
ఐఓఏ అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్ మేరీకోమ్ వివరణ
న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్ చైర్‌పర్సన్, దిగ్గజ మహిళా బాక్సర్ మేరీకోమ్ తన పదవికి రాజీనామా చేయలేదని స్పష్టం చేసింది. పదవీకాలం ముగిసేవరకు బాధ్యతలు కొనసాగిస్తానని చెప్పింది. ఐదుసార్లు ప్రపంచ చాంపియన్‌గా నిలిచిన ఆమె 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకం కూడా గెలుచుకుంది. 42 ఏళ్ల ఈ మణిపురి స్టార్ బాక్సర్ ఇటీవల డెహ్రాడూన్‌లో జరిగిన జాతీయ క్రీడల ముగింపు కార్యక్రమంలో పాల్గొంది.
ఆ సమయంలో ఆమె అథ్లెట్స్ కమిషన్ పదవిపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు నెట్టింట ప్రచారం జరిగింది. కానీ మేరీ మాత్రం తన వాట్సాప్ గ్రూప్ సంభాషణను తప్పుగా అన్వయిస్తూ మీడియాకు లీక్ చేశారని, రాజీనామా చేసినట్లు కూడా ప్రచారం చేశారని పేర్కొంది. ‘నేను అథ్లెట్స్ కమిషన్‌కు రాజీనామా చేయనేలేదు. 2026లో పూర్తయ్యే పదవీకాలం వరకు చైర్‌పర్సన్‌గా కొనసాగుతాను. ఆ రోజు నేను కమిషన్ సభ్యులతో అన్నది వేరు... నెట్టింట ప్రచారమైంది వేరు.
అథ్లెట్స్ కమిషన్ సభ్యులు తమ పద్ధతి మార్చుకోవాలని సూచించాను. తనతో ప్రవర్తించే తీరు ఇలాగే కొనసాగితే రాజీనామాకు సైతం వెనుకాడనని చెప్పాను. కానీ రాజీనామా చేశానని చెప్పనే లేదు. నేను రాజీనామా చేశానంటున్నారు కదా! మరి రాజీనామా లేఖ ఏది? ఎవరైనా చూశారా? అని ప్రశ్నించింది. ఐఓఏ తన కుటుంబమని... దీంతో ఎప్పుడు విబేధించనని... ఇంతటితో వాట్సాప్ సంభాషణ వివాదానికి ముగింపు పలుకుతున్నానని చెప్పారు.
2022లో ఐఓఏ అథ్లెట్స్ కమిషన్‌కు మేరీకోమ్ చైర్‌పర్సన్‌గా ఎన్నికైంది. టేబుల్ టెన్నిస్ స్టార్ అచంట శరత్ కమల్ వైస్ చైర్మన్‌గా ఉన్నారు. ఇంకా ఈ కమిషన్‌లో రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు, మాజీ షాట్‌పుటర్ ఓం ప్రకాశ్ కర్హాన, ఒలింపియన్ శివ కేశవన్, లండన్ ఒలింపిక్స్ కాంస్య విజేత, షూటర్ గగన్ నారంగ్ (షూటర్), రోయర్ బజరంగ్ లాల్, ఫెన్సింగ్ ప్లేయర్ భవానీ దేవి, భారత మహిళల హాకీ మాజీ కెపె్టన్ రాణి రాంపాల్, టోక్యో ఒలింపిక్స్ రజత విజేత మీరాబాయి చాను సభ్యులుగా ఉన్నారు.
Comments
Please login to add a commentAdd a comment