భారత స్టార్ రెజ్లర్‌గా పేరొందిన వినేశ్ ఫొగట్ ఆస్తుల విలువ వెల్లడైంది. హర్యానా అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో నామినేషన్ వేసిన సందర్భంగా తన దగ్గర ఉన్న స్థిర, చరాస్తుల వివరాలను ఆమె వెల్లడించింది. కాగా ఒలింపిక్ పతకం గెలవాలన్న వినేశ్ ఫొగట్ కల ప్యారిస్‌లో చెదిరిపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది ఆగష్టులో జరిగిన విశ్వక్రీడల్లో మహిళల యాభై కిలోల విభాగంలో ఫైనల్‌కు చేరిన ఆమె.. స్వర్ణ పతక పోరులో తలపడకుండానే వెనుదిరగాల్సి వచ్చింది.
నిరాశతో వెనుదిరిగి
నిర్ణీత బరువు కంటే వంద గ్రాములు ఎక్కువగా ఉన్న కారణంగా వినేశ్ పోటీలో పాల్గొనకుండా అనర్హత వేటు పడింది. ఈ క్రమంలో స్పోర్ట్స్ కోర్టును ఆశ్రయించిన వినేశ్‌కు అక్కడా నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఒక్క గ్రాము అదనపు బరువు ఉన్నా పోటీకి అనుమతించరని కోర్టు స్పష్టం చేసింది. అదే విధంగా.. ఫైనల్ వరకు తన ప్రయాణం నిబంధనల ప్రకారమే సాగింది కాబట్టి కనీసం సంయుక్త రజతం ఇవ్వాలన్నా అభ్యర్థనను తిరస్కరించింది.
కుస్తీకి స్వస్తి
ఈ పరిణామాల నేపథ్యంలో కలత చెందిన వినేశ్ ఫొగట్ కుస్తీకి స్వస్తి పలుకుతున్నట్లు ప్రకటించింది. అయితే, అభిమానుల కోరిక మేరకు మళ్లీ రెజ్లర్‌గా తిరిగి వస్తానని సంకేతాలు ఇచ్చినా.. రాజకీయరంగ ప్రవేశం చేయడం ద్వారా తానిక ఆటకు పూర్తిగా దూరమైనట్లు వినేశ్ చెప్పకనే చెప్పింది. కాంగ్రెస్ అగ్రనేత, ఎంపీ రాహుల్ గాంధీ సమక్షంలో ఇటీవలే హస్తం పార్టీ కండువా కప్పుకొంది.
రాజకీయ నాయకురాలిగా మారిన వినేశ్
అంతేకాదు.. జింద్‌లోని జులనా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో నామినేషన్ వేసిన సందర్భంగా సమర్పించిన అఫిడవిట్‌లో తన ఆస్తి వివరాలను పేర్కొంది. ఆ వివరాల ప్రకారం... ‘వినేశ్ ఫొగట్ పేరిట మూడు కార్లు ఉన్నాయి. వోల్వో ఎక్స్‌సీ 60(ధర దాదాపు రూ. 35 లక్షలు), హుందాయ్ క్రెటా (రూ. 12 లక్షలు), టయోటా ఇన్నోవా(రూ. 17 లక్షలు) వినేశ్ వద్ద ఉన్నాయి.
ఆస్తి ఎన్ని కోట్లంటే?
వీటిలో టయోటా కొనుగోలు చేసేందుకు రూ. 13 లక్షలు లోన్ తీసుకున్న వినేశ్.. ప్రస్తుతం దశల వారీగా చెల్లిస్తోంది. ఇక తన స్థిరాస్తుల విలువ రూ. 2 కోట్ల మేర(సోనిపట్‌లోని ప్లాట్ విలువ) ఉంటుందని ఆమె పేర్కొంది. 2023-24 ఏడాదికి గానూ తాను రూ. 13,85,000 ఆదాయం పొందినట్లు వినేశ్ తెలిపింది. తన చేతిలో ప్రస్తుతం రూ. 1.95 వేల నగదు ఉన్నట్లు వెల్లడించింది’. కాగా రెజ్లర్‌గా ఎదిగిన క్రమంలోనే 30 ఏళ్ల వినేశ్ ఈ మేరకు ఆస్తులు కూడబెట్టినట్లు తెలుస్తోంది.
నా కల సంగీత నెరవేరుస్తుంది
వినేశ్ ఫొగట్ ఇప్పుడే రాజకీయాల్లో చేరడం తనకు ఇష్టం లేదన్న ఆమె పెదనాన్న, కోచ్ మహవీర్ ఫొగట్.. తన కుమార్తె సంగీతను లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్‌కు సిద్ధం చేస్తానని అన్నారు. ‘‘వినేశ్ వచ్చే విశ్వ క్రీడల్లో పాల్గొంటుందని భావించాను. కానీ తను రాజకీయాల్లో చేరింది. అందుకే సంగీత ఫొగట్‌ను 2028 ఒలింపిక్స్‌కు సిద్ధం చేయాలని నిశ్చయించుకున్నా.
దేశానికి తనే పతకం తీసుకువస్తుంది. జంతర్ మంతర్ వద్ద నిరసనలో పాల్గొన్న కారణంగా సంగీత ఈ ఏడాది జాతీయ పోటీల్లో పాల్గొనలేకపోయింది. ఈసారి మాత్రం అలా జరగదు’’ అని మహవీర్ ఫొగట్ పేర్కొన్నారు. కాగా నాటి రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడన్న ఆరోపణలతో జరిగిన ఉద్యమంలో వినేశ్, సంగీత, సంగీత భర్త బజరంగ్ పునియా, సాక్షి మాలిక్ తదితరులు పాల్గొన్నారు.
రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి
ఇదిలా ఉంటే.. వినేశ్‌తో కలిసి సంగీత ఫొగట్ భర్త బజరంగ్ కూడా కాంగ్రెస్‌లో చేరడం గమనార్హం. వీరిద్దరు స్పోర్ట్స్ కోటాలో తాము పొందిన రైల్వే ఉద్యోగానికి రాజీనామా చేసి హస్తం గూటికి చేరారు. కాగా వినేశ్ ఫొగట్ భర్త సోమ్‌వీర్ రాఠీ కూడా రెజ్లరే. అతడు రైల్వేలో పనిచేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment