ఇది ప్రతీ పోరు బిడ్డ గెలుపు, ప్రతీ మహిళ విజయం : వినేశ్ ఫోగట్
విజయ దుర్గ : చిరునవ్వుతో చెక్ పెట్టేసింది!
ఆమె విజయం ప్రతి అమ్మాయి విజయం. అవును 2024 హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో జులనా నియోజకవర్గం నుంచి గెలుపొందిన కాంగ్రెస్ ఎంఎల్‌ఏ వినేశ్ ఫోగట్ విజయోత్సాహంతో అన్న మాటలు అక్షరాలా నిజం. దసరా నవరాత్రుల్లో ఆమెను విజయదుర్గగా జులనా నియోజకవర్గం ప్రజలు నిలిపారు. రెజ్లింగ్ రింగ్‌లోతగిలిన ప్రతీ దెబ్బను తట్టుకొని పైకి లేచినట్టుగా, సంచలన లైంగిక వేధింపుల వ్యతిరేక పోరాటంలో అలుపెరుగని పోరులో అరకొర చర్యలే మిగిలినా, అందినట్టే అందిన పారిస్ ఒలింపిక్స్ 2024 ఫైనల్ విజయంపై అనర్హత వేటు పడినా, ఫీనిక్స్ పక్షిలా ఆ గాయాల నుంచే తనను తాను పునఃప్రతిష్ట చేసుకొని అద్భుత విజయాన్ని సొంతం చేసుకుంది. అద్వితీయమైన మహిళా శక్తిని చాటింది.
మాజీ రెజ్లర్ వినేశ్ ఫోగట్ ఘన విజయం ప్రతీ పోరు మహిళకు గర్వకారణం. 5761 ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి యోగేష్ కుమార్‌ను ఓడించి ఎమ్మెల్యేగా విజయం సాధించింది. ఇది ప్రతీ ఆడబిడ్డ పోరాడే మార్గాన్ని ఎంచుకునే ప్రతీ మహిళ విజయంగా ఆమె అభివర్ణించింది. ఈ దేశం తనకిచ్చిన ప్రేమను, నమ్మకాన్ని నిలబెట్టుకుంటానంటూ వినేశ్ ఫోగట్ భావోద్వేగానికి లో నైంది. వినేశ్ విజయంపై కాంగ్రెస్ దిగ్గజ నేతలు, మరో రెజ్లర్, కాంగ్రెస్ నేత బజరంగ్ పునియా సహా, పలువురు సోషల్ మీడియా ద్వారా అభినందించారు. ముఖ్యంగా ఇది పార్టీల మధ్య పోరు మాత్రమే కాదు. ఈ పోరాటం బలమైన అణచివేతకు వ్యతిరేకంగా జరిగిన పోరు. ఈ గెలుపుతో దేశంలోని పోరాట శక్తులు విజయం సాధించాయని పునియా ఎక్స్‌లో రాసుకొచ్చారు.
లైంగిక వేధింపుల ఆరోపణలతో మహిళా రెజర్ల పోరు
అప్పటి రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్‌పై లైంగిక వేధింపు ఆరోపణలు దుమారాన్ని రేపాయి. వినేశ్ ఫోగాట్, సాక్షి మలిక్, బజరంగ్ పునియా, ఇతర రెజ్లర్లు దీనిపై పెద్ద యుద్ధమే చేశారు. బ్రిజ్ భూషణ్‌ను అధికారిక పదవులనుంచి తొలగించి అరెస్టు చేయాలి, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా కార్యనిర్వాహక కమిటీని రద్దు చేసి కొత్త కమిటీ కోసం ఎన్నికలు నిర్వహించాలని, తమకు న్యాయం దక్కాలని డిమాండ్ చేస్తూ మూడు నెలలపాటుధర్నా చేశారు. ఈ పోరాటంలో మహిళా రెజర్లకు మద్దతుగా నిలిచి, న్యాయ పోరాటం చేసింది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించలేదు. సరికదా ఢిల్లీలోని జంతర్ మంతర్ ఆందోళన చేస్తున్న వీరిపై పోలీసుల దమనకాండచూసి యావత్ క్రీడాప్రపంచం, క్రీడాభిమానులు నివ్వెరపోయారు.
వినేశ్ ఫోగట్
1994 ఆగస్ట్ 25 న జన్మించిన ఆమె తన రెజ్లింగ్ కెరీర్‌లో అపారమైన విజయాలను అందుకుంది. కామన్వెల్త్ గేమ్స్ బంగారు పతక విజేతగా అవతరించింది, 2014, 2018 2022లో స్వర్ణాలు గెలుచుకుంది. కామన్వెల్త్, ఆసియా క్రీడలలో బంగారు పతకం సాధించిన తొలి భారతీయ మహిళా రెజ్లర్ కూడా.
అవార్డులు , రివార్డులు
- 2016లో అర్జున అవార్డు
- 2018లో పద్మశ్రీకి నామినేట్ అయ్యారు
- 2019లో లారెస్ వరల్డ్ స్పోర్ట్స్ అవార్డ్స్ నామినేషన్
- 2020లో మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న, భారతదేశపు అత్యున్నత క్రీడా పురస్కారం,
- 2022 లో బీబీసి ఇండియన్ స్పోర్ట్స్ ఉమెన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు నామినేషన్
రెజ్లింగ్ కెరీర్ హైలైట్స్
- 2018 ఆసియా క్రీడల్లో 50 కేజీల విభాగంలో స్వర్ణం
- 2014 ఆసియా క్రీడల్లో 48 కేజీల విభాగంలో కాంస్యం
- 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో 53 కేజీల విభాగంలో స్వర్ణం
- 2019 , 2022 ప్రపంచ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లలో 53 కిలోల విభాగంలో కాంస్యం
ఇంత అద్భుతమైన రెజ్లింగ్ కెరీర్ తర్వాత, వినేష్ ఫోగట్ అనూహ్యంగా రాజకీయాల్లోకి అడుగుపెట్టడమే కాదు తొలి ప్రయత్నంలోనే గెలుపు సాధించడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment