మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తీరు
లోక్‌సభ ఎన్నికల్లో పరాభవం తర్వాత తొలి ప్రధాన పరీక్ష
కొన్ని ర్యాలీలు, సభలకే సోనియా, రాహుల్ పరిమితం
{పచార భారమంతా స్థానిక నాయకత్వంపైనే
మరోవైపు ప్రచారంలో దూసుకుపోతున్న బీజేపీ, మోదీ
ముంబై: లోక్‌సభలో ప్రతిపక్ష హోదా కూడా దక్కని దీన స్థితి.. అధినాయకత్వంపైనే కొందరు నేతల విమర్శలు.. సర్వేల్లో ప్రతికూల ఫలితాలు.. ఇది సాధారణ ఎన్నికల తర్వాత గత ఐదు నెలల కాలంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర, హర్యానాలో అసెంబ్లీ ఎన్నికలను ఎదుర్కొంటున్న కాంగ్రెస్ పార్టీ ఎటువంటి దిద్దుబాట్లు, సంస్థాగత మార్పులు లేకుండానే బరిలోకి దిగుతోంది. ఆఖరికి ఎన్నికల ప్రచారంలోనూ దూకుడు చూపించకుండా తనదైన పాత పంథాలోనే ముందుకు వెళుతోంది. ఈ నెల 15న జరగనున్న మహారాష్ట్ర, హర్యానా అసెంబ్లీ ఎన్నికలు బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు లోక్‌సభ ఎన్నికల తర్వాత తొలి ప్రధాన పరీక్షగా నిలిచాయి. ఈ ఎన్నికల ప్రచారంలో కాషాయదళం ప్రధాని నరేంద్రమోదీ నేతృత్వంలో దూసుకుపోతోంది. వరుస ర్యాలీలు, సభలతో పార్టీ నేతలతో కలసి మోదీ ముమ్మరంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అయితే కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సంప్రదాయ పద్ధతికే కట్టుబడి ప్రచారం కొనసాగిస్తోంది. పార్టీ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ కొన్ని ప్రచార సభలు, ర్యాలీలకే పరిమితం కాగా.. ఆయా రాష్ట్రాల్లోని స్థానిక నాయకులే ప్రచార బాధ్యతలను భుజానికెత్తుకున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో తిరుగులేని విజయం సాధించిన తర్వాత మోదీ వివిధ మార్గాల ద్వారా ఎప్పుడూ ప్రజలకు చేరువగానే ఉంటున్నారు.
ఇందుకు తన ప్రసంగాలు, సామాజిక వెబ్‌సైట్లు, రేడియో సందేశాలు ఇలా వేటినీ ఆయన విడిచిపెట్టడం లేదు. మరోవైపు కాంగ్రెస్ పార్టీలో కీలకపాత్ర పోషిస్తున్న రాహుల్ మాత్రం ప్రజలకు చేరువ కాలేకపోతున్నారు. మహారాష్ట్ర, హర్యానాలో కలిపి మోదీ 35 ర్యాలీలు, సభల్లో పాల్గొంటారని కమలనాథులు చెపుతున్నారు. కాంగ్రెస్ విషయానికి వస్తే సోనియా, రాహుల్ పరిమితంగానే ర్యాలీలు, సభల్లో పాల్గొంటున్నారు. దీనిపై కాంగ్రెస్ కార్యకర్తల నుంచే భిన్నమైన వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీ వైపు ప్రజల దృష్టిని మరల్చేలా మోదీ అనుసరిస్తున్న విధానాలను తమ పార్టీ కూడా అందిపుచ్చుకోవాలని కొందరు కాంగ్రెస్ కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో పాటు అనేక మంది పార్టీ నేతలు రాహుల్ ప్రజలకు మరింత చేరువకావాలని, మీడియాకు అందుబాటులో ఉండాలని అభిప్రాయపడుతున్నారు. షకీల్ అహ్మద్ వంటి నేతలు మాత్రం ప్రతి ఒకరికీ ఒక ప్రత్యేకమైన శైలి ఉంటుందని, రాహుల్ తన పంథాలోనే ముందుకెళ్లాలని అభిప్రాయపడ్డారు. మోదీ కేంద్రంలో అధికారాన్ని ఒకే చోట కేంద్రీకృతం చేయడం ద్వారా మిగిలిన నాయకులను పరిమితం చేస్తున్నారని, ఇది బూమరాంగ్‌లా బీజేపీకే తిరిగి తగులుతుందని షకీల్ చెప్పారు. మరో కాంగ్రెస్ నేత మాట్లాడుతూ మోదీ రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం చూస్తుంటే.. ఆ పార్టీకి రాష్ట్రాల్లో స్థానిక నాయకత్వం కొరత ఉందనే విషయం స్పష్టమవుతోందన్నారు.
పాత పంథాలోనే ‘హస్తం’..!
Published Mon, Oct 13 2014 1:53 AM | Last Updated on Fri, Mar 29 2019 9:24 PM
Advertisement