
న్యూఢిల్లీ: మెగా ఈవెంట్స్‌లో పతక విజేతల్ని తయారు చేయడమే లక్ష్యంగా అమలు చేస్తున్న టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం (టాప్స్) జాబితాను కేంద్ర క్రీడా శాఖ కుదించింది. గతంలో 179 మందికి ‘టాప్స్’ కింద ఆర్థిక అండదండలు అందించిన కేంద్ర ప్రభుత్వం తాజాగా 94 మందికే చేయూత ఇవ్వనుంది. ఈ పథకం కింద లబ్ధి పొందిన క్రీడాకారుల ప్రదర్శనను సమీక్షించిన క్రీడాశాఖ దాదాపు సగం మందికి కోత పెట్టింది.
ఈ 94 మంది జాబితాలో 42 మంది రెగ్యులర్ అథ్లెట్లు కాగా... 52 మంది పారా అథ్లెట్లున్నారు. పారిస్ పారాలింపిక్స్‌లో విశేష ప్రతిభ కనబరిచిన పారా అథ్లెట్లు 7 స్వర్ణాలు సహా 29 పతకాలు సాధించారు. దీంతో క్రీడాశాఖ దివ్యాంగ అథ్లెట్లకు ‘టాప్స్’లో పెద్దపీట వేసింది. గతంలో 78 మందితో ఉన్న రెగ్యులర్ అథ్లెట్లలో చాలా మందిని తప్పించింది.
గోల్ఫ్, స్విమ్మింగ్, టెన్నిస్‌లలో ఏ ఒక్కరికి ‘టాప్స్’లో చోటు దక్కలేదు. మేటి రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియాలను ‘టాప్స్’ నుంచి తప్పించారు. రెజ్లింగ్ నుంచి వీడ్కోలు తీసుకున్న వినేశ్ రాజకీయాల్లోకి వచ్చి హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసి గెలిచింది.
డోప్ టెస్టులకు గైర్హాజరు అయ్యాడనే కారణంగా జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా) బజరంగ్‌పై నాలుగేళ్లు నిషేధం విధించింది. క్రీడాకారుల ప్రదర్శన ఆధారంగా పారదర్శకంగా ఈ జాబితాను రూపొందించామని, కేవలం ప్రతిభే ప్రామాణికంగా తీసుకున్నామని దీనిపై టాప్స్ సీఈఓ ఎన్.ఎస్. జోహల్ వివరణ ఇచ్చారు.
అథ్లెటిక్స్‌లో నిరాశజనక ప్రదర్శన వల్ల 30 మంది కాగా ఇప్పుడు ముగ్గురితో సరిపెట్టుకోవాల్సి వచి్చంది. చాంపియన్ జావెలిన్ త్రోయర్, స్టార్ అథ్లెట్ నీరజ్ చోప్రా, స్టీపుల్‌చేజర్ అవినాశ్ సాబ్లే, లాంగ్ జంపర్ శ్రీశంకర్‌లకు మాత్రమే ‘టాప్స్’లో చోటు దక్కింది.
తెలంగాణ రైజింగ్ స్టార్, ప్రపంచ చాంపియన్ నిఖత్ జరీన్, టోక్యో ఒలింపిక్స్ కాంస్య విజేత లవ్లీనా బొర్గొహైన్‌లు ఇద్దరూ మహిళా బాక్సర్లకే ‘టాప్స్’ లబ్ధి చేకూరనుంది. గతంలో 8 మంది బాక్సర్లుండగా కేవలం ఇద్దరే ఇద్దరికి చోటు దక్కింది. షట్లర్లలో కిడాంబి శ్రీకాంత్‌కు, డబుల్స్ స్పెషలిస్ట్ అశ్విని పొన్నప్పలను పక్కన బెట్టిన క్రీడాశాఖ... సింధు, ప్రణయ్, లక్ష్యసేన్, డబుల్స్ అగ్రశ్రేణి జోడీ సాతి్వక్ సాయిరాజ్–చిరాగ్ షెట్టిలను జాబితాలో కొనసాగించింది.
Comments
Please login to add a commentAdd a comment