ముంబై: ఈ రాష్ట్రాన్ని బీజేపీకి అప్పగించడం ద్వారా కేంద్రంలో పదవులు పొందడం కోసమే ఎన్సీపీ తమతో పొత్తు తెగతెంపులు చేసుకుందని కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్ ఆరోపించారు. ఆయన బుధవారం మీడియాతో మాట్లాడారు. తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉండాలని గవర్నర్ కోరిన తర్వాత ఏమాత్రం సమయం ఇవ్వకుండానే ఇక్కడ రాష్ట్రపతిపాలనకు కేంద్రం మొగ్గుచూపిందని ఆయన ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎన్సీపీ తొలగిన వెంటనే గవర్నర్ విద్యాసాగర్ రావు తనను అపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరారన్నారు.
అనంతరం కేబినెట్ సమావేశం నిర్వహించి రాష్ట్రపతిపై ఒత్తిడి తెచ్చి రాష్ట్రంలో రాష్ట్రపతిపాలన విధించేలా కేంద్రం సంతకం చేయించిందని విమర్శించారు. అతడిని కనీసం న్యాయ సలహా కూడా తీసుకోనివ్వలేదని ఆరోపించారు. కాగా దీని వెనుక ఎన్సీపీ హస్తం కూడా ఉందని ఆయన విమర్శించారు. తమను 144 అసెంబ్లీ సీట్లు అడగటంతోపాటు రెండున్నరేళ్ల పాటు సీఎం పదవి ఇవ్వాలని డిమాండ్ చేసినప్పుడే వారు తమతో పొత్తును తెగతెంపులు చేసుకోవడానికే సిద్ధపడిపోయారని అర్ధమైపోయిందని చవాన్ చెప్పారు. వారు ఈ విషయంలో ముందే బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. కేంద్రంలో మంత్రి పదవులు పొందేందుకు రాష్ట్రాన్ని వారికి ధారాదత్తం చేశారని విమర్శించారు.
కాగా ఎన్సీపీకి చెందిన మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్‌కు నీటిపారుదల కుంభకోణంలో క్లీన్ చిట్ రావడంపై చవాన్ స్పందిస్తూ.. చట్టం తన పని తాను చేసుకుపోతుందన్నారు. ‘తమిళనాడు సీఎం జయలలిత పరిస్థితి చూశారు కదా.. 18 యేళ్ల తర్వాత ఆమెపై ఆరోపణలు కోర్టులో నిరూపించబడ్డాయి.. నాలుగేళ్ల జైలు శిక్ష పడింది. మాధవ్ చితాలే కమిటీ అతడి(అజిత్ పవార్)కి క్లీన్ చిట్ ఇచ్చి ఉంటే.. కోర్టు ఎందుకు పవార్, సునీల్ తత్కారేలపై విచారణకు ఆదేశించింది?.. నీటిపారుదల శాఖ కార్పొరేషన్ చైర్మన్‌గా ఒక మంత్రి ఉండకూడదని చితాలే కమిటీ నివేదించింది.
అయితే ఆ సమయంలో అజిత్ మంత్రి కాదా? మన న్యాయవ్యవస్థ కొంత నెమ్మదిగా స్పందించవచ్చేమో గాని చివరకు న్యాయమే గెలుస్తుంది.. జయలలితకు కూడా 18 యేళ్ల తర్వాతే దోషిగా తేలింది కదా..’ అంటూ వ్యాఖ్యానించారు. తాను మహారాష్ట్రలో ఉన్న అవినీతిని అంతమొందించడానికే సీఎంగా పదవీ బాధ్యతలు స్వీకరించానన్నారు. అయితే సంకీర్ణ ప్రభుత్వంలో తన పనిని సంపూర్ణంగా చేయలేకపోయానని చెప్పారు. ఈసారి తమకు పూర్తి మెజారిటీ వస్తే.. మొదట రాష్ట్ర సహకార సంఘాలకు చైర్మన్‌గా మంత్రులను నియమించడాన్ని రద్దు చేస్తానన్నారు.
మహారాష్ట్రకు కేంద్రం సాయం అవసరంలేదని, రాష్ర్ట అభివృద్ధికి కావాల్సిన వనరులు ఇక్కడే ఉన్నాయని రాజ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై చవాన్ స్పందిస్తూ.. ఈ రాష్ట్రం భారతదేశంలో భాగమే తప్ప ప్రత్యేకంగా లేదు కదా.. రాజ్ ఠాక్రే వ్యాఖ్యలు పరిణతి లేని రాజకీయ వ్యాఖ్యలన్నారు. తమకు అధికారం ఇస్తే కేంద్ర, రాష్ట్రాల మధ్య అనుబంధాన్ని దృఢతరం చేస్తామని బీజేపీ నాయకులు ఇస్తున్న హామీలపై చవాన్ వ్యాఖ్యానిస్తూ.. రాష్ట్రంలో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర ప్రభుత్వం తమతో సత్సంబంధాలు కొనసాగించదా అంటూ ప్రశ్నించారు.
వారిది గేమ్ ప్లాన్..
Published Wed, Oct 1 2014 10:37 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement