ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్‌పై మాజీ రెజ్లర్, బీజేపీ నేత బబితా ఫొగట్ మండిపడ్డారు. తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం.. సాక్షి తన నిజాయితీని కూడా పూర్తిగా అమ్మేసుకుందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. కాగా 2016లో రియో ఒలింపిక్స్‌లో కాంస్యం గెలిచిన సాక్షి మాలిక్.. ఈ ఘనత సాధించిన భారత తొలి మహిళా రెజ్లర్‌గా చరిత్ర సృష్టించారు.
హర్యానాకు చెందిన సాక్షి ఇటీవలే తన ఆత్మకథ ‘విట్‌నెస్’ను మార్కెట్‌లో విడుదల చేశారు. అందులో ఆమె చేసిన వ్యాఖ్యలు భారత స్టార్ రెజ్లర్ల మధ్య విభేదాలకు కారణమయ్యాయి. భారత రెజ్లింగ్ సమాఖ్య మాజీ అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌పై లైంగిక వేధింపుల ఆరోపణలతో పలువురు రెజ్లర్లు ఢిల్లీ వేదికగా ఉద్యమం నడిపిన విషయం తెలిసిందే.
వినేశ్‌తో సాక్షి మాలిక్
స్వార్థంగా ఆలోచించారు
ఇందులో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తమ గళాన్ని గట్టిగా వినిపించారు. బబితా ఫొగట్ సైతం రెజ్లర్ల నిరసనకు తన మద్దతు ప్రకటించారు. అయితే, ఈ ఉద్యమ సమయంలో ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కావాలని వినేశ్ ఫొగట్, బజరంగ్ కోరడం వల్ల తమకు చెడ్డపేరు వచ్చిందని సాక్షి తన పుస్తకంలో పేర్కొన్నారు.
బబిత నటనకు కారణం అదే
ఎవరో ఉద్దేశపూర్వకంగానే వినేశ్, బజరంగ్‌లను రెచ్చగొట్టి ఇలా అత్యాశకు పోయేలా.. స్వార్థం నింపి ఉంటారని సాక్షి అభిప్రాయపడ్డారు. అంతేకాదు.. బబిత ఫొగట్ తమ ఉద్యమానికి మద్దతు తెలపడంలో కూడా స్వార్థమే ఉందని ఆరోపించారు.
తాము బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడితే.. బబిత మాత్రం రిజ్‌భూషణ్ స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందుకే.. తమ శ్రేయోభిలాషి తరహాలో బబిత ప్రవర్తించిందని సాక్షి మాలిక్ విమర్శించారు.
నీ బాధ నాకు అర్థమవుతుందిలే
ఈ నేపథ్యంలో సాక్షి ఆరోపణలపై బబితా ఫొగట్ ఘాటుగా స్పందించారు. ‘‘నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. దాని ద్వారానే నువ్వు ప్రకాశించాలి. అంతేగానీ.. ఇతరులను నిందించడం ద్వారా ఇంకెన్నాళ్లు నువ్వు ప్రకాశించగలవు? కొందరికి అసెంబ్లీ సీట్లు వచ్చాయి.
కొందరేమో పదవులు పొందారు. కానీ.. నువ్వు మాత్రం ఏదీ పొందలేకపోయావు కదా! నీ బాధ నాకు అర్థమవుతుందిలే!.. ఆమె తన పుస్తకాన్ని అమ్ముకోవడం కోసం తన నిజాయితీని కూడా అమ్ముకుంది’’ అని ఎక్స్ వేదికగా కౌంటర్ ఇచ్చారు బబిత.
వినేశ్ స్పందన ఇదే
అంతకు ముందు వినేశ్ ఫొగట్ సైతం సాక్షి మాలిక్ వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ‘‘మాది స్వార్థమా? ఇలా ఎందుకు అన్నారో ఆమెనే అడగండి. తోటి అక్కాచెల్లెళ్ల కోసం పోరాడితే దానిని స్వార్థమే అంటారంటే.. అవును ఈ విషయంలో మేము స్వార్థపరులమే. దేశం కోసం ఒలింపిక్ పతకం తేవడం స్వార్థమే అయితే.. అంతకంటే గొప్ప స్వార్థం మరొకటి ఏది ఉంటుంది?
నేను, సాక్షి, బజరంగ్ బతికి ఉన్నంతకాలం మా ఉద్యమం సజీవంగానే ఉంటుంది. ఈ ప్రయాణంలో కొన్ని అవాంతరాలు వస్తాయి. అయినా.. సరే మేము గట్టిగా పోరాడతాం’’ అని పేర్కొన్నారు. కాగా బబిత, వినేశ్ కజిన్స్ అన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. బజరంగ్.. బబిత సొంత చెల్లెలు సంగీత భర్త.
రాజకీయాల్లో ఫొగట్ కుటుంబం
ఇదిలా ఉంటే.. బబిత బీజేపీలో చేరగా.. వినేశ్ ఇటీవల హర్యానా ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున గెలిచి జులానా ఎమ్మెల్యే అయ్యారు. బజరంగ్ కూడా కాంగ్రెస్ పార్టీ మెంబర్.అయితే, సాక్షి వ్యాఖ్యలపై ఈ ఇద్దరు అక్కాచెల్లెళ్లు ఇచ్చిన కౌంటర్లు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment