అన్ని చోట్లా బీజేపీ ఆధిక్యమే
ముంబై: మహారాష్ర్టలో కొంకణ్ మినహా అన్ని ప్రాంతాల్లోనూ బీజేపీ ఆధిక్యం కనిపించింది. ఎన్సీపీ, కాంగ్రెస్‌లకు పట్టున్న పశ్చిమ మహారాష్ట్రలో అత్యధికంగా 70 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. వీటిలో బీజేపీ 24 స్థానాలలో విజయం సాధించింది. ఎన్సీపీ 19, శివసేన 13, కాంగ్రెస్ 10 స్థానాల్లో విజయాలను నమోదు చేశాయి. ఎంఎన్‌ఎస్‌కు దక్కిన ఒకే ఒక్క సీటు ఇక్కడే ఉంది.
విదర్భలో: విదర్భ ప్రాంతంలో 62 అసెంబ్లీ సీట్లకు గాను 43 స్థానాల్లో బీజేపీ విజయ దుందుభి మోగించింది. కాంగ్రెస్ 10 స్థానాలను దక్కించుకోగా శివసేన నాలుగు. ఎన్సీపీ ఒక స్థానంతో సరిపెట్టుకున్నాయి.
మరాఠ్వాడాలో: మరాఠ్వాడాలో కూడా 15 సీట్లు కైవసం చేసుకుని బీజేపీ ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ మొత్తం 46 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా శివసేన 11, కాంగ్రెస్‌కు తొమ్మిది, ఎన్సీపీకి ఎనిమిది వచ్చాయి.
ఉత్తర మహారాష్ట్రలో: 35 స్థానాలున్న ఉత్తర మహారాష్ట్రలో బీజేపీ 14 స్థానాలను దక్కించుకుంది. శివసేన, కాంగ్రెస్‌లు ఏడేసి చొప్పున సీట్లను గెలుచుకున్నాయి. ఎన్సీపీ అయిదు సీట్లలో విజయం సాధించింది.
కొంకణ్‌లో: కొంకణ్‌లో ఠాణేతో కలిపి మొత్తం 39 స్థానాల్లో మాత్రం 14 స్థానాలతో శివసేన అతిపెద్ద పార్టీగా అవతరించింది. బీజేపీ 10 దక్కించుకోగా ఎన్సీపీ 8, కాంగ్రెస్ కేవలం ఒక స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.
ముంబైలో: ముంబైలోని 36 నియోజకవర్గాలలో బీజేపీ అత్యధికంగా 15దక్కించుకుని ప్రథమ స్థానంలో నిలిచింది. శివసేన 14, కాంగ్రెస్ అయిదింటిని దక్కించుకున్నాయి.
పట్టణంలో బీజేపీకే పట్టం
ముంబై: మహారాష్ట్ర ఎన్నికల్లో పట్టణ ప్రాంత ఓటర్లు బీజేపీ, శివసేనలను ఆదరించి.. కాంగ్రెస్, ఎన్‌సీపీ, ఎంఎన్‌ఎస్‌లను మట్టికరిపించారు. అందులోనూ శివసేనకన్నా బీజేపీ వైపే ఎక్కువ మొగ్గు చూపటం విశేషం. రాష్ట్రంలో అత్యధిక పట్టణ జనసాంద్రత కలిగిన ముంబై, దాని మహా నగర ప్రాంతం, పుణే, నాసిక్‌లతో కూడిన ‘స్వర్ణ త్రికోణ’ ప్రాంతంలో 77 స్థానాలు ఉండగా.. బీజేపీ 36 స్థానాల్లో గెలుపొందింది. మరో 24 స్థానాలను శివసేన కైవసం చేసుకుంది. ఈ ప్రాంతంఆర్థిక సుసంపన్నత కలిగిన ప్రాంతం.
ముంబైలో మాయమైన ఎంఎన్‌ఎస్...
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ముంబై నగరంలో కాంగ్రెస్ మట్టికరవగా.. రాజ్‌ఠాక్రే నేతృత్వంలోని మహారాష్ట్ర నవనిర్మాణ సేన మాయమైపోయింది. మహా నగరంలో అధిక స్థానాలను బీజేపీ, కాంగ్రెస్, శివసేనలే దక్కించుకున్నాయి. ఎంఎన్‌ఎస్‌కు ఒక్క సీటు కూడా దక్కలేదు. ఎంఐఎం, సమాజ్‌వాది పార్టీలు సైతం ఒక్కొక్క సీటు చొప్పున గెలుచుకున్నాయి. చివరకు తాను ఉత్తరాది వారికి వ్యతిరేకం కాదంటూ నిరూపించుకోవటానికి ఒకే ఒక్క ఉత్తరాది అభ్యర్థికి రాజ్‌ఠాక్రే టికెట్ ఇచ్చినా ఫలితం లేకపోయింది. కండీవాలీ స్థానం నుంచి అఖిలేశ్ చౌబే బీజేపీ అభ్యర్థి అతుల్ భట్కాల్కర్ చేతిలో ఓడిపోయారు.