ఐఓఏపై క్రీడా శాఖ సస్పెన్షన్
కల్మాడీ, చౌతాలా నియామకంపై కేంద్రం సీరియస్
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా సురేశ్ కల్మాడీ నియామక వ్యవహారం మరింతగా ముది రింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఐఓఏను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం వరకు సమాధానమివ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినా ఐఓఏ నుంచి స్పందన లేదు. దీంతో క్రీడా శాఖ కఠిన చర్యకు దిగింది. అయితే తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ విదేశాలకు వెళ్లిన కారణంగా 15 రోజుల గడువివ్వాలని ఐఓఏ కోరింది. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే.
‘ఇలాంటి తప్పుడు చర్యలను ప్రభుత్వం ఆమోదించదు. షోకాజ్ నోటీసుకు సమాధానమివ్వకుండా మరింత గడువు కావాలంటున్నారు. అందుకే ఆ నియామకాలను ఉపసంహరించుకునే వరకు ఐఓఏను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో ఐఓఏకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం, సౌకర్యాలు పొందడానికి లేదు. జాతి గౌరవం, ప్రజల మనోభావాలు ఈ అంశంలో ఇమిడి ఉన్నాయి. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇది పారదర్శక పాలనను అతిక్రమించడమే అవుతుంది. వెంటనే తమ తప్పును సరిదిద్దుకోవాలి. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులను పదవుల్లోకి తీసుకుని తమ నియమావళినే అపహాస్యం చేసుకుంటున్నారు’ అని క్రీడా మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. మరోవైపు ఇదే విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఐఓఏ అనుబంధ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు, హాకీ ఇండియా చైర్మన్ నరీందర్ బాత్రా ప్రకటించారు.