సీఎం పగ్గాలు ఫడణ్‌విస్‌కే
మహారాష్ట్ర బీజేపీఎల్పీ నేతగా ఎన్నిక
ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని గవర్నర్‌కు వినతి
ఈ నెల 31న ప్రమాణ స్వీకారం
బలనిరూపణకు 15 రోజుల గడువిచ్చిన గవర్నర్
సాక్షి, ముంబై: ‘కేంద్రంలో నరేంద్ర, రాష్ట్రంలో దేవేంద్ర’ నినాదంలో రెండో భాగమూ నిజమైంది. హంగ్ అసెంబ్లీతో ఉత్కంఠ రేపిన మహారాష్ట్రలో సీఎం ఎవరన్న సస్పెన్స్‌కు తెరపడింది. కొత్త ముఖ్యమంత్రిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు దేవేంద్ర ఫడణ్‌విస్(44) పగ్గాలు చేపట్టనున్నారు. ఆయన మంగళవారం బీజేపీ శాసనసభాపక్షనేతగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
ఈ నెల 31 శుక్రవారం రాష్ట్రంలో తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా అవతరించిన బీజేపీ ఎమ్మెల్యేలు మంగళవారమిక్కడ సమావేశమై ఫడణ్‌విస్‌ను తమ శాసనసభాపక్ష నేతగా ఎన్నుకున్నారు. అంతకుముందు జరిగిన రాష్ట్ర బీజేపీ కోర్‌కమిటీ సమావేశంలో సీనియర్ నేత ఏక్‌నాథ్ ఖడ్సేతో పాటు పలువురు ఆశావహులను కేంద్ర నాయకత్వం బుజ్జగించడంతో ఫడణ్‌విస్ ఎన్నికకు మార్గం సుగమమైంది.
కేంద్ర హోం మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ సీనియర్ నేత జేపీ నడ్డాలు పరిశీలకులుగా వ్యవహరించిన బీజేపీఎల్పీ నేత ఎన్నిక సమావేశంలో ఫడణ్‌విస్ పేరును రద్దు కానున్న అసెంబ్లీ విపక్ష నేత ఏక్‌నాథ్ ఖడ్సే స్వయంగా ప్రతిపాదించారు. సీఎం పదవికి పోటీ పడిన శాసనమండలి విపక్షనేత వినోద్ తావ్డే, సీనియర్ నేతలు సుధీర్ ముంగంటివర్, పంకజా ముండే పావ్లే తదితరులు బలపరిచారు. ఫడణ్‌విస్ ఎన్నిక తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించినట్లు రాజ్‌నాథ్ మీడియాకు తెలిపారు.
తర్వాత ఫడణ్‌విస్, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌ప్రతాప్ రూఢీ, కేంద్ర మంత్రి ప్రకాశ్ జవదేకర్, ఖడ్సే, తావ్డే, మిత్రపక్షాల నేతలు రామ్‌దాస్ అథవాలే, మహదేవ్ జంకర్‌లు రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్ సీఎచ్ విద్యాసాగరరావును కలిశారు. ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశమివ్వాలని కోరుతూ లేఖ అందించారు. వారి వినతిని గవర్నర్ మన్నించారు. తర్వాత ఫడణ్‌విస్ విలేకర్లతో మాట్లాడుతూ.. ఈ నెల 31న ప్రమాణ స్వీకారం చేశాక 15 రోజుల్లోపల ప్రభుత్వం మెజారిటీ నిరూపించుకోవాలని గవర్నర్ చెప్పారన్నారు. ప్రమాణం శుక్ర వారం సాయంత్రం 4 గంటలకు జరుగుతుందని నడ్డా తెలిపారు. శివసేనతో కలసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ఆ పార్టీతో చర్చలు సాగుతున్నాయన్నారు. వాంఖడే స్టేడియంలో జరిగే సర్కారు చారిత్రక ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీ, పలువురు కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల సీఎంలు హాజరు కానున్నారు.
పారదర్శక ప్రభుత్వాన్ని అందిస్తా: ఫడణ్‌విస్
తనను సీఎం పదవికి ఎంపిక చేసినందుకు ఫడణ్‌విస్.. బీజేపీ చీఫ్ అమిత్ షా, ప్రధాని మోదీ, కేంద్రమంత్రి గడ్కారీలకు కృతజ్ఞతలు తెలిపారు. పారదర్శక ప్రభుత్వాన్ని అందించేందుకు కృషి చేస్తానన్నారు.
బలనిరూపణ జరిగితే: బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామన్న ఎన్సీపీ.. బీజేపీ ప్రభుత్వం 288 స్థానాలున్న అసెంబ్లీలో బలాన్ని నిరూపించుకోవాల్సి వస్తే ఓటింగ్‌కు గైర్హాజరవుతామని ఇదివరకే చెప్పింది. ఎన్సీపీకి 41 మంది ఎమ్మెల్యేలున్నారు. 63 మంది ఎమ్మెల్యేలున్న శివసేన ఒకవేళ 42 మంది ఎమ్మెల్యేలున్న కాంగ్రెస్‌తో కలసి విపక్షంలో కూర్చున్నా 121 మంది బలమున్న బీజేపీ ప్రభుత్వం పరీక్షను సులభంగా గట్టెక్కుతుంది. ఎన్నికల్లో 122 స్థానాలు సాధించిన కమలనాథుల బలం ఓ ఎమ్మెల్యే మృతితో 121కి తగ్గింది. తమకు మొత్తం ఏడుగురు స్వతంత్ర ఎమ్మెల్యేలతోపాటు, చిన్నపార్టీల మద్దతు ఉందని బీజేపీ చెబుతోంది.
సీఎం ప్రమాణం వరకు వేచిచూస్తాం: మహారాష్ట్ర కొత్త ప్రభుత్వంలో తాము డిప్యూటీ సీఎం, ఇతర కీలక మంత్రి పదవులేమీ కోరడం లేదని శివసేన స్పష్టం చేసింది. బీజేపీకి మద్దతుపై తుది నిర్ణయం తీసుకోవడానికి కొత్త సీఎం ప్రమాణ స్వీకారం చేసేంతవరకు వేచి చూస్తామని పార్టీ నేత సంజయ్ రౌత్ వెల్లడించారు. తాము కీలక పదవులు కోరుతున్నట్లు మీడియాలో వస్తున్న వార్తలు అబద్ధాలన్నారు. ‘బీజేపీ, శివసేనల రక్తం గ్రూపు ఒకటే. పొత్తుకు ఎలాంటి ముందస్తు షరతులూ పెట్టలేదు’ అన్నారు.
కాగా, ప్రధాని మోదీని ఇటీవల తీవ్రంగా విమర్శించిన శివసేన.. మహారాష్ట్రలో అధికారంలో వాటా కోసం తెరవెనుక చర్చలు, ప్రభుత్వ ఏర్పాటు నేపథ్యంలో మాట మార్చింది. సంకీర్ణ ప్రభుత్వ ఏర్పాటుకు సోమవారమే సుముఖత వ్యక్తం చేసిన ఆ పార్టీ మంగళవారం ప్రధానిని ప్రశంసలతో ముంచెత్తింది. ‘మోదీ దేశ సాంస్కృతిక ముఖచిత్రాన్ని మారుస్తున్నారు. ఇది ప్రశంసనీయం. నిన్నటివరకు నేతలు రంజాన్ సందర్భంగా విందు ఇచ్చేవారు. ఇప్పుడు దీపావళినీ అలాగే నిర్వహిస్తున్నారు. ఇది ముఖ్యమైన మార్పు’ అని తన అధికార పత్రిక ‘సామ్నా’ సంపాదకీయంలో పేర్కొంది.