కాంగ్రెస్, ఎన్సీపీ
దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వల్ల ఈ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలూ తప్పేట్టులేదు. మిత్రపక్షమైన ఎన్సీపీని దూరంగా ఉంచాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి విన్పిస్తోంది. శరద్ పవార్ ఆయన పరివారంపై వస్తున్న అవినీతి ఆరోపణలు తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు.
స్థానిక సమస్యలు.. ముఖ్యంగా ఇటీవల మళ్లీ పెరిగిన రైతుల ఆత్మహత్యలు, జలవనరుల ప్రాజెక్టుల కుంభకోణాలు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మొదలైనవి కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్గత కలహాలు, అసంతృప్త నాయకుల కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయితే, రాష్ట్రంలో 48 శాతం ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఇవి సానుకూలం.
రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధానంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు చూస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్గజాల్లో సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ సీఎం అశోక్ చవాన్(నాందేడ్), మిలింద్ దేవరా(దక్షిణ ముంబై), ప్రియాదత్(ముంబై నార్త్ సెంట్రల్), గురుదాస్ కామత్(ముంబై నార్త్‌వెస్ట్)లు ఉన్నారు.
కామన్‌వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న సురేష్ కల్మాడీకి పూణె టికెట్ ఇవ్వకపోవడంపై అక్కడ మంచి పట్టున్న కల్మాడీ అసంతృప్తితో ఉన్నారు. ఆదర్శ్ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్‌ను బరిలోకి దింపడంపై కూడా విమర్శలు వస్తున్నాయి.
గతంలోకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్‌సీపీ కొందరు రాష్ట్ర సీనియర్ మంత్రులను కూడా బరిలోకి దింపింది. ఎన్‌సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే, సోదరుని కుమారుడు అజిత్ పవార్‌లు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో పార్టీకి పట్టుండడంతో ఆ ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇటీవల శివసేన సిట్టింగ్ ఎంపీలు పలువురు ఎన్సీపీలో చేరారు.