బీజేపీ అనూహ్య విజయం... కశ్మీర్‌లో ఎన్‌సీ–కాంగ్రెస్ కూటమి గెలుపు
హరియాణాలో ‘ఎగ్జిట్ పోల్స్’ తలకిందులు
48 చోట్ల కమలదళం జయకేతనం
37 స్థానాలతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
జమ్మూకశ్మీర్‌లో ఎన్‌సీ–కాంగ్రెస్ కూటమికి 49 సీట్లు... సీఎంగా ఒమర్ అబ్దుల్లా
ప్రభుత్వ వ్యతిరేకతను అలవోకగా అధిగమించిన కమలనాథులు
48 చోట్ల విజయపతాక ఎగరేసిన విజయభేరి
37 సీట్లతో సరిపెట్టుకున్న కాంగ్రెస్
ఇరు పార్టీలకు పడిన ఓట్లలో తేడా కేవలం 0.85%
హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో అనూహ్యంగా బీజేపీ హ్యాట్రిక్ విజయాన్ని నమోదు చేసింది. ఎగ్జిట్ పోల్స్ అంచనాలన్నింటినీ తలకిందులు చేస్తూ.. 48 సీట్లతో సొంతంగా మెజారిటీ సాధించింది. గెలుపు తమదేననే ధీమాతో వెళ్లిన కాంగ్రెస్ అంతర్గత కుమ్ములాటల నష్టాన్ని నివారించలేకపోయింది. మరోవైపు ఆర్టికల్ 370 రద్దు తర్వాత తొలిసారిగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నేషనల్ కాన్ఫరెన్స్– కాంగ్రెస్ కూటమి విజయాన్ని సొంతం చేసుకుంది. సీపీఎంతో కలిసి కూటమికి 49 స్థానాలు లభించాయి.
హరియాణా ప్రజలు తప్పుడు ప్రచారాన్ని తిరస్కరించారు. అభివృద్ధికి గ్యారంటీని గెలిపించారు. భగవద్గీత బోధించిన నేలపై సత్యం, అభివృద్ధి, సుపరిపాలనకు దక్కిన విజయమిది. ఏ రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పాటు చేసినా దీర్ఘకాలం పాటు ప్రజలు మద్దతిస్తూ వచ్చారు. అక్కడ కాంగ్రెస్‌కు ‘నో ఎంట్రీ’చూపించారు. అధికారాన్ని జన్మహక్కుగా భావించే కాంగ్రెస్‌కు మళ్లీ అవకాశమివ్వడం చాలా అరుదు. వరుసగా మూడోసారి బీజేపీకి మెజారిటీ ఇచ్చిన హరియాణా ప్రజలకు హృదయపూర్వక ధన్యవాదాలు. కూటములు కడుతూ భాగస్వాములపై ఆధారపడే కాంగ్రెస్ పార్టీ పరాన్నజీవి. ఒక్కోసారి ఆ పార్టీలనే మింగేస్తుంటుంది.
జమ్మూకశ్మీర్‌లో అసెంబ్లీ ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించడం భారత రాజ్యాంగం, ప్రజాస్వా మ్యం సాధించిన విజయం. మంచి ఫలితాలు సాధించిన నేషనల్ కాన్ఫరెన్స్‌కు అభినందనలు. బీజేపీ సాధించిన ఫలితాలను చూసి గర్వంగా ఉంది. మా పార్టీపై నమ్మకముంచి, ఓటేసిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు – బీజేపీ కార్యాలయంలో మోదీ
చండీగఢ్: పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకతను పటాపంచలు చేస్తూ, ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తలకిందులు చేస్తూ బీజేపీ మూడోసారీ హరియాణాలో అధికార పగ్గాలు చేపట్టేందుకు సిద్ధమైంది. జాట్‌లనే నమ్ముకున్న కాంగ్రెస్ చతికిలపడితే ఓబీసీ, దళితులు, బ్రాహ్మణుల ఓట్లను సమీకరించి బీజేపీ జయకేతనం ఎగరేసింది. దీంతో లోక్‌సభ ఎన్నికల్లో తగ్గిన ఎంపీ సీట్లతో కుదుపులకు లోనైన కమలనాథుల విజయరథ జైత్రయాత్ర.. హరియాణాలో మాత్రం సాఫీగా సాగింది.
మంగళవారం ఉదయం కౌంటింగ్ మొదలయ్యాక ఆరంభ రౌండ్లలో కాంగ్రెస్ ఆధిక్యత స్పష్టంగా కనిపించింది. తర్వాత ఉదయం 10, 11 గంటల సమయం దాటగానే ఫలితాల సరళిలో నాటకీయ పరిణామాలు చోటుచేసుకున్నాయి. కాంగ్రెస్ ఆధిక్యత క్రమంగా తగ్గుతూ బీజేపీ పుంజుకుంది. అది అలాగే తుదికంటా కొనసాగి కమలనాథులకు విజయాన్ని కట్టబెట్టింది. మంగళవారం వెల్లడైన హరియాణా శాసనసభ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ 48 సీట్లను కైవసం చేసుకుని అతిపెద్ద పార్టీగా అవతరించింది. కాంగ్రెస్ పార్టీ 37 స్థానాలతో సరిపెట్టుకుంది. అయితే బీజేపీకి 39.94 శాతం ఓట్లు పడగా దాదాపు అదే స్థాయిలో కాంగ్రెస్‌కు 39.09 శాతం ఓట్లు పడ్డాయి.
కాంగ్రెస్ కంటే కేవలం 0.85 శాతం ఓట్ల ఆధిక్యతతో బీజేపీ ఏకంగా 11 సీట్లను ఎక్కువ గెల్చుకోవడం గమనార్హం. చాలా చోట్ల అత్యల్ప తేడాతో కాంగ్రెస్ ఓడినట్లు వార్తలొచ్చాయి. ఈవీఎంలలో అవకతవకలు జరిగాయని కాంగ్రెస్ ఆరోపించగా వాటిని నిరాధార ఆరోపణలుగా కేంద్ర ఎన్నికల సంఘం కొట్టిపారేసింది. ఇండియన్ నేషనల్ లోక్‌దళ్(ఐఎన్‌ఎల్‌డీ) పార్టీ కేవలం రెండు చోట్ల గెలిచింది. స్వతంత్రులు మూడు స్థానాల్లో నెగ్గారు. దుష్యంత్ చౌతాలా సారథ్యంలోని జననాయక్ జనతా పార్టీ(జేజేపీ) ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. సొంతంగా బరిలో దిగిన ఆమ్ ఆద్మీ పార్టీ కేవలం 1.79 శాతం ఓట్లతో గెలుపు బోణీ కొట్టలేక ఉసూరుమంది.
మల్లయోధురాలి గెలుపు పట్టు
బీజేపీ నేత, ప్రస్తుత ముఖ్యమంత్రి నయాబ్ సింగ్ సైనీ(లాద్వా), కాంగ్రెస్ నేత భూపీందర్ సింగ్ హూడా(గర్హీ సాంప్లా–కిలోయీ) విజయం సాధించారు. ఒలింపిక్స్‌లో స్వర్ణం కొద్దిలో చేజార్చుకున్న మల్లయోధురాలు వినేశ్ ఫొగాట్ ఎన్నికల్లో మాత్రం విజయాన్ని తొలి ప్రయత్నంలోనే ఒడిసిపట్టుకున్నారు. ఇటీవల కాంగ్రెస్ కండువా కప్పుకున్న ఈమె జూలానా నియోజకవర్గంలో విజయకేతనం ఎగరేశారు. హిసార్‌లో కాంగ్రెస్ అభ్యర్థి రామ్‌నివాస్ రాణాపై దేశంలోనే అత్యంత ధనిక మహిళ సావిత్రి జిందాల్ స్వతంత్య్ర అభ్యరి్థగా పోటీచేసి గెలిచారు.
జేజేపీ నేత, మాజీ ఉపముఖ్యమంత్రి దుష్యంత్ చౌతాలా, హరియాణా కాంగ్రెస్ చీఫ్ ఉదయ్ భాన్, మాజీ సీఎం భజన్‌లాల్ మనవడు, బీజేపీ నేత భవ్య బిష్ణోయ్ ఓటమిని చవిచూశారు. భవ్య ఓడిపోయిన అదమ్‌పూర్ స్థానం గత ఐదు దశాబ్దాలుగా బిష్ణోయ్‌లకు కంచుకోటగా ఉంది. ఐఎన్‌ఎల్‌డీ నేత అభయ్ సింగ్ చౌతాలా సైతం ఓడిపోయారు. ఎగ్జిట్ పోల్స్‌ను తలకిందులు చేసిన బీజేపీ తన కేబినెట్ మంత్రులను మాత్రం గెలిపించుకోలేకపోయింది. అసెంబ్లీ స్పీకర్, బీజేపీ నేత జ్ఞాన్‌చంద్ గుప్తా, ఎనిమిది మంది మంత్రులు ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో 15 శాతం ఓట్లతో 10 స్థానాల్లో గెలిచిన జననాయక్ జనతా పార్టీ ఈసారి పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది.
13 మంది
మహిళల విజయం
90 స్థానాలున్న అసెంబ్లీలోకి ఈసారి 13 మంది మహిళలు అడుగుపెట్టబోతున్నారు. వినేశ్ ఫొగాట్, సావిత్రి జిందాల్‌సహా 13 మంది గెల్చారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో 8 మంది మహిళా అభ్యర్థులు గెలిచారు. బీజేపీ నుంచి ఐదుగురు, కాంగ్రెస్ నుంచి ఏడుగురు మహిళలు విజయం సాధించారు.
ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం: సీఎం సైనీ
పార్టీని విజయతీరాలకు చేర్చినందుకు ఓటర్లకు బీజేపీ నేత, ముఖ్యమంత్రి సైనీ కృతజ్ఞతలు తెలిపారు. ‘‘ మోదీ నాయకత్వంలో ప్రభుత్వ విధానాలకు ప్రజలు పట్టంకట్టారు. ప్రభుత్వ పథకాలకు ప్రజామోదం దక్కిందనడానికి ఈ ఫలితాలే నిదర్శనం. ఈ గెలుపు ఘనత పూర్తిగా మోదీజీదే’ అని సీఎం అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment