ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ తన సొంత జిల్లా అయిన పుణేలో పట్టు సడలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
పుణే సిటీ, న్యూస్‌లైన్: ఎన్సీపీ అధినేత, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్‌పవార్ తన సొంత జిల్లా అయిన పుణేలో పట్టు సడలిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, ఎన్సీపీలు కూటమిగా కలసి పోటీచేస్తున్న విషయం తెలిసిందే.
జిల్లాలో నాలుగు లోక్‌సభ స్థానాలు ఉండగా, వాటిలో మూడు స్థానాల్లో ఎన్సీపీ, ఒక స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి రంగంలో ఉన్నారు. మావల్ నియోజకవర్గంలో రాహుల్ నార్వేకర్, బారామతిలో సుప్రియా సూలే, శిశూర్ నియోజక వర్గంలో దేవదత్త నికమ్‌లు ఎన్సీపీ తరఫున బరిలో ఉండగా, పుణే లోక్‌సభ స్థానం నుండి కాంగ్రెస్ అభ్యర్థి విశ్వజిత్ కదమ్ బరిలో ఉన్నారు. శిశూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్సీపీ తరఫున దేవదత్త నికమ్ నామినేషన్ దాఖలు చేశారు.
ఈ నియోజకవర్గంలో జున్నార్,అంబేగావ్, హడప్పర్, కేడ్ ఆలంది, శిశూర్, బోసరి అసెంబ్లీ సెగ్మెంట్లు ఉన్నాయి. వీటిలో ప్రస్తుతం ఐదు స్థానాల్లో ఎన్సీపీ ఎమ్మెల్యేలు ఉండగా, హసాపసర్ స్థానంలో శివసేన నాయకుడు మహదేవ్ బాబర్ అధికారంలో ఉన్నారు. కాగా, శిశూర్ లోక్‌సభ స్థానం నుంచి రెండు పర్యాయాలుగా శివసేనకు చెందిన శివాజీ అడాల్‌రావ్ పాటిల్ ఎంపీగా గెలుపొందుతూ వస్తున్నారు. ఆయన 2009 ఎన్నికల్లో ఎన్సీపీ అభ్యర్థి విలాస్ లాండేపై లక్షా 80 వేల ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. దీంతో ఈసారి విలాస్‌లాండేను పక్కన బెట్టి భీమశంకర్ సహకార చక్కర కర్మాగారం అధ్యక్షుడిగా ఉన్న దేవదత్త నికమ్‌ను తన అభ్యర్థిగా నిలబెట్టారు.
అయితే అడాల్‌రావ్‌కు ఈ ప్రాంతంలో పట్టు ఉన్న నేపథ్యంలో అతడిని నికమ్ ఎంతవరకు నిలువరించగలుగుతారో వేచిచూడాల్సిందే. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో బీఎస్పీ తరఫున సర్టేరావు వాఘమారే, ఆమ్‌ఆద్మీ పార్టీ నుంచి సోపనరావు నికమ్, మహారాష్ట్ర నవనిర్మాణ సేన నుంచి అశోకరావు ఖండె భరద్‌లు పోటీలో ఉన్నారు. కాగా, ఈసారీ విజయం తనదేనని అడాల్ రావు ధీమా వ్యక్తం చేస్తుండటం విశేషం. ఈ ప్రాంతంలో హడాపసర్, బోసిరి, ముండువ , కేశవ్ నగర్, శిక్షాపూర్ తదితర ప్రాంతాలలో తెలుగు ఓటర్లు ఉన్నారు. ప్రస్తుత ఎన్నికలపై వారి ‘స్పందన’ను న్యూస్‌లైన్ తెలుసుకున్నది. పుణేతో పోలిస్తే ఈ ప్రాంతంలో తెలుగువారు చాలా తక్కువ ఉన్నారు.