Suresh Kalmadi
-
కల్మాడీ, చౌతాలా నియామకం రద్దు
వెనక్కి తగ్గిన ఐఓఏ క్రీడా మంత్రిత్వ శాఖ హర్షం నిషేధం ఎత్తివేత న్యూఢిల్లీ: తమ జీవిత కాల గౌరవ అధ్యక్షులుగా సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలా నియామకాలపై భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) దిద్దుబాటు చర్యలకు దిగింది. అవినీతి కేసుల్లో ఇరుక్కున్న వీరిద్దరి ఎంపికపై అన్ని వైపుల నుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఈ వ్యవహారంపై సీరియస్ అయిన కేంద్ర క్రీడా శాఖ ఐఓఏకు షోకాజ్ నోటీసుతో పాటు నిషేధం కూడా విధించింది. దీంతో దారిలోకొచ్చిన ఐఓఏ... కల్మాడీ, చౌతాలా నియామకాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. సోమవారం జరిగిన సమావేశం అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘గత నెల 12న చెన్నైలో జరిగిన వార్షిక సమావేశం చివర్లో ఓ సభ్యుడు ఐఓఏ ఇద్దరు జీవితకాల అధ్యక్షులను నామినేట్ చేయాలని సూచించారు. అయితే ఈ వ్యవహారంలో ఎలాంటి తీర్మానం చేయలేదు. ఓటింగ్ కూడా జరగలేదు. ఐఓఏ నియమావళి ప్రకారం సభ్యులు తమ ప్రతిపాదనలు సమర్పించాల్సి ఉంటుంది. అది కూడా జరగలేదు. సాంకేతికపరంగా అది చెల్లుబాటు కాదు. అయితే ఈ విషయం మొత్తంలో గందరగోళం జరిగి ఐఓఏకు, సభ్యులకు అసౌకర్యం కలిగించింది. ఇందుకు పశ్చాత్తాపపడుతున్నాను’ అని క్రీడా శాఖ జారీ చేసిన షోకాజ్ నోటీసుకు స్పందిస్తూ రాసిన లేఖలో ఐఓఏ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ పేర్కొన్నారు. ఐఓఏను దశాబ్దాలపాటు తన ఆధిపత్యంలో ఉంచుకున్న కల్మాడీ 2010 కామన్వెల్త్ గేమ్స్ అవినీతి కుంభకోణంలో నిందితుడిగా తొమ్మిది నెలల జైలు జీవితం గడిపారు. అలాగే హరియాణాలో చౌతాలా ఆదాయానికి మించి ఆస్తుల కేసులో విచారణ ఎదుర్కొంటున్నారు. కళంకితులకు దూరంగా ఉండాలనే తమ నియమావళికి వ్యతిరేకంగా వీరిద్దరిని గౌరవ అధ్యక్షులుగా నియమిస్తున్నట్టు ఐఓఏ ప్రకటించడం అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తించింది. స్వాగతించిన క్రీడా శాఖ... ఐఓఏ తీసుకున్న నిర్ణయంపై కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తమ సంతోషాన్ని వ్యక్తం చేసింది. దీంతో వెంటనే తాము విధించిన నిషేధాన్ని ఎత్తివేస్తున్నట్టు ప్రకటించింది. ‘ఐఓఏ నిర్ణయాన్ని మేం స్వాగతిస్తున్నాం. కల్మాడీ, చౌతాలా ఎంపికపై వెనక్కి తగ్గే వరకు తమ నిషేధం కొనసాగుతుందని ఇంతకుముందే ప్రకటించాం. ఇప్పుడు అదే జరిగింది కాబట్టి నిషేధం తొలగినట్టే’ అని క్రీడా శాఖ కార్యదర్శి ఇంజేటి శ్రీనివాస్ స్పష్టం చేశారు. -
వారిద్దరి సభ్యత్వాలు రద్దు!
-
వారిద్దరి సభ్యత్వాలు రద్దు!
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ) ఎట్టకేలకు దిగివచ్చింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలా అపాయింట్మెంట్ను రద్దు చేస్తూ ఐఓఏ నిర్ణయం తీసుకుంది. సురేష్ కల్మాడీకి జీవితకాల అధ్యక్షుడిగా పగ్గాలు అప్పచెబుతూ ఇటీవల ఐఓఏ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఐఓఏ నిర్ణయంపై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. ఆ నేపథ్యంలో వారి జీవితకాల అపాయింట్లను రద్దు చేస్తూ తాజాగా ఐఓఏ నిర్ణయం తీసుకుంది. -
ఐఓఏపై క్రీడా శాఖ సస్పెన్షన్
కల్మాడీ, చౌతాలా నియామకంపై కేంద్రం సీరియస్ న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా సురేశ్ కల్మాడీ నియామక వ్యవహారం మరింతగా ముది రింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఐఓఏను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం వరకు సమాధానమివ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినా ఐఓఏ నుంచి స్పందన లేదు. దీంతో క్రీడా శాఖ కఠిన చర్యకు దిగింది. అయితే తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ విదేశాలకు వెళ్లిన కారణంగా 15 రోజుల గడువివ్వాలని ఐఓఏ కోరింది. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి తప్పుడు చర్యలను ప్రభుత్వం ఆమోదించదు. షోకాజ్ నోటీసుకు సమాధానమివ్వకుండా మరింత గడువు కావాలంటున్నారు. అందుకే ఆ నియామకాలను ఉపసంహరించుకునే వరకు ఐఓఏను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో ఐఓఏకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం, సౌకర్యాలు పొందడానికి లేదు. జాతి గౌరవం, ప్రజల మనోభావాలు ఈ అంశంలో ఇమిడి ఉన్నాయి. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇది పారదర్శక పాలనను అతిక్రమించడమే అవుతుంది. వెంటనే తమ తప్పును సరిదిద్దుకోవాలి. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులను పదవుల్లోకి తీసుకుని తమ నియమావళినే అపహాస్యం చేసుకుంటున్నారు’ అని క్రీడా మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. మరోవైపు ఇదే విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఐఓఏ అనుబంధ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు, హాకీ ఇండియా చైర్మన్ నరీందర్ బాత్రా ప్రకటించారు. -
ఈ ఆటలు చాలించండి
ఆటగాళ్ల ఎంపిక మొదలుకొని వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడం వరకూ అన్నిటా విఫలమవుతూ అంతర్జాతీయ వేదికల్లో దేశాన్ని నగుబాటుపాలు చేస్తున్న ధోరణులపై సమీక్ష జరిగి కాస్తయినా మార్పు వస్తుందని ఎదురుచూస్తున్న క్రీడాభి మానులను తీవ్రంగా నిరాశపరిచిన సందర్భమిది. కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో భారీ కుంభకోణానికి పాల్పడినట్టు ఆరోపణలొచ్చిన సురేష్ కల్మాడీని, అలాంటి ఆరోపణలతోనే పదవి పోగొట్టుకున్న అభయ్ చౌతాలనూ ఐఓఏ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమిస్తూ ఆ సంఘం తీసుకున్న నిర్ణయం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. వారిద్దరిపై వచ్చిన ఆరోపణలు చిన్నవేమీ కాదు. ఆ కేసులు ఇంత వరకూ ఒక కొలిక్కి రాలేదు. అటు 2012–14 మధ్య అధ్యక్షుడిగా పనిచేస్తున్నప్పుడు అభయ్ చౌతాలపై వచ్చిన ఆరోపణల విషయంలో సకాలంలో చర్య తీసుకోనం దుకు అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ(ఐఓసీ) ఐఓఏను కొంతకాలం సస్పెన్షన్‌లో కూడా ఉంచింది. ఇలాంటి నేపథ్యంలో ఉన్నట్టుండి వారిద్దరికీ పదవులను కట్టబె ట్టడం ద్వారా ఐఓఏ దుస్సాహసానికి పాల్పడింది. గౌరవాధ్యక్ష పదవి అనేది కేవలం నామమాత్రమే కావొచ్చు. ఆ పదవిలో ఉన్నవారికి ఓటింగ్ హక్కు లేకపోవచ్చు. కానీ అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నవారిని అలాంటి నామ మాత్ర పదవికి ఎంపిక చేయడం కూడా తీవ్ర తప్పిదమని అనిపించకపోవడం ఆశ్చర్యం కలిగి స్తుంది. ఈ నిర్ణయంపై రేగిన దుమారానికి జడిసి...దాన్ని వెనక్కు తీసుకోనట్టయితే ఐఓఏతో తెగదెంపులు చేసుకుంటామని కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ చేసిన హెచ్చరిను గమనించి సురేష్ కల్మాడీ ఆ పదవి తీసుకోవడంలేదని ప్రకటించారు. అయితే అభయ్ మాత్రం ఇంకా బెట్టు చేస్తున్నారు. జీవితకాల గౌరవాధ్యక్ష పదవి స్వీకరించడానికి తనకు అన్ని అర్హతలున్నాయని వాదిస్తున్నారు. అంతర్జాతీయ ఒలింపిక్ సంఘం కాదంటేనే ఆ పదవిని తీసుకోవడం విరమించుకుంటానని మెలిక పెడుతున్నారు. దేశంలో క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడంపై ఐఓఏకు ఏనాడూ శ్రద్ధ లేదు. ఔత్సాహికుల్లో మెరికల్లాంటివారిని గుర్తించి వారిని మరింత మెరుగైన ఆటగాళ్లుగా తీర్చిదిద్దాల్సిన యజ్ఞంలో నిమగ్నం కావలసిన ఆ సంఘం తాము ఆడిందే ఆటగా నడుస్తోంది. ఆ విషయంలో సరిదిద్దుకోవాల్సిందిపోయి ఆరోపణ లొచ్చినవారిని ఇంత అత్యవసరంగా పదవులిచ్చి నెత్తినపెట్టుకోవాల్సిన అవసరం ఏమొచ్చిందో ఐఓఏ అధ్యక్షుడు రామచంద్రన్ చెప్పగలరా? మొన్న ఆగస్టులో రియో డీ జనిరోలో జరిగిన ఒలింపిక్స్‌లో మన క్రీడాకారుల వైఫల్యం అందరికీ తెలుసు. ఈసారి పెద్ద సంఖ్యలో క్రీడాకారుల బృందాన్ని పంపుతున్నామని, మనకు పత కాలు రావడం గ్యారెంటీ అని ఐఓఏ చాటింపు వేసింది. కానీ కడకు దక్కినవి రెండంటే రెండే పతకాలు! పీవీ సింధు వెండి పతకాన్ని, సాక్షి మాలిక్ కంచు పతకాన్ని గెల్చుకోగా తొలిసారి మహిళా జిమ్నాస్టిక్స్‌లో ప్రవేశించిన దీపా కర్మాకర్ త్రుటిలో పతకం పోగొట్టుకుంది. ఈ దుస్థితికి ఒక్క ఐఓఏను నిందించి మాత్రమే ప్రయోజనం లేదు. క్రీడాభివృద్ధికి ఇతర దేశాలు చేసే వ్యయం ముందు మనం తీసికట్టుగా ఉన్నామన్నది వాస్తవం. కేంద్రం ప్రభుత్వంగానీ, రాష్ట్రాలుగానీ క్రీడలపై అనురక్తిని ప్రదర్శించడం లేదు. గెలిచినవారికి భారీయెత్తున నజరానాలు ప్రకటించే అలవాటున్న ప్రభుత్వాలు తమ తమ బడ్జెట్లలో క్రీడలకు తగిన నిధుల్ని కేటా యించడంలో మొహం చాటేస్తున్నాయి. అమెరికాలో క్రీడలకు తలసరి రూ. 22 రూపాయలు, బ్రిటన్ 50 పైసలు ఖర్చు చేస్తుంటే మన దేశం మాత్రం ముష్టి మూడు పైసలతో సరిపెట్టుకుంటోందని స్వయానా కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ పార్లమెంటు స్థాయీ సంఘానికి రెండేళ్లక్రితం తెలిపింది. ఆఖరికి జమైకా లాంటి చిరు దేశం కూడా తలసరి 19 పైసలు ఖర్చుచేస్తోంది. మరి మనకేమైందో అర్ధం కాదు. ఢిల్లీలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియం క్రీడా స్థలాన్ని స్థాయీ సంఘం సందర్శించినప్పుడు అక్కడంతా గోతులమయంగా ఉండటాన్ని చూసి దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఎందుకిలా అని అడిగితే ఒకటే జవాబు–నిధుల కొరత! ఉన్న నిధు లనైనా సక్రమంగా ఖర్చు చేయకుండా ఎంతసేపూ కీచులాటల్లో నిమగ్నమయ్యే క్రీడా సంఘాలు ప్రతిభ గల క్రీడాకారులను నీరసపరుస్తున్నాయి. రియో ఒలింపిక్స్‌లో అద్భుత క్రీడా పాటవాన్ని ప్రదర్శించి కొద్దిలో పతకాన్ని చేజార్చుకున్న దీపా కర్మాకర్ మన జాతీయ క్రీడా సమాఖ్యలు ఎలా నడుస్తు న్నాయో, క్రీడాకారులకు అవసరమైన సౌకర్యాలు కల్పించకుండా ఎలా వేధిస్తు న్నాయో కుండబద్దలు కొట్టింది. ఈ స్థితి మారకపోతే మనకు పతకాలు రావడం దుర్లభమని హెచ్చరించింది. కానీ ఈ విషయంలో ఐఓఏతో సహా ఎవరూ దృష్టి పెట్టలేదు. క్రీడల్లో ఉన్నత ప్రమాణాలను నెలకొల్పి వాటిని అందుకునేలా క్రీడా కారుల్ని ప్రోత్సహించి వారిని ఉన్నతంగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ప్రధానంగా ఐఓఏది. ఈ క్రమంలో తమ కెదురవుతున్న అవరోధాలేమిటో కేంద్ర క్రీడా మంత్రిత్వశాఖకు అది చెప్పవలసి ఉంది. వీరిద్దరూ, జాతీయ క్రీడా సమాఖ్య వంటివి ఈ పరిస్థితులపై కూలంకషంగా సమీక్షించి లోటుపాట్లను చక్కదిద్దాల్సి ఉంటుంది. వీరందరూ కలిసి కూర్చుని ఆ పని చేయడం మానుకుని ఎవరికి వారే తీరుగా వ్యవహరిస్తున్నారు. ఈలోగా ఐఓఏ ఇప్పుడీ చవకబారు నిర్ణయం తీసుకుని పరువు పోగొట్టుకుంది. ఒకపక్క బీసీసీఐ కేసులో క్రీడలకు రాజకీయ నాయకుల్ని దూరం పెట్టాలని సుప్రీంకోర్టు హితవు చెబితే... ఆ స్ఫూర్తికి భిన్నంగా వ్యవ హరిస్తున్నామన్న ఇంగిత జ్ఞానం కూడా ఐఓఏకు లేకపోయింది. ఇప్పుడీ వివాదం ఎటూ తలెత్తింది గనుక ఐఓఏ పనితీరును, మొత్తంగా దేశంలో క్రీడల స్థితిగతులను సమీక్షించి 2020లో జరగబోయే టోక్యో ఒలింపిక్స్ నాటికి మన దేశ క్రీడారంగాన్ని మెరుగుపరచడానికి ఎలాంటి చర్యలు అవసరమో ఖరారు చేయాలి. అంతకన్నా ముందు కొత్త సంవత్సరం వివిధ ఈవెంట్లు జరగబోతున్నాయి. వాటన్నిటా మన క్రీడాకారులు మెరుగైన ఫలితాలు ప్రదర్శించగలిగితేనే టోక్యో ఒలింపిక్స్‌పై కాస్త యినా ఆశలు చిగురిస్తాయన్న సంగతి గుర్తించాలి. ఆ దిశగా చర్యలు తీసుకోవాలని అందరూ ఆశిస్తున్నారు. -
ఆ పదవి స్వీకరించను: కల్మాడీ
కళంకితులకు అత్యున్నత పదవులపై ఐఓఏకు కేంద్ర క్రీడాశాఖ నోటీసు న్యూఢిల్లీ: కామన్వెల్త్ గేమ్స్–2010 కుంభకోణంలో జైలుకెళ్లొచ్చిన సురేశ్ కల్మాడీ, అవినీతి అరోపణలెదుర్కొంటున్న అభయ్ సింగ్ చౌతాలాకు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో జీవితకాల గౌరవాధ్యక్ష పదవులు కట్టబెట్టడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దీనిపై కేంద్ర క్రీడాశాఖ కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ఐఓఏ గుర్తింపును రద్దు∙చేస్తామని హెచ్చరించింది. మరోవైపు తన నిర్దోషిత్వాన్ని నిరూపించుకునేవరకు ఆ పదవీ బాధ్యతలు చేపట్టబోమని కల్మాడీ వెల్లడించారు. ‘ఐఓఏ నిర్ణయానికి కృతజ్ఞతలు. కానీ ఇపుడున్న పరిస్థితుల్లో ఆ పదవి చేపట్టను. నాపై మోపిన అవినీతి కేసులో నిర్దోషిగా బయటపడతాననే నమ్మకం నాకుంది. అప్పుడు గౌరవాధ్యక్ష పదవిపై ఆలోచిస్తాను’ అని కల్మాడీ ఐఓఏకు రాసిన లేఖలో పేర్కొన్నారు. మరోవైపు అభయ్ సింగ్ చౌతాలా క్రీడాశాఖ మంత్రి విజయ్ గోయెల్‌పై ఎదురుదాడికి దిగారు. తాను ఐఓఏ అధ్యక్షుడిగా ఉన్నపుడు దేశంలో క్రీడాభివృద్ధికి కృషి చేశానని, గౌరవ అధ్యక్ష పదవి స్వీకరించేందుకు తనకు అర్హత ఉందని వ్యాఖ్యానించారు. వెనక్కి తగ్గాల్సిందే... ఐఓఏ నియమాళికి విరుద్ధంగా తీసుకున్న నిర్ణయాన్ని కేంద్ర క్రీడాశాఖ సమ్మతించబోదని మంత్రి గోయెల్ స్పష్టం చేశారు. ఐఓఏ తమ నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. క్రీడల్లో పారదర్శకత కోసం పాటుపడుతున్నామని... కళంకితుల్ని సహించే ప్రశ్నేలేదని ఆయన కుండబద్దలు కొట్టారు. వెనక్కి తగ్గే వరకు ఐఓఏతో తమ శాఖాపరమైన సంబంధాలను రద్దు చేసుకుంటున్నట్లు ఆయన చెప్పారు. బుధవారం జరిగిన కార్యక్రమంలో ఆయన ప్రపంచకప్ జూనియర్ హాకీ టైటిల్ నెగ్గిన భారత జట్టు సభ్యులను సన్మానించారు. మరోవైపు అర్హతలేని వారిని జీవితకాల అధ్యక్షుడిగా నియమించే అధికారం ఐఓఏకు లేదని క్రీడాశాఖ ఉన్నతాధికారులు చెప్పారు. ఐఓఏ అనుబంధ ఉపాధ్యక్షుడిగా కొనసాగిన అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు నరీందర్ బాత్రా తాజా పరిణామంపై విమర్శలు ఎక్కుపెట్టారు. ఏజీఎమ్‌లో అందరూ కలిసి తీసుకున్న ఏకగ్రీవ నిర్ణయంపై నిప్పులు చెరిగారు. ఐఓఏతో తన అనుబంధాన్ని తెగతెంపులు చేసుకుంటానన్నారు. మాజీ క్రీడల మంత్రి అజయ్ మాకెన్ ఐఓఏ నియామకాలపై విచారం వ్యక్తం చేశారు. భారత క్రీడలకు ఇలాంటి నిర్ణయాలు చేటు చేస్తాయన్నారు. క్రీడాశాఖ తక్షణమే స్పందించి తగిన చర్యలు చేపట్టాలన్నారు. -
'ఆ ఇద్దరి'పై ఐఓఏకి కేంద్రం స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాల వ్యవహారంలో ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్(ఐఓఏ)పై కేంద్ర ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. కుంభకోణాలకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్న కల్మాడి, చౌతాలాలకు ప్రతిష్టాత్మక సంస్థలో చోటు కల్పించరాదని, తక్షణమే వారు రాజీనామా చేయడమో, లేదంటే తొలగించడమో జరగాలని ఒలింపిక్ సంఘానికి(ఐఓఏకి) కేంద్ర ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు బుధవారం షోకాజ్ నోటీసులు జారీచేసింది. ఒకవేళ మాట వినకుంటే ఐఓఏకు కేంద్ర ప్రభుత్వ గుర్తింపును రద్దుచేస్తామని హెచ్చరించింది. క్రీడల మంత్రి విజయ్ గోయల్ సైతం ఈ వ్యవహారంపై స్పందిస్తూ క్రీడారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం అత్యావశ్యకాలని, వాటికి విరుద్ధంగా ఆ ఇద్దరి(కల్మాడీ, చౌతాల) ఎంపిక జరగడం గర్హనీయమని వ్యాఖ్యానించారు. మంగళవారం చెన్నైలో జరిగిన ఒలింపిక్ సంఘం సర్వసభ్య సమావేశంలో కల్మాడీ, చౌతాలలను జీవితకాల అధ్యక్షులుగా ఎన్నుకోవడంపై పెద్ద ఎత్తున విమర్శలు చెలరేగిన సంగతి తెలిసిందే. ఒలింపిక్ సంఘానికి కేంద్రం షోకాజ్ నోటీసు నేపథ్యంలో సురేశ్ కల్మాడి కాస్త వెనక్కి తగ్గినట్లు తెలిసింది. 'జీవితకాల అధ్యక్ష' పదవి చేపట్టేందుకు కల్మాడీ సుముఖంగా లేరని పలు జాతీయ చానెళ్లు వార్తలు ప్రసారం చేశాయి. అయితే కల్మాడీగానీ, చౌతాలాగానీ ఈ విషయాన్ని అధికారికంగా ధృవీకరించలేదు. కల్మాడీ, చౌతాలాల నియామకానికి సంబంధించి తాము ఎవ్వరి సూచనను పాటించాల్సిన అవసరం లేదని భారత ఒలింపిక్ సంఘం మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొంది. అయితే బుధవారం నాటి షోకాజ్ నోటీసుపై ఆ సంస్థ స్పందన వెలువడాల్సిఉంది. (చదవండి: భారత ఒలింపిక్ సంఘం సంచలన ప్రకటన) -
జీవితకాల అధ్యక్షుడిగా కల్మాడీ
భారత ఒలింపిక్ సంఘం ప్రకటన చెన్నై: ఢిల్లీ 2010 కామన్వెల్త్ క్రీడల నిర్వహణలో జరిగిన కుంభకోణంలో ఆయన ప్రధాన నిందితుడు. ఇందులో చోటు చేసుకున్న అవినీతిలో భాగం ఉందని ప్రాథమికంగా తేలడంతో పది నెలల పాటు జైల్లో కూడా ఉన్నారు. ఆయన రియో ఒలింపిక్స్ ప్రారంభోత్సవంలో పాల్గొంటే దేశం పరువు పోతుందని హైకోర్టు ఆయనను అడ్డుకుంది. ఇలాంటి నేపథ్యం ఉన్న సురేశ్ కల్మాడీ ఇప్పుడు మరోసారి భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ)లో భాగమవుతున్నారు. కల్మాడీని ‘గౌరవ’ హోదాలో తమ జీవితకాల అధ్యక్షుడిగా నియమిస్తున్నట్లు ఐఓఏ ప్రకటించింది. కల్మాడీతోపాటు గతంలోనే రద్దయిన భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు అభయ్ సింగ్ చౌతాలాను కూడా అదే హోదాలో నియమించారు. మంగళవారం ఇక్కడ జరిగిన ఐఓఏ వార్షిక సర్వసభ్య సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ జరిగింది. భారత అమెచ్యూర్ బాక్సింగ్ సమాఖ్య (ఐఏబీఎఫ్)తో మరోసారి చర్చించిన తర్వాతే కొత్తగా ఏర్పడిన భారత బాక్సింగ్ సమాఖ్య (బీఎఫ్ఐ)కు గుర్తింపు ఇవ్వడంపై తుది నిర్ణయం తీసుకుంటామని ఐఓఏ అధ్యక్షుడు ఎన్. రామచంద్రన్ వెల్లడించారు. ఇప్పటికే వివాదాల్లో ఉన్న వేర్వేరు క్రీడా సమాఖ్యలు కోర్టులకెక్కకుండా మూడు నెలల్లో చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు. లేదంటే ఆటగాళ్లను అంతర్జాతీయ టోర్నీలకు పంపించమని ఆయన హెచ్చరించారు. ఈ వివాదాల పరిష్కారానికి ముగ్గురు సభ్యులతో కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రియో ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ రజత పతక విజేత సింధును సత్కరించిన ఐఓఏ, రూ. 30 లక్షల నగదు పురస్కారాన్ని అందించింది. సాక్షి మలిక్‌కు రూ. 20 లక్షలు, కోచ్ గోపీచంద్‌కు కూడా రూ. 15 లక్షలు అందజేశారు. 2021లో ఏపీలో జాతీయ క్రీడలు! మరోవైపు 2017లో జాతీయ క్రీడలు నిర్వహించాల్సి ఉన్న గోవాకు ఐఓఏ ఆఖరి గడువు ఇచ్చింది. ఇప్పటికి 60 శాతం పనులే జరిగాయని, త్వరలో పూర్తి చేసుకోకపోతే నిర్వాహక హక్కులు తొలగిస్తామని రామచంద్రన్ చెప్పారు. అవసరమైతే నిర్వహణకు ఆంధ్రప్రదేశ్ సిద్ధంగా ఉందని కూడా ఆయన అన్నారు. అయితే 2019లో ఛత్తీస్‌గఢ్ తర్వాత 2021లో జాతీయ క్రీడల నిర్వహణకు ఏపీ, ఉత్తరాఖండ్ పోటీ పడుతున్నాయని ఆయన వెల్లడించారు. 2020లో ఆసియా బీచ్ క్రీడలకు భారత్ ఆతిథ్యం ఇవ్వనుందని ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్రలలో ఈ ఈవెంట్ జరిగే అవకాశం ఉందని కూడా రామచంద్రన్ స్పష్టం చేశారు. -
రెండో దశలో మహామహులు
ముంబై: మరాఠ్వాడా, పశ్చిమ మహారాష్ట్రలో జరగనున్న రెండో దశ మహ సంగ్రామం తుది అంకానికి చేరుకుంది. రేపు జరగనున్న 19 లోక్‌సభ నియోజకవర్గాల్లో ప్రముఖ నేతలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఈసారి వీరందరికి ప్రత్యర్థుల నుంచి తీవ్ర పోటీ ఎదురవుతుండటంతో మహా రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. రెండో దశలో మొత్తం 358 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అయితే గత రెండు నెలల నుంచి అకాల వర్షాలు, తుఫానుల ప్రభావం ఎదుర్కొన్న పశ్చిమ మహారాష్ట్ర, మరాఠ్వాడా ప్రాంతవాసులు ఈసారి ఎవరి పక్షాన నిలుస్తారనేది ఆసక్తికరంగా మారింది. భారీ పరిశ్రమలు, అభివృద్ధి జరగకపోవడంతో మరాఠ్వాడా ప్రజలు ఓటుతో ఈసారి ఏం తీర్పు చెబుతారనేది ప్రాధాన్యత సంతరించుకుంది. చక్కెర ధాన్యగారంగా ఉన్న పశ్చిమ మహారాష్ట్రలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కేంద్రంలో కీలక హోంశాఖ బాధ్యతలు నిర్వహిస్తున్న సుశీల్‌కుమార్ షిండే, ఎన్డీఏలో ప్రధాన భూమిక పోషిస్తున్న గోపీనాథ్ ముండే, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలే, ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ సీఎం అశోక్ చవాన్ బరిలో ఉండటంతో రెండో దశ ఎన్నికలపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. షోలాపూర్‌లో... షోలాపూర్ కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న సుశీల్‌కుమార్ షిండే తప్పక గెలుస్తానన్న నమ్మకంతో ఉన్నారు. ప్రత్యర్థుల నుంచి పోటీ ఎదురవుతుండంతో ప్రచారానికి చివరి రోజైనా మంగళవారం కూడా పాదయాత్ర చేశారు. ప్రజలను కలిసి ఓట్లేయాలని కోరారు. గెలుపు సులభమేనని పైకి చెబుతున్నా మహా కూటమి అభ్యర్థి శరద్ బన్సోడే గట్టి పోటీ ఇచ్చే అవకాశాలుండడంతో గత కొన్ని రోజులుగా షిండే షోలాపూర్‌లోనే మకాం వేశారు. ఇక్కడ ఉన్న తెలుగు ఓటర్లు ఈసారి ఎవరివైపు మొగ్గుచూపనున్నారనేది కీలకంగా మారింది. నాందేడ్‌లో... నాందేడ్‌లోనూ పరిస్థితి మిగతా ప్రాంతాల మాదిరిగానే ఉంది. కాంగ్రెస్ స్టార్ క్యాంపేన్లలో ఒకరైన మాజీ సీఎం అశోక్ చవాన్ ఎక్కడికి వెళ్లకుండా నాందేడ్ లోక్‌సభపై ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. ఆయనకు బీజేపీ అభ్యర్థి డీబీ పాటిల్ నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ఆదర్శ్ కుంభకోణంలో ఆరోపణలు రావడంతో ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆయన మళ్లీ రాజకీయాల్లో క్రియాశీలపాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు. దీంతో ఎలాగైన భారీ మెజార్టీతో విజయం సాధించేందుకు శ్రమటోడుస్తున్నారు. నేతలు, కార్యకర్తలు కలుపుకొని ముందుకెళుతున్నారు. బీడ్‌లో... బీడ్ లోక్‌సభ నియోజకవర్గంలో గోపీనాథ్ ముండేకు డీఎఫ్ కూటమి అభ్యర్థి, రెవెన్యూ శాఖ సహాయక మంత్రి సురేష్ ధస్ గట్టిపోటీ ఇస్తున్నారు. ఆప్ నుంచి మరాఠీ నటుడు నందూ మాధవ్ కూడా ప్రచారాన్ని ముమ్మరం చేశారు. దీంతో గత నాలుగు రోజులు నుంచి ముండే బీడ్ నియోజకవర్గంలోనే మకాం వేశారు. ముండేను ఈసారి ఓడించాలని ప్రత్యర్థులు ప్రయత్నిస్తుండటంతో ఇక్కడ రాజకీయం రసవత్తరంగా మారింది. బారామతిలో... పవార్ కుటుంబీకులకు పెట్టని కోటగా ఉన్న బారామతి లోక్‌సభ నియోజకవర్గంలో బరిలో ఉన్న ఎన్సీపీ అభ్యర్థిని సుప్రియా సూలేకు ప్రత్యర్థుల నుంచి గట్టి పోటీ ఎదురవుతోంది. ప్రజల్లో ఆదరణ ఉన్న సురేష్ ఖోపడేను ఆప్ బరిలోకి దింపడంతో ఇక్కడ ఎన్నికలు ఆసక్తికరంగా మారాయి. అయితే సుప్రియా సూలే విజయం ఖాయమని, అయితే అది ఎంత మెజార్జీ అన్నది ఎన్నికల్లో తెలుస్తుందని ఎన్సీపీ కార్యకర్తలు అంటున్నారు. రత్నగిరి-సిందుదుర్గ్లో... రత్నగిరి-సిందుదుర్గ్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న రాష్ట్ర మంత్రి నారాయణ రాణే కుమారుడు నీలేశ్ రాణేకు తీవ్ర పోటీ ఎదురవుతోంది. మిత్రపక్షమైన ఎన్సీపీలోని అనేక మంది కార్యకర్తలు నీలేశ్‌కు మద్ధతిచ్చేదే లేదని ప్రకటించడంతో నీలేశ్ విజయం మరింత సంక్లిష్టంగా మారింది. ఎన్సీపీ రెబల్ అభ్యర్థులు శివసేన అభ్యర్థి వినాయక్ రావుత్‌కు మద్ధతు ప్రకటించారు. సతారా నుంచి బరిలో ఉన్న ఎన్సీపీ అభ్యర్థి ఉదయన్‌రాజే భోస్లేకు రిపబ్లిక్ పార్టీ ఆఫ్ ఇండియా అభ్యర్థి ఆశోక్ గైక్వాడ్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. మాడా నుంచి ఎన్సీపీకి చెందిన విజయ్సిన్హా మొహిత్ పాటిల్, పుణే నుంచి రాష్ట్ర అటవీ శాఖ మంత్రి పతంగ్‌రావ్ కదమ్ కుమారుడు విశ్వజిత్ కదమ్ విజయం కోసం శ్రమటోడుస్తున్నారు. విశ్వజిత్ కదమ్‌కు బీజేపీ అభ్యర్థి అనిల్ శిరోల్, ఎమ్మెన్నెస్ అభ్యర్థి దీపక్ పైగుడే పోటీ ఇస్తున్నారు. కామన్వెల్త్ కుంభకోణంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొన్న సురేశ్ కల్మాడీకి మొదట టికెట్ ఇవ్వకపోవడంతో అసంతృప్తి వ్యక్తం చేసినా, ఆ తర్వాత విశ్వజిత్ కదమ్‌కు పూర్తి మద్ధతును ప్రకటించారు. -
తెలుగువారి ఓట్లే కీలకం
పుణే సిటీ, న్యూస్‌లైన్: పోలింగ్ గడువు సమీపిస్తుండడంతో జిల్లాలోని నాలుగు లోక్‌సభ నియోజక వర్గాల్లో బరిలోకి దిగిన ఆయా పార్టీ అభ్యర్థులతోపాటు కార్యకర్తల్లో అలజడి మొదలైంది. పుణే నియోజక వర్గం నుంచి ఇప్పటికి మూడు దఫాలు ఎంపీగా ఎన్నికైన సురేష్ కల్మాడీ కామన్వెల్త్ క్రీడల కుంభకోణంలో చిక్కుకోవడంతో ఈ టికెట్ విశ్వజిత్ కదమ్‌కు లభించింది. నగరంలో 50 శాతం మంది ప్రజలు ఇతర రాష్ట్రాలకు చెందినవారే కావడం కల్మాడీకి అనుకూలంగా పరిణమించింది. అయితే దీర్ఘకాలంగా కాంగ్రెస్, ఎన్సీపీ కూటమి అధికారంలో ఉండటంతో ఓటర్లలో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ వ్యతిరేకతను బీజేపీ కూటమి, ఎమ్మెన్నెస్‌లు తమకు అనుకూలంగా మలుచుకునేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. అయితే గతంలో కంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్సీపీ ప్రచారం అది మేరకు సఫలీకృతమవుతుందనే విషయం తెలియాలంటే ఫలితాలు వెలువడేదాకా ఆగాల్సిందే. పుణే లోక్‌సభ నియోజకవర్గ పరిధిలోకి వడగావ్ శేరి, పుణే కంటోన్మెంట్, పార్వతి, కోత్రోడ్, కసబా, శివాజీ నగర్ శాసనసభ స్థానాలున్నాయి. పుణేలో దాదాపు 60 వేలమందికిపైగా తెలుగు ఓటర్లు ఉన్నారు. నగరంలో భవానీపేట్, గంజ్ పేట్, పులే వాడా, బిబేవాడి, ఘోర్పడి, భైరోభానల, పుణే క్యాంపు, కోరేగావ్ పార్క్, ఔంద్, వడగావ్ శేరి తదితర ప్రాంతాల్లో తెలుగు ప్రజలు అత్యధికంగా నివసిస్తున్నారు. ఈ ఎన్నికల్లో బీజేపీ తరఫునఅనిల్ శిరోలే , కాంగ్రెస్ నుంచి విశ్వజిత్ కదమ్, ఎమ్మెన్నెస్ నుంచి దీపక్ పాయగుడే, ఆమ్ ఆద్మీ పార్టీ నుంచి సుభాష్ వారేలు బరిలోకి దిగారు. అదేవిధంగా పుణే మున్సిపల్ మాజీ కమిషనర్ అరుణ్ భాటియాతోపాటు కల్నల్ సురేష్ పాటిల్ ఈ ఎన్నికల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. అయితే 2009 ఎన్నికల్లో అనిల్ శిరోలే 25 వేల ఓట్ల తేడాతో సురేష్ కల్మాడీపై ఓటమిపాలయ్యారు. గత ఎన్నికల్లో సురేష్ కల్మాడీకే గట్టి పోటి ఇచ్చిన అనిల్ శిరోలే ఈ ఎన్నికల్లో విజయం సాధిస్తారని భావిస్తున్నారు. పుణే పట్టణంలో తెలుగువారు ఏవైపు మొగ్గు చూపితే వారినే విజయలక్ష్మి వరించే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఎన్నికల నేపథ్యంలో నగరపరిధిలో నివసిస్తున్న తెలుగువారు తమ మనోభావాలను ‘న్యూస్‌లైన్’తో పంచుకున్నారు. -
కాంగ్రెస్, ఎన్సీపీ
దీర్ఘకాలంగా అధికారంలో ఉండటం వల్ల ఈ కూటమి ప్రజా వ్యతిరేకతను ఎదుర్కొంటోంది. అంతర్గత కుమ్ములాటలూ తప్పేట్టులేదు. మిత్రపక్షమైన ఎన్సీపీని దూరంగా ఉంచాలనే డిమాండ్ కాంగ్రెస్ నుంచి విన్పిస్తోంది. శరద్ పవార్ ఆయన పరివారంపై వస్తున్న అవినీతి ఆరోపణలు తమ విజయావకాశాలను దెబ్బతీస్తాయని కాంగ్రెస్ నేతలు భావిస్తున్నారు. స్థానిక సమస్యలు.. ముఖ్యంగా ఇటీవల మళ్లీ పెరిగిన రైతుల ఆత్మహత్యలు, జలవనరుల ప్రాజెక్టుల కుంభకోణాలు, కేంద్రంలో యూపీఏ ప్రభుత్వ వైఫల్యం మొదలైనవి కాంగ్రెస్, ఎన్సీపీలపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. అంతర్గత కలహాలు, అసంతృప్త నాయకుల కారణంగా కూడా ఓట్లు చీలే అవకాశాలున్నాయి. అయితే, రాష్ట్రంలో 48 శాతం ఓట్లు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. కాంగ్రెస్‌కు ఇవి సానుకూలం. రాష్ట్రంలో ఎన్నికల ప్రచార బాధ్యతలను ప్రధానంగా ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఎంపీసీసీ అధ్యక్షుడు మాణిక్‌రావ్ ఠాక్రేలు చూస్తున్నారు. ఈసారి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేస్తున్న దిగ్గజాల్లో సుశీల్‌కుమార్ షిండే(షోలాపూర్), మాజీ సీఎం అశోక్ చవాన్(నాందేడ్), మిలింద్ దేవరా(దక్షిణ ముంబై), ప్రియాదత్(ముంబై నార్త్ సెంట్రల్), గురుదాస్ కామత్(ముంబై నార్త్‌వెస్ట్)లు ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల అవినీతి ఆరోపణల్లో ఇరుక్కున్న సురేష్ కల్మాడీకి పూణె టికెట్ ఇవ్వకపోవడంపై అక్కడ మంచి పట్టున్న కల్మాడీ అసంతృప్తితో ఉన్నారు. ఆదర్శ్ సోసైటీ కుంభకోణంలో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న అశోక్ చవాన్‌ను బరిలోకి దింపడంపై కూడా విమర్శలు వస్తున్నాయి. గతంలోకంటే ఎక్కువ స్థానాలను గెలుచుకునే లక్ష్యంతో ఎన్సీపీ కొందరు రాష్ట్ర సీనియర్ మంత్రులను కూడా బరిలోకి దింపింది. ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్, ఆయన కూతురు సుప్రియా సూలే, సోదరుని కుమారుడు అజిత్ పవార్లు ప్రచార బాధ్యతలు నిర్వహిస్తున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో పార్టీకి పట్టుండడంతో ఆ ప్రాంతంలోని నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. ఇటీవల శివసేన సిట్టింగ్ ఎంపీలు పలువురు ఎన్సీపీలో చేరారు.