'మళ్లీ ఎన్నికలు రాకూడదనే మద్దతు'
ముంబై: మహారాష్ట్రలో తిరిగి ఎన్నికలు రాకూడదనే ఉద్దేశంతోనే తాము బీజేపీకి మద్దతు ఇస్తామని ప్రకటించినట్లు ఎన్సీపి అధినేత శరద్ పవార్ చెప్పారు. మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుకు బీజేపికి తొలినుంచి ఎన్సీపి మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. శాసనసభ ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తీ కాకుండానే బీజేపీకి బయట నుంచి మద్దతు ఇస్తామని ఎన్సీపీ ప్రకటించింది.
288 స్థానాలు గల మహారాష్ట్ర శాసన సభలో ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి 145 మంది శాసనసభ్యుల మద్దతు అవసరం ఉంది. బీజేపీ 122 శాసనసభా స్థానాలు మాత్రమే గెలుచుకుంది. దాని మిత్రపక్షమైన రాష్ట్రీయ సమాజ్‌పక్ష ఒక్క స్థానం మాత్రమే గెలుచుకుంది. శివసేన 63, కాంగ్రెస్ 42, ఎన్సీపీ 41 స్థానాలు గెలుచుకున్నాయి.
ఈ నేపధ్యంలో ఫడ్నవీస్ ప్రభుత్వం ఈ నెల 12న విశ్వాస పరీక్ష ఎదుర్కోవడానికి సిద్ధమవుతోంది. విశ్వాస పరీక్ష ఎదుర్కోవడానికి బీజేపీకి మరో 22 మంది మద్దతు అవసరం ఉంది. ఈ పరిస్థితులలో విశ్వాస పరీక్ష అంశంపై బీజేపీ ప్రభుత్వానికి బయట నుంచి మద్దతిస్తామని ఎన్సీపీ ప్రకటించింది.
**