రెజ్లర్ల నిరసన పోరాటంపై సాక్షి మలిక్ తీవ్ర వ్యాఖ్యలు
వినేశ్, బజరంగ్‌లపై విమర్శలు
న్యూఢిల్లీ: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు నిరసనగా కొన్నాళ్ల క్రితం ఢిల్లీ వీధుల్లో సీనియర్ రెజ్లర్లు పోరాడారు. రెజ్లింగ్ సంఘం అధ్యక్షుడు బ్రిజ్‌భూషణ్ సింగ్‌కు వ్యతిరేకంగా వీరంతా సమష్టిగా ఉద్యమంలో పాల్గొన్నారు. ఇందులో ప్రధానంగా ముగ్గురు రెజ్లర్లు వినేశ్ ఫొగాట్, బజరంగ్ పూనియా, సాక్షి మలిక్ నిరాటంకంగా పాల్గొని పోరాటాన్ని ముందుండి నడిపించారు. అయితే ఇప్పుడు సాక్షి మలిక్ నాటి ఘటనపై పలు భిన్నమైన విషయాలు చెప్పింది.
తన పుస్తకం ‘విట్‌నెస్’లో సహచర రెజ్లర్లు వినేశ్, బజరంగ్‌లపై ఆమె విమర్శలు కూడా చేసింది. ఆసియా క్రీడల సెలక్షన్స్ నుంచి తమకు మినహాయింపు కోరడం వినేశ్, బజరంగ్ చేసిన పెద్ద తప్పని ఆమె వ్యాఖ్యానించింది. ఈ సడలింపు వల్లే తమ నిరసనకు చెడ్డ పేరు వచ్చిందని ఆమె అభిప్రాయ పడింది. భారత రెజ్లింగ్ సమాఖ్యపై నిషేధం తర్వాత బాధ్యతలు తీసుకున్న తాత్కాలిక కమిటీ హాంగ్జౌ ఆసియా క్రీడల సెలక్షన్స్‌లో పాల్గొనకుండా నేరుగా పాల్గొనే అవకాశం వినేశ్, బజరంగ్‌లకు కల్పించింది.
సాక్షి మాత్రం దీనికి అంగీకరించలేదు. ‘వినేశ్, బజరంగ్ సన్నిహితులు కొందరు వారిలో స్వార్థం నింపారు. వారిద్దరు తమ సొంత ప్రయోజనాల కోసమే ఆలోచించేలా చేయగలిగారు. వినేశ్, బజరంగ్‌లకు సడలింపు ఇవ్వడం మేలు చేయలేదు. మా నిరసనకు అప్పటి వరకు వచి్చన మంచి పేరును ఇది దెబ్బ తీసింది. ఒకదశలో సెలక్షన్స్ కోసమే ఇదంతా చేస్తున్నారా అని అంతా అనుకునే పరిస్థితి వచి్చంది’ అని సాక్షి వెల్లడించింది. మరోవైపు బబిత ఫొగాట్ తమ నిరసనకు మద్దతు పలకడంలో కూడా స్వార్థమే ఉందని ఆమె పేర్కొంది. ‘మేమందరం బ్రిజ్‌భూషణ్‌ను పదవి నుంచి తప్పించేందుకు పోరాడుతూ వచ్చాం. బబిత ఫొగాట్ మరోలా ఆలోచించింది. బ్రిజ్‌భూషణ్‌ను తొలగించడమే కాదు. అతని స్థానంలో తాను రెజ్లింగ్ సమాఖ్య అధ్యక్షురాలు కావాలనుకుంది. అందుకే మా శ్రేయోభిలాషి తరహాలో ఆమె ప్రవర్తించింది’ అని సాక్షి వ్యాఖ్యానించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో సాక్షి కాంస్య పతకం గెలుచుకుంది.
.
Comments
Please login to add a commentAdd a comment