ముఖ్యమంత్రిగా ఎవరైనా ఓకే!
బీజేపీకి మద్దతుపై శివసేన సానుకూల వ్యాఖ్యలు
* వాంఖడే స్టేడియంలో ఘనంగా ఏర్పాట్లు
* మహారాష్ట్రలో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనున్న కమలం
* నేడే ఎల్పీ నేతను ఎన్నుకోనున్న పార్టీ ఎమ్మెల్యేలు
ముంబై: మహారాష్ట్రలో బీజేపీ ప్రభుత్వ ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. అక్టోబర్ 31న మహారాష్ట్రలో తొలి బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు కానుంది. ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని వాంఖెడే స్టేడియంలో అత్యంత ఘనంగా జరపడానికి బీజేపీ ఏర్పాట్లు ప్రారంభించింది. కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ, బీజేపీ అధ్యక్షుడు అమిత్‌షా, అగ్రనేత అద్వానీ, ఇతర సీనియర్ నేతలు, బీజేపీ ముఖ్యమంత్రులు పాల్గొననున్నారు. కాగా, శాసనసభా పక్ష నేతను ఎన్నుకోవడానికి నూతనంగా ఎన్నికైన 122 మంది బీజేపీ ఎమ్మెల్యేలు నేటి(మంగళవారం) సాయంత్రం సమావేశం కానున్నారు.
సమావేశానికి పరిశీలకుడిగా వచ్చిన బీజేపీ సీనియర్ నేత రాజ్‌నాథ్ సింగ్, మహారాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ జేపీ నద్దాల సమక్షంలో ఎమ్మెల్యేలు నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకుంటారు. అనంతరం గవర్నర్ సీహెచ్ విద్యాసాగర్ రావును కలిసి.. ప్రభుత్వ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేస్తామని పార్టీ ప్రధాన కార్యదర్శి రాజీవ్ ప్రతాప్ రూడీ తెలిపారు. మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రి రేసులో ముందున్న విషయం తెలిసిందే. అయితే, ప్రభుత్వంలో శివసేన చేరుతుందా? లేదా? అనే విషయంలో ఇంకా స్పష్టత నెలకొనలేదు. ప్రమాణ స్వీకారోత్సవ సమయంలో కాకుండా.. కొన్ని రోజుల తరువాత బీజేపీ ప్రభుత్వంలో శివసేన చేరే అవకాశాలున్నాయని పార్టీ వర్గాల సమాచారం.
బీజేపీ తరఫున ముఖ్యమంత్రిగా ఎవరిని ఎంపిక చేసినా తాము మద్ధతు ఇస్తామని సోమవారం శివసేన స్పష్టం చేసింది. బీజేపీ, సేనల సంకీర్ణ ప్రభుత్వం స్థిరంగా ఉంటుందని పార్టీ అధికార ప్రతినిధి సంజయ్ రౌత్ వ్యాఖ్యానించారు. బీజేపీతో తమ బంధం ఎప్పటినుంచో కొనసాగుతోందని, ఎన్నికల సమయంలో జరిగినదానిని తాము మరిచిపోయామని ఆయన పేర్కొన్నారు. ‘మాదేం భారత్-పాకిస్థాన్ యుద్ధం కాదు. ప్రజలు బీజేపీకి మెజారిటీ ఇచ్చారు. అందుకు అనుగుణంగా ఆ పార్టీకి మద్దతు ఇవ్వడం మా బాధ్యత. మహారాష్ట్ర ప్రజల కోసం పనిచేసేవారెవరిని సీఎంగా ఎంపిక చేసినా.. మా మద్దతు ఉంటుంది’ అని సంజయ్ స్పష్టం చేశారు.
శివసేనతో అనధికారిక చర్చలు కొనసాగుతున్నాయని పార్టీ వర్గాలు వెల్లడించాయి. అయితే, ప్రభుత్వంలో శివసేన భాగస్వామ్యంపై మంగళవారం శివసేన అధినేత ఉద్ధవ్‌ఠాక్రే, కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ల భేటీ అనంతరం స్పష్టత వచ్చే అవకాశముంది. కాగా, బీజేపీకి మద్ధతిచ్చేందుకు ఇప్పటికే ముందుకొచ్చిన ఎన్సీపీ.. విశ్వాస పరీక్షలో బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటేయబోమని స్పష్టం చేసింది. ‘విశ్వాసపరీక్ష అనివార్యమైతే.. మేం ఓటింగ్‌కు దూరంగా ఉంటాం’ అని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ చెప్పారు. మెజారిటీకి బీజేపీ 23 స్థానాల దూరంలో నిలిచిన సంగతి తెలిసిందే.