న్యూఢిల్లీ: భారత స్టార్ షట్లర్, ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) అథ్లెట్స్ కమిషన్‌కు ఎన్నికైంది. ఈ కమిషన్‌లో పది మంది క్రీడాకారులుంటారు. ఇందులో ఐదుసార్లు ప్రపంచ మహిళా బాక్సింగ్ విజేత మేరీకోమ్, వింటర్ ఒలింపియన్ శివ కేశవన్, మీరాబాయి చాను (వెయిట్‌లిఫ్టింగ్), గగన్ నారంగ్ (షూటింగ్), వెటరన్ ప్లేయర్ శరత్ కమల్ (టేబుల్ టెన్నిస్), రాణి రాంపాల్ (మహిళా హాకీ), భవాని దేవి (ఫెన్సింగ్), భజరంగ్ లాల్ (రోయింగ్), ఓం కర్హన (షాట్‌పుట్)లు ఉన్నారు.
లింగ వివక్షకు తావులేకుండా ఐదుగురు చొప్పున మహిళా, పురుష ప్లేయర్లకు ఐఓఏ కమిషన్‌లో సమ ప్రాధాన్యత ఇచ్చారు. పది మంది సభ్యులకు గాను సరిపడా నామినేషన్లు వేయడంతో వాళ్లంతా ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ఐఓఏ వెల్లడించింది. కొత్త ఐఓఏ నియమావళి ప్రకారం ఈ కమిషన్ నుంచి ఇద్దరు సభ్యులు (పురుషుడు, మహిళ) ఐఓఏకు సంబంధించిన వ్యవహారాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలి. ఐఓఏలోని సభ్యులకు ఉన్న ఓటింగ్ హక్కులు కమిషన్‌లోని ఇద్దరు సభ్యులకు ఉంటాయని ఐఓఏ వర్గాలు వెల్లడించాయి.
Comments
Please login to add a commentAdd a comment