భారత ఒలింపిక్ సంఘం(ఐఓఏ)పై రెజ్లర్ వినేశ్ ఫొగట్ సంచలన ఆరోపణల నేపథ్యంలో ప్రముఖ న్యాయవాది హరీశ్ సాల్వే స్పందించారు. వినేశ్ లాయర్ల నుంచి తమకు ఎలాంటి సహకారం లభించలేదన్న ఆయన.. స్పోర్ట్స్ కోర్టు తీర్పుపై స్విస్ కోర్టులో అప్పీలుకు వెళ్దామంటే వినేశ్ నుంచి సానుకూల స్పందన రాలేదన్నారు.
కాగా ప్యారిస్ ఒలిపింక్స్-2024లో మహిళల యాభై కిలోల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్ విభాగంలో వినేశ్ ఫొగట్ ఫైనల్ చేరుకున్న విషయం తెలిసిందే. అయితే, స్వర్ణ పతక పోరుకు ముందు నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉండటంతో ఆమెపై వేటు పడింది. ఫైనల్లో పాల్గొనకుండా యునైటెడ్ వరల్డ్ రెజ్లింగ్ అనర్హురాలిగా ప్రకటించింది.
రజత పతకమైనా ఇవ్వాలని కోరగా
ఈ క్రమంలో వినేశ్ ఫొగట్, ఐఓఏ స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించింది. కానీ, అప్పటికే టైటిల్ రేసు మొదలైందని.. అందుకే వినేశ్‌కు పోటీలో పాల్గొనే అవకాశం ఇవ్వలేమని సదరు న్యాయస్థానం పేర్కొంది.
అయితే, సెమీస్ వరకు నిబంధనల ప్రకారం గెలిచాను కాబట్టి కనీసం సంయుక్త రజతమైనా ఇవ్వాలన్న వినేశ్ ఫొగట్ అభ్యర్థన పిటిషన్‌ను స్వీకరించింది. ఈ క్రమంలో వినేశ్ తరఫున హరీశ్ సాల్వేతో పాటు విదూశ్‌పత్ సింఘానియా వాదనలు వినిపించారు.
అనేక వాయిదాల అనంతరం కోర్టు తీర్పునిస్తూ.. ఒక్క గ్రాము బరువు ఎక్కువగా ఉన్నా నిబంధనలకు విరుద్ధమే అంటూ వినేశ్‌కు రజతం ఇవ్వలేమంటూ పిటిషన్‌ను కొట్టిపారేసింది.
ఐఓఏపై వినేశ్ ఆరోపణలు
ఈ పరిణామాల నేపథ్యంలో ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరిన వినేశ్ ఫొగట్ మాట్లాడుతూ.. స్పోర్ట్స్ కోర్టుకు వెళ్లిన సమయంలో ఐఓఏ నుంచి తనకు ఎలాంటి సహకారం లభించలేదని ఆరోపించింది. దేశం తరఫున కాకుండా.. తన పేరు మీదే పిటిషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చిందని.. అయితే, అక్కడా తనకు న్యాయం జరుగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. ఈ క్రమంలో హరీశ్ సాల్వే తాజాగా స్పందించారు.
వినేశ్ లాయర్లు సహకరించలేదు
‘‘ఈ కేసులో మాకు, అథ్లెట్ నియమించుకున్న లాయర్లకు మధ్య సమన్వయం లోపించింది. నిజానికి భారత ఒలింపిక్ సంఘం మెరుగైన వ్యక్తుల(తమను ఉద్దేశించి)ను ఆమె కోసం నియమించింది. కానీ.. ఆమె లాయర్లు మాత్రం.. ‘మీతో మేము ఎలాంటి విషయాలు పంచుకోము. మాకు తెలిసిన సమాచారం మీకు ఇవ్వము’ అన్నట్లుగా ప్రవర్తించారు. ఫలితంగా ప్రతి అంశంలోనూ ఆలస్యమైంది.
అయిన్పటికీ మా శక్తి వంచన లేకుండా ఆఖరి వరకు పోరాడాము. అయితే, చివరకు మాకు వ్యతిరేకంగా తీర్పు వచ్చింది. అప్పుడు కూడా నేను ఆమెకు ఓ సూచన చేశాను. మనం స్విస్ కోర్టుకు వెళ్దామని చెప్పాను.
అందుకు ఆమె ముందుకు రాలేదు కూడా
కానీ తన లాయర్లు మత్రం ఆమెకు ఇక ముందుకు వెళ్లే ఉద్దేశంలేదని చెప్పారు’’ అని హరీశ్ సాల్వే చెప్పుకొచ్చారు. కాగా ఈ పరిణామాల తర్వాత 30 ఏళ్ల వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలికి రాజకీయాల్లో చేరింది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా పోటీచేస్తోంది.
చదవండి: Vinesh Phogat: వినేశ్ ఫొగట్ ఆస్తి వివరాలు వెల్లడి.. ఎన్ని కోట్లంటే?
Comments
Please login to add a commentAdd a comment