భారత స్టార్ రెజ్లర్లు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ నాయకులుగా తమ ప్రయాణం మొదలుపెట్టనున్నారు. హర్యానాకు చెందిన వీరిరువురు శుక్రవారం హస్తం గూటికి చేరారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీచేసేందుకు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంలో ఒలింపిక్ పతక విజేత సాక్షి మాలిక్ స్పందించింది.
వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా రాజకీయ రంగ ప్రవేశం చేయడం వారి వ్యక్తిగత నిర్ణయమని.. తాను మాత్రం మహిళా రెజ్లర్ల తరఫున పోరాడేందుకు అంకితమవుతానని స్పష్టం చేసింది. తనకూ వివిధ రాజకీయ పార్టీల నుంచి ఆహ్వానాలు అందాయని.. అయితే, బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమాన్ని పక్కదారి పట్టించే ఉద్దేశం తనకు లేదంటూ నర్మగర్భ వ్యాఖ్యలు చేసింది.
ఢిల్లీలో నిద్రాహారాలు మాని నిరసన
కాగా భారత రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షుడి హోదాలో నాటి బీజేపీ ఎంపీ బ్రిజ్‌భూషణ్ సింగ్ మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో సాక్షి మాలిక్‌తో పాటు వినేశ్ ఫొగట్, బజరంగ్ పునియా తదితరులు బాధితులకు మద్దతుగా ఢిల్లీలో నిరసనకు దిగారు. నెలలపాటు పగలనక... రాత్రనక... తిండి నిద్రలేని రాత్రులెన్నో గడిపి బ్రిజ్‌భూషణ్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పోరాటం చేశారు.
అయితే, ఆరంభంలోనే కేంద్ర ప్రభుత్వం వీరి ఉద్యమంపై స్పందించలేదు. దీంతో పతకాలు, ప్రభుత్వ పురస్కారాలు వెనక్కి ఇచ్చేందుకు రెజ్లర్లు సిద్ధపడిన తరుణంలో ఎట్టకేలకు రెజ్లింగ్ సమాఖ్యకకు ఎన్నికలు నిర్వహించారు. బ్రిజ్‌భూషణ్ పదవి నుంచి దిగిపోయినప్పటికీ అతడి అనుచరుడు సంజయ్ గద్దెనెక్కాడు.
ఈ విషయాన్ని జీర్ణించుకోలేకపోయిన సాక్షి మాలిక్ ఆటకు స్వస్తి పలకగా.. వినేశ్, బజరంగ్ సైతం సంజయ్ ఎన్నికపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అయితే, వీరిద్దరు రెజ్లర్లుగా కొనసాగుతూనే ఉద్యమానికి అండగా ఉండగా.. సాక్షి మాత్రం బ్రిజ్‌భూషణ్ విషయంలో మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగేంతవరకు తన పోరాటం ఆగదని ప్రకటించింది.
త్యాగాలకు సిద్ధపడాలి
ఈ నేపథ్యంలో వినేశ్, బజరంగ్ రాజకీయాల్లో చేరడంపై సాక్షి మాలిక్ చేసిన వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ‘‘అది వారి వ్యక్తిగత నిర్ణయం. నాకు తెలిసినంత వరకు ఒక లక్ష్యంతో పోరాడే వారు త్యాగాలకు సిద్ధపడాలి. నేను అదే చేస్తున్నా. మహిళా రెజ్లర్లకు మద్దతుగా మేము సాగించిన పోరాటంపై విమర్శలు వచ్చేలా, వక్రభాష్యాలు ఆపాదించేందుకు ఆస్కారమిచ్చేలా నేను ప్రవర్తించాలనుకోవడం లేదు.
నిస్వార్థ పోరాటం ఆగదు
వారికి అండగా నా పోరాటం కొనసాగుతూనే ఉంటుంది. నా ఆలోచలన్నీ రెజ్లింగ్ చుట్టూనే తిరుగుతూ ఉంటాయి. నాకు కూడా రాజకీయ పార్టీల ఆహ్వానాలు అందాయి. కానీ నేను ఉద్యమ బాటనే ఎంచుకున్నాను. బాధితులకు న్యాయం జరగాలనే సదుద్దేశంతోనే, వారి ప్రయోజనాల కోసమే నేను ఈ పోరాటాన్ని మొదలుపెట్టాను.
మహిళా రెజ్లర్లకు భారత రెజ్లింగ్ సమాఖ్యలోని చీడపురుగుల వికృత చేష్టల నుంచి విముక్తి లభించేదాకా నా పోరాటం ఆగదు. మా పోరాటం నిస్వార్థమైనది.. అది కొనసాగుతూనే ఉంటుంది’’ అని సాక్షి మాలిక్ తన మనసులోని అభిప్రాయాలను వెల్లడించింది.
సాక్షి మాలిక్ సాధించిన ఘనతలు ఇవీ
కామన్వెల్త్ క్రీడల్లో మూడు పతకాలు
ఆసియా చాంపియన్‌షిప్‌లో నాలుగు పతకాలు
రియో ఒలింపిక్స్‌లో కాంస్య పతకం
Comments
Please login to add a commentAdd a comment