హస్తం అస్తవ్యస్తం | Congress party defeat in Haryana | Sakshi
Sakshi News home page

హస్తం అస్తవ్యస్తం

Published Wed, Oct 9 2024 4:31 AM | Last Updated on Wed, Oct 9 2024 4:31 AM

Congress party defeat in Haryana

హరియాణా రాష్ట్ర నాయకత్వంలో లోపించిన ఐక్యత

గెలుపు గుర్రాలను వదిలేసి అస్మదీయులకే టికెట్లు

జాట్‌యేతర వర్గాలను తమ వైపు తిప్పుకోలేకపోయిన కాంగ్రెస్‌

హరియాణాలో ఈసారి కాంగ్రెస్‌ క్లీన్‌స్వీప్‌ చేయనుందన్న ఎగ్జిట్‌ పోల్స్‌ అంచనాలు, తీవ్రంగా నెలకొన్న ప్రభుత్వ వ్యతిరేకత, ఎలాగూ గెలిచేది మేమేనన్న కాంగ్రెస్‌ నేతల అతి ఆత్మవిశ్వాసం.. వెరసి హస్తం పార్టీని మరోసారి అధికారానికి దూరంచేశాయి. మోదీ–షా ద్వయం రాజకీయ చతురత ధాటికి కాంగ్రెస్‌ మూడోసారీ ఓటమిని మూటగట్టుకుంది. స్వీయ తప్పిదాలు సైతం కాంగ్రెస్‌ను విజయానికి ఆమడదూరంలో ఆపేశాయి. కేవలం జాట్‌ వర్గం పైనే గంపెడాశలు పెట్టుకోవడం, రాష్ట్ర కాంగ్రెస్‌ సీనియర్‌ నేత భూపీందర్‌ సింగ్‌ హూడా అడుగుజాడల్లో నడవడం, కుమారి సెల్జా వంటి దళిత నాయకురాలికి ప్రాధాన్యత తగ్గించడం, అగ్రనేతల మధ్య లోపించిన ఐక్యత వంటి అంశాలు కాంగ్రెస్‌ను పదేళ్ల తర్వాత అధికారం పీఠంపై కూర్చోనివ్వకుండా చేశాయి.

ఏకమైన జాట్‌ వ్యతిరేక ఓట్లు
మొదట్నుంచీ రాష్ట్రంలోని జాట్‌ ఓట్లనే కాంగ్రెస్‌ నమ్ముకుంది. జాట్‌యేతర దళితులు, ఓబీసీలు బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారన్న సంకేతాలను కాంగ్రెస్‌ పసిగట్టలేకపోయింది. ఇది కాంగ్రెస్‌ ఓటమికి ప్రధాన కారణం. బీజేపీ అత్యధిక టికెట్లను ఓబీసీలు, బ్రాహ్మణులకే ఇచ్చింది. అయితే కాంగ్రెస్‌ పార్టీ ఎక్కువ భూపీందర్‌ నిర్ణయాలపై ఆధారపడింది. దీన్ని అలుసుగా తీసుకున్న భూపీందర్‌ కేవలం తన అనుచరగణానికే పెద్దపీట వేశారు. ఎక్కువ మందికి టికెట్లు ఇప్పించుకున్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర రాజకీయాలను శాసించే భూపీందర్‌ పరోక్షంగా పార్టీ ఓటమికి కారణమయ్యారు.

గెలుపు గుర్రాలా? కాదా? అనేది చూసుకోకుండా తన అనుచరవర్గానికే అత్యధికంగా పార్టీ టికెట్లు దక్కేలాచేశారు. రాష్ట్రంలో 90 స్థానాలుంటే 72 చోట్ల కాంగ్రెస్‌ టికెట్‌ పొందిన వాళ్లు భూపేందర్‌ మనుషులే. తాను గెలిచి తన వారినీ గెలిపించుకుంటానన్న భూపీందర్‌ అతివిశ్వాసమే కాంగ్రెస్‌ పుట్టి ముంచిందని తెలుస్తోంది. కుమారి సెల్జా తన అనుచరుల్లో 9 మందికి టికెట్‌ దక్కేలా చేశారు. రణ్‌దీప్‌ సూర్జేవాలా సైతం తన వారికి టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో గెలుపు గుర్రాలను పక్కనబెట్టిన కాంగ్రెస్‌ భారీ మూల్యం చెల్లించుకుంది.

దూరంగా ఉండిపోయిన సెల్జా
బీజేపీకి దగ్గరవుతున్న దళితులను కాంగ్రెస్‌ వైపునకు తిప్పే సత్తా ఉన్న దళిత నాయకురాలు కుమారి సెల్జా. అయితే ఈమె ఎన్నికల్లో క్రియాశీలక పాత్ర పోషించలేదు. సిర్సా ఎంపీ అయిన సెల్జాను పార్టీ అధిష్టా నమే హరియాణా ఎన్నికల్లో కలగజేసు కోవద్దని సూచించినట్లు సమాచారం. దీని వెనుక భూపీందర్‌ హస్తముందని వార్తలొచ్చాయి. పార్టీ మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలోనూ సెల్జా పాల్గొనలేదు. కీలక ప్రచార ఘట్టాల్లోనూ ఆమె జాడ లేదు. 

ఒకే పార్టీలో వేర్వేరుగా ప్రచారం
రాష్ట్ర నేతలంతా కలిసి ఒకే ప్రచార కార్యక్రమం చేస్తే అది ప్రజల్లోకి బలంగా వెళ్తుంది. అందుకు భిన్నంగా ముఖ్య నేతలు ఎవరికి వారే భిన్న కార్యక్రమాలు చేపట్టి దేనికీ అగ్రతాంబూలం దక్కకుండా చేసుకున్నారు. భూపీందర్‌ వర్గం విడిగా ‘ఘర్‌ ఘర్‌ కాంగ్రెస్‌’ అంటూ ఇంటింటికీ ప్రచారం మొదలెట్టింది. వీళ్లకు పోటీగా కాంగ్రెస్‌లోనే సెల్జా, రణ్‌దీప్‌ సూర్జేవాలాలు ‘కాంగ్రెస్‌ సందేశ్‌’ యాత్రను మొదలెట్టారు. హరియాణా జనాభాలో 26–28 శాతం మంది జాట్‌లు ఉంటారు. ఇక్కడ 17 ఎస్సీ రిజర్వ్‌డ్‌ స్థానాలున్నాయి. మెజారిటీ మార్కును చేరుకోవడానికి అవకాశాలను పెంచే ఈ ఎస్సీ స్థానాలపై కాంగ్రెస్‌ పెద్దగా దృష్టిపెట్టలేదు. 

దెబ్బకొట్టిన ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులు
ప్రభుత్వ వ్యతిరేకతను ఓట్లుగా మార్చుకోవడంలో కాంగ్రెస్‌ విఫలమైంది. దీనిని ప్రాంతీయ పార్టీలు, స్వతంత్ర అభ్యర్థులు అవరోధంగా తయారయ్యారు. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు కాంగ్రెస్‌తోపాటు ప్రాంతీయ పార్టీలు, స్వతంత్రులకు మళ్లాయి. దీంతో ఎవరికీ సరైన మెజారిటీ రాలేదు. ఇది బీజేపీకి లాభం చేకూర్చింది. చాలా స్థానాల్లో గెలుపు మార్జిన్లు చాలా స్వల్పంగా ఉండటం చూస్తుంటే ప్రభుత్వ వ్యతిరేక ఓట్లు బాగా చీలినట్లు అర్థమవుతోంది. బీజేపీకి, కాంగ్రెస్‌కు మధ్య ఓట్ల తేడా కేవలం 0.85 శాతం కాగా, ఒంటరిగా పోటీ చేసిన ఆప్‌కు 1.79 శాతం ఓట్లు రావడం గమనార్హం.

మరోవైపు దళితుల ఓట్లు పెద్దగా కాంగ్రెస్‌కు పడలేదు. జననాయక్‌ జనతా పార్టీ, ఇండియన్‌ నేషనల్‌ లోక్‌దళ్, ఆజాద్‌ సమాజ్‌ పార్టీ, బహుజన్‌ సమాజ్‌ పార్టీలు ప్రధానంగా దళితుల ఓట్లపై దృష్టిపెట్టాయి. దీంతో దళితులు కేవలం ఒక్క పార్టీకే ఓటేయకుండా వేర్వేరు పార్టీలకు ఓట్లేయడంతో ఓట్లు చీలాయి. ఇవి పరోక్షంగా బీజేపీకి లాభం చేకూర్చగా కాంగ్రెస్‌ నష్టపోయింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే మళ్లీ జాట్‌ల ఆధిపత్యం కొనసాగుతుందన్న భావనతో ఇతర కులాలు, వర్గాలు ఉద్దేశపూర్వకంగానే ఒక్క బీజేపీకే ఓటేశాయని రాజకీయ పండితులు చెబుతున్నారు.  బరిలో నిల్చొని దాదాపు 10 స్థానాల్లో విజయావకాశాలను కాంగ్రెస్‌ రెబల్స్‌ దెబ్బతీశారు.      – సాక్షి, నేషనల్‌ డెస్క్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement