాంటి కొన్ని కీలక రాష్ట్రాల్లో మాత్రం ‘సోషల్ ఇంజనీ రింగ్’ను కూడా ఆశ్రయించి బీజేపీ విజయాలు సాధించింది. ఆ ఇంజనీరింగ్ నిపుణుడు అమిత్ షా... జైన వైశ్యుడు.

ఈ నేపథ్యంలో మొన్నటి మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికలను ఒకసారి పరిశీలిద్దాం. మహారాష్ట్రలో మరాఠాలు అధికార కులం కింద లెక్క. ఇప్పటివరకు 17 మంది మహారాష్ట్రకు ముఖ్యమంత్రులైతే, అందులో 10 మంది మరాఠాలే. రాష్ట్రం ఏర్పడిన 54 ఏళ్లలో 40 ఏళ్లకు పైగా వీరి పాలనే నడిచింది. కుంబీ అనే అనుబంధ కులంతో కలిపి మరాఠాల జనాభా దాదాపుగా 35 శాతం. కాపు, బలిజలాగా మరాఠా-కుంబీలను కూడా అక్కడ ఒకే సామాజిక వర్గంగా పరిగణిస్తారు. విదర్భలో కుంబీల ఆధిపత్యం, మిగతా ప్రాంతాల్లో మరాఠాల పెత్తనం నడుస్తోంది. బాబాసాహెబ్ అంబేద్కర్ సొంత రాష్ట్రం కావడం వల్ల కావచ్చు, మిగతా రాష్ట్రాలతో పోలిస్తే దళిత చైతన్యం కూడా ఈ రాష్ట్రంలో ఎక్కువే. ఓబీసీలలో ఎక్కువ జనాభా ఉన్న కులాలు వంజర, మాలి. ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన గోపీనాథ్ ముండే వంజర సామాజిక వర్గానికి చెందినవారు. బ్రాహ్మణుల ఇంటి అల్లుడు కూడా. ప్రమోద్ మహాజన్ చెల్లెల్ని ఆయన పెళ్లి చేసుకున్నారు. ముండే జీవించి ఉంటే వసంతరావు నాయక్ తర్వాత మరో వంజర వర్గీయుడు మహారాష్ట్ర పీఠాన్ని ఎక్కేవాడు. మన ప్రాంతంలో ముదిరాజ్ - తెనుగులతో సమానమైనది మాలీ కులం. ప్రముఖ సంఘసంస్కర్త మహాత్మా జ్యోతీరావు ఫూలే ఈ వర్గానికి చెందినవారే. మహారాష్ట్ర ఎన్నికల గతచరిత్రను పరిశీలిస్తే, పార్టీలో పేరున్న మరాఠా నాయకుడు లేకుండా, మరాఠా వ్యక్తిని ముఖ్యమంత్రిగా ప్రకటించకుండా, ఎన్నికల రంగంలోకి దిగడం ఒక రకంగా సాహసమేనని చెప్పాలి. ఈ ఎన్నికల్లో బీజేపీ ఆ సాహసం చేసింది. కాంగ్రెస్ పార్టీ కొన్ని దశాబ్దాలుగా మరాఠా - మైనారిటీ - దళిత సామాజిక వర్గాల అమరికతో ఒక రాజకీయ దుర్గాన్ని నిర్మించుకుంది. మరాఠా సామాజికవర్గంలోని పట్టణ ప్రాంతాల్లో ఉండే స్థానికవాద దురభిమానులు, తీవ్రవాద స్వభావం కలిగిన యువకులు... కాలక్రమంలో శివసేనవైపు ఆకర్షితులైనప్పటికీ, ప్రధాన స్రవంతి మరాఠాలు మాత్రం కాంగ్రెస్‌వైపే నిలబడ్డారు. శరద్ పవార్ కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి, ఎన్సీపీని స్థాపించినప్పుడు కాంగ్రెస్ పార్టీకి తొలిసారి సవాల్ ఎదురైంది. మరాఠాల్లో నిట్టనిలువునా చీలిక వచ్చింది. అయితే ఎన్సీపీతో అలయెన్స్‌ను కొనసాగించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ ఈ సవాల్‌ను అధిగమించ గలిగింది. మే నెలలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో పట్టణ ప్రాంతాల్లోని మరాఠా సంపన్నులు, ఉన్నత మధ్యతరగతి, ఉద్యోగ మేధావివర్గాలు బీజేపీవైపు మొగ్గుచూపిన వైనాన్ని ఆ పార్టీ గమనించింది. అప్పటి వరకూ ఈ వర్గాలు కాంగ్రెస్ - ఎన్సీపీలకే అండగా ఉండేవి.

ఈ మార్పు బీజేపీ నాయకత్వాన్ని ఆలోచనలో పడవేసింది. మరాఠా యేతర ఓసీ కులాలపై బీజేపీకి మంచి పట్టు ఉంది. ఓబీసీ ఓటర్లలోనూ బీజేపీ వైపే మొగ్గు కనబడుతోంది. పట్టణ ప్రాంత దళితుల్లోనూ బీజేపీ పట్ల మునుపటంత వ్యతిరేకత లేదు. పెపైచ్చు రిపబ్లికన్ పార్టీతో ఎన్నికల పొత్తు కూడా ఉంది. ముంబై నగరంలో 60 శాతానికి పైన మరాఠీయేతర భాషల ఓటర్లే. శివసేనతో పొత్తు లేకుంటే ఆ ఓట్లన్నీ బీజేపీకే! ఇక మరాఠా ఓట్లను నాలుగు ముక్కలు చేసే అవకాశాన్ని బీజేపీ ఎందుకు వదులుకుంటుంది? శివసేనతో పొత్తు విచ్ఛిన్నం కావడం, ఎన్సీపీ వేరు కుంపటి పెట్టుకోవడం... అంతా బీజేపీ వ్యూహకర్తల ఆకాంక్షల మేరకే జరిగింది. ‘సీఎస్‌డీఎస్ - లోక్‌నీతి’ సంయుక్తంగా నిర్వహించిన ఎన్నికల తదుపరి విశ్లేషణ కూడా బీజేపీ అంచనాలను రుజువు చేస్తోంది. మరాఠా ఓటర్లలో 30 శాతం మంది శివసేనకు, 24 శాతం మంది బీజేపీకి, 18 శాతం ఎన్సీపీకి, 11 శాతం మాత్రమే కాంగ్రెస్‌కు ఓటు చేశారని ఈ విశ్లేషణ వెల్లడించింది. ఈ ముందస్తు వ్యూహంతోనే మరాఠా నాయకుడెవరినీ బీజేపీ భావి నేతగా ఫోకస్ చేయలేదు. నాగపూర్‌కు చెందిన బ్రాహ్మణ యువకుడు, మచ్చలేని సంఘ సేవకుడు దేవేంద్ర ఫడణ్‌వీస్ పేరు ముఖ్యమంత్రి పదవికి ఇప్పుడు వినిపిస్తోంది.

మహారాష్ట్రలో మరాఠాల ప్రాబల్యం ఎంతో, హర్యానాలో జాట్‌ల ప్రాబ ల్యం అంత. మొత్తం జనాభాలో 28 శాతం జాట్‌లే. కానీ బీజేపీలో ఒక్క అభి మన్యు సింగ్ మినహా పెద్దగా పేరున్న జాట్ నాయకుడు ఎవరూ లేరు. జాట్ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటించనూలేదు. అయినా, అంతకుముందు 4 సీట్లున్న బీజేపీ 47 సీట్లు గెలిచి, అసెంబ్లీలో పూర్తి మెజారిటీ సాధించింది. బీజేపీ తరఫున ఇప్పుడు ముఖ్యమంత్రిగా ప్రకటించిన మనోహర్ లాల్ ఖట్టర్ పంజాబీ క్షత్రియుడు, ఈ సామాజిక వర్గం ఓటర్ల కోసం హర్యానాలో భూతద్దం తీసుకొని వెతకాల్సిందే. దీర్ఘకాలంలో ఆరెస్సెస్ ప్రచారక్‌గా పనిచేసినవాడు, ఎటువంటి ఆరోపణలు లేనివాడు కావడంవల్లనే ఖట్టర్‌ను ముఖ్యమంత్రి పద వికి ఎంపిక చేశారని భావించవచ్చు. పదేళ్లుగా అధికారంలో ఉన్న భూపీందర్ సింగ్ హుడా ప్రభుత్వంపై తీవ్రమైన ప్రజావ్యతిరేకత కారణంగా జాట్ ఓట్లు ఐఎన్‌ఎల్‌డీ-కాంగ్రెస్‌ల మధ్య నిలువునా చీలిపోయిన మాట నిజమే. కానీ మిగతా కులాల మద్దతును కూడగట్టుకోవడానికి బీజేపీ చేసిన ప్రయత్నాల్లో యూపీ మార్కు ఎత్తుగడల పాత్ర తక్కువ కాదు. 90 శాసన సభ నియోజక వర్గాల్లోకి ఇతర రాష్ట్రాలలోని బీజేపీ దళిత ఎంపీ, ఎంఎల్‌ఏలను ఎన్నికలకు చాలా ముందే ఆ పార్టీ దించింది. వారి సహాయంతో కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీల ఓటు బ్యాంకు అనుకున్న దళితులపై పట్టును సాధించడానికి ప్రయత్నించింది. పైగా దళిత సిక్కుల మద్దతును కూడగట్టింది. దీంతో మొత్తం దళిత ఓటర్లలో బీజేపీ వెనకబడలేదు. పైగా కాంగ్రెస్, ఐఎన్‌ఎల్‌డీల ‘దళిత బ్యాంకు’ నిలుపునా చీలిపోయింది. ఈ ద్విముఖ ఎత్తుగడ పారడం వల్లనే ఐఎన్‌ఎల్‌డీ-కాంగ్రెస్‌లతో సమానంగా ఆ పార్టీ దళిత ఓట్లను తెచ్చుకోగలిగింది. ఓబీసీ ఓటర్లలో ఉన్న ఆధిక్యతతో జాట్ ఓట్ల లోటును అధిగమించగలిగింది. బ్రాహ్మణ తదితర అగ్రవర్ణ ఓటర్ల దన్నుతో బీజేపీ విజయతీరాలకు చేరగలిగింది.

మహారాష్ట్ర, హర్యానాలు రెండిటిలోనూ కాంగ్రెస్‌కంటే బలమైన ఎదురు దెబ్బ ఆ రాష్ట్రాల్లో ‘మెజారిటీ’ కులాలైన మరాఠా, జాట్ కులాల అధికార గుత్తాధిపత్యానికి తగిలింది. రెండు చోట్లా బీజేపీ అనుసరించింది ఒకే వ్యూహం. ‘మెజారిటీ’ కులం ఓట్లను చీల్చడం, కాంగ్రెస్ సుదీర్ఘ పాలనలో నిర్లక్ష్యానికి గురైన వెనుకబడిన, దళిత, ఓసీ కులాలను ఆకట్టుకోవడం. పార్లమెంటు ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ వ్యతిరేకత బలంగా కొనసాగుతుండటం ఈ బీజేపీ వ్యూహం విజయవంతం కావడానికి తోడ్పడిందని విస్మరించలేం. అయితే ‘మెజారిటీ’ కులాలు ఈ ఫలితాలను రాజకీయమైనవిగానే పరిగణిస్తా యని అనుకోలేం. వారి ప్రతి చర్యలు ఎలా ఉంటాయో ఇప్పుడే చెప్పలేం. ఏది ఏమైనా అసాధ్యమనుకున్న రెండు రాష్ట్రాల్లో బీజేపీ ఒంటరిగా విజయాలను సాధించగలిగింది. అమిత్ షా ‘సోషల్ ఇంజనీరింగ్’ నైపుణ్యం ఈ విజయాలకు ఒక ప్రధాన కారణమా? అయితే అది కాంగ్రెస్ రాజకీయాలకు ప్రత్యామ్నా యంగా ఒక సరికొత్త బీజేపీ మార్కు ‘సామాజిక అమరిక’కు తెర తీస్తోందా?... లేదంటే ఎటువంటి అమరికలు, అరమరికలు లేకుండా అభివృద్ధి ఎజెండాగా అన్ని వర్గాలనూ తన వెంట నడుపుకోడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందా?... తద్వారా అది ఓటు బ్యాంకు రాజకీయాలను చావుదెబ్బ తీస్తుందా... వేచి చూడాలి.    
 
 వర్ధెల్లి మురళి

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement