హరియాణాలో తిరుగు‘బావుటా’
కాంగ్రెస్, బీజేపీలకు ఇక్కట్లు
ఎవరి పుట్టి ముంచుతారోనని భయం
హరియాణాలో ఎన్నికల వేడి తారాస్థాయికి చేరింది. ముఖ్యనేతలు ప్రచారంతో హోరెత్తిస్తున్నారు. లోక్‌సభ ఎన్నికల్లో మంచి ప్రదర్శన 10 సీట్లలో ఐదు నెగ్గింది) కనబర్చిన కాంగ్రెస్ హరియాణాను తమ ఖాతాలో వేసుకోగలమనే ధీమాలో ఉంది. రైతుల అసంతృప్తి, నిరుద్యోగం, బీజేపీ మాజీ ఎంపీ బ్రిజ్ భూషణ్ సింగ్‌పై రెజర్ల లైంగిక వేధింపుల ఆరోపణలు, అగి్నవీర్ పథకంపై యువతలో నెలకొన్న ఆగ్రహం.. కాంగ్రెస్ అవకాశాలను మెరుగుపరిచాయి. అయితే పార్టీలోని ఆధిపత్య పోరు కాంగ్రెస్‌ను కలవరపెడుతోంది. మరోవైపు బీజేపీ గడిచిన పదేళ్లలో చేసిన అభివృద్ధిపై ఆశలు పెట్టుకుంది.
20 స్థానాల్లో రెబెల్స్ ప్రభావం
అయితే రెండు పారీ్టలకూ తిరుగుబాటు అభ్యర్థులు దడ పుట్టిస్తున్నారు. టికెట్లు నిరాకరించడంతో.. పలువురు స్వతంత్ర అభ్యర్థులుగా బరిలో నిలిచారు. మరికొందరు ఇతర పార్టీల నుంచి నామినేషన్ వేశారు. మొత్తం మీద సొంత పార్టీలకు సవాల్ విసురుతున్నారు. హోరాహోరీ పోరులో రెబెల్స్ ఎవరి పుట్టిముంచుతారోననే దడ రెండు పారీ్టల్లోనూ ఉంది. హరియాణా అసెంబ్లీలో మొత్తం 90 స్థానాలు ఉండగా.. కనీసం 20 నియోజకవర్గాల్లో రెబెల్స్ ఫలితాలను తారుమారు చేసే స్థితిలో ఉన్నారు.
15 స్థానాల్లో 19 మంది బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు బరిలో నిలిచారు. 20 నియోజకవర్గాల్లో 29 మంది కాంగ్రెస్ రెబెల్స్ పోటీలో ఉన్నారు. 7 స్థానాల్లో 12 మంది అసంతృప్త నేతలను కాంగ్రెస్ బుజ్జగించింది. అలాగే 6 నియోజకవర్గాల్లో బీజేపీ తిరుగుబాటు అభ్యర్థులు పార్టీ సీనియర్ల విజ్ఞప్తులను మన్నించి తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. హరియాణా ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థులు గణనీయమైన ఓట్ల శాతాన్ని రాబట్టుకుంటూ వస్తున్నారు. ఇది ప్రధాన పారీ్టలకు తలనొప్పిగా మారింది. గెలుపోటములను ప్రభావితం చేయగలిగే స్థాయిలో వీరు ఓట్లను చీల్చితే.. తాము నష్టపోతామని కాంగ్రెస్, బీజేపీ నాయకులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు.
అందరి దృష్టి హిసార్ పైనే..
బీజేపీ రెబెల్స్‌లో దేశవ్యాప్తంగా రాజకీయ విశ్లేషకుల దృష్టిని ఆకర్షిస్తున్నది సావిత్రి జిందాల్. ఓ.పి.జిందాల్ గ్రూపు చైర్‌పర్సన్ అయిన సావిత్రి భారత్‌లోనే అత్యంత సంపన్న మహిళ. హిసార్‌లో ఆమె స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగి ఆరోగ్యశాఖ మంత్రి కమల్ గుప్తాకు ముచ్చెమటలు పట్టిస్తున్నారు. ఆమె కుమారుడు నవీన్ జిందాల్ ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ గూటికి చేరి.. కురుక్షేత్ర ఎంపీగా గెలిచారు.
కమల్ గుప్తా గడిచిన రెండు అసెంబ్లీ ఎన్నికల్లో హిసార్ నుంచి విజయం సాధించారు. 2009లో ఇక్కడ సావిత్రి జిందాల్ కాంగ్రెస్ టికెట్‌పై గెలిచారు. గనౌర్ స్థానంలో బీజేపీ అభ్యర్థి దేవేందర్ కౌశిక్‌కు రెబెల్ అభ్యర్థి దేవేందర్ కడ్యాన్ నుంచి తీవ్ర పోటీ ఎదురవుతోంది. బీజేపీ ఓటు బ్యాంకును వీరిద్దరూ పంచుకుంటుండడంతో కాంగ్రెస్ అభ్యర్థి కుల్దీప్ శర్మకు కలిసివస్తోంది. కుల్దీప్ 2009, 2014లలో రెండుసార్లు గనౌర్ నుంచి గెలుపొందారు.
బీజేపీ టికెట్‌ను నిరాకరించడంతో మాజీ విద్యుత్‌శాఖ మంత్రి రంజిత్‌సింగ్ చౌతాలా రైనా నుంచి ఇండిపెండెంట్‌గా పోటీచేస్తున్నారు. 2009, 2014లలో కాంగ్రెస్ నుంచి పోటీచేసి ఓడిపోయిన రంజిత్‌సింగ్.. 2019లో రైనా నుంచి స్వతంత్ర అభ్యరి్థగా విజయం సాధించారు. 2024 సార్వత్రిక ఎన్నికలకు ముందు బీజేపీ చేరారు. గురుగావ్‌లో బీజేపీ ట్రేడ్ సెల్ మాజీ కనీ్వనర్ నవీన్ గోయల్ రెబెల్ అభ్యరి్థగా బరిలో నిలిచారు. సఫిదాన్‌లో బీజేపీ అభ్యర్థి రామ్‌కుమార్ గౌతమ్‌కు తిరుగుబాటు అభ్యర్థి బచన్‌సింగ్ ఆర్య చెమటలు పట్టిస్తున్నారు. సఫిదాన్‌లో బచన్‌సింగ్ 2009, 2019లలో రెండోస్థానంలో నిలువడం గమనార్హం.
కాంగ్రెస్‌కూ సెగ..
అంబాలా కంటోన్మెంట్ నియోజకవర్గంలో బీజేపీ తరఫున బలమైన నేత అనిల్ విజ్ మరోసారి బరిలో నిలువగా.. కాంగ్రెస్‌ను చిత్ర సర్వరా భయం వెంటాడుతోంది. 2009, 2014లలో అనిల్ విజ్ చేతిలో ఓటమి చవిచూసిన చిత్ర 2019లో స్వతంత్ర అభ్యరి్థగా బరిలోకి దిగి రెండోస్థానంలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యరి్థని మూడోస్థానానికి నెట్టారు. దాంతో కాంగ్రెస్ ఆమెను ఆరేళ్లు పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. జగధారి నియోజకవర్గంలో కాంగ్రెస్ నాయకుడు ఆదర్శపాల్ గుర్జా ర్ పార్టీ మారి ఆప్ అభ్యర్థిగా పోటీచేస్తున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి అక్రమ్ ఖాన్‌కు గట్టి సవాల్ విసురుతున్నారు.
ఇది బీజేపీ సిట్టింగ్ ఎమ్మెల్యే కన్వర్‌పాల్‌కు అడ్వాంజేట్‌గా మారింది. అక్రమ్‌ఖాన్ 2009లో బీఎస్పీ టికెట్‌పై ఎమ్మెల్యేగా గెలిచారు. 2014, 2019లలో రెండోస్థానానికి పరిమితమయ్యారు. సదౌ రా నియోజకవర్గంలో బ్రిజ్‌పాల్ చప్పర్ బీఎస్పీ తీర్థం పుచ్చుకొని కాంగ్రెస్ సిట్టింగ్ ఎమ్మెల్యే రేణు బాలాపై పోటీచేస్తునానరు. రేణు 2019లో 17 వేల ఓట్ల మెజారిటీతో నెగ్గారు. అయితే సదౌరాలో బీఎస్పీ 2009, 2019లలో 18–19 శాతం ఓట్లు సాధించడం.. కాంగ్రెస్ అభ్యర్థి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. మొత్తం మీద ఏ పార్టీని రెబెల్స్ ఎంతమేరకు దెబ్బతీస్తారనేది అక్టోబరు 8న ఓట్ల లెక్కింపు తర్వాత తేలనుంది. హరియాణా అసెంబ్లీకి అక్టోబరు 5న పోలింగ్ జరగనున్న విషయం తెలిసిందే.
– సాక్షి, నేషనల్ డెస్క్
Comments
Please login to add a commentAdd a comment