Union Sports Ministry
-
‘ఖేల్ రత్నా’లు సాత్విక్, చిరాగ్
న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ లభించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్‌లకు అందించే ‘ద్రోణాచార్య’ అవార్డును రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి... లైఫ్‌టైమ్ విభాగంలో ముగ్గురికి ప్రకటించారు. ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి క్రీడా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ‘ఖేల్ రత్న’ అందుకోనుండగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్) ‘అర్జున’ పురస్కారం పొందాడు. తెలంగాణకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగ్‌లకు కూడా ‘అర్జున’ అవార్డు దక్కింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు. ♦ ‘ఖేల్ రత్న’ అవార్డీలకు మెడల్, ప్రశంస పత్రంతోపాటు రూ. 25 లక్షలు... ‘అర్జున’ విజేతలకు రూ. 15 లక్షలు... ‘ద్రోణాచార్య’ అవార్డీలకు రూ. 15 లక్షలు... ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్మెంట్ అవార్డీలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది. ♦గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 33 ఏళ్ల అజయ్ 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అజయ్ సారథ్యంలోనే భారత్ 2017 టి20 వరల్డ్ కప్, 2018 వన్డే వరల్డ్‌కప్, 2022 టి20 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది. ♦ నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల హుసాముద్దీన్ ఈ ఏడాది తాషె్కంట్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి ప్లో కాంస్య పతకం గెలిచాడు. ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వ హిస్తున్న హుసాముద్దీన్ 2022 ఆసియా చాంపియన్‌షి ప్లో... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు నెగ్గాడు. ♦ హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది అజర్బైజాన్లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షి ప్లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్లో స్వర్ణ పతకాలు గెలిచింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు నెగ్గింది. గత ఏడాది జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది. నిలకడగా... మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం సాత్విక్–చిరాగ్ జోడీ సూపర్ ఫామ్‌లో ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షి ప్లో... చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ జంట స్వర్ణ పతకాలు సాధించింది. స్విస్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది. చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. దాంతోపాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2022లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ విజేతగా నిలువడంలో సాత్విక్–చిరాగ్ శెట్టి కీలకపాత్ర పోషించారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం పసిడి పతకాన్ని దక్కించుకుంది. అంతేకాకుండా ఇండియా ఓపెన్ సూపర్–500, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీల్లోనూ టైటిల్స్ కైవసం చేసుకుంది. 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు మిక్స్డ్ టీమ్‌లో స్వర్ణం రావడానికి సాత్విక్–చిరాగ్ ముఖ్యపాత్ర పోషించారు. అవార్డు గ్రహీతలు... ‘ఖేల్ రత్న’ (2): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్). అర్జున అవార్డీలు (26): ఒజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అదితి స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్, పారుల్ చౌధరీ (అథ్లెటిక్స్), హుసాముద్దీన్ (బాక్సింగ్), వైశాలి (చెస్), షమీ (క్రికెట్), అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్ ( ఈక్విస్ట్రి యన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను (హాకీ), పవన్ కుమార్, రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో–ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ (స్క్వాష్), అహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్, అంతిమ్ పంఘాల్ (రెజ్లింగ్), రోషిబీనా (వుషు), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్). ద్రోణాచార్య అవార్డీలు (రెగ్యులర్ కేటగిరీ–5): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్). ద్రోణాచర్య అవార్డీలు (లైఫ్‌టైమ్–3): జస్కీరత్ సింగ్ గ్రెవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టేబుల్ టెన్నిస్). ధ్యాన్‌చంద్ అవార్డీలు (లైఫ్‌టైమ్ అచీవ్మెంట్–3): మంజూషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ). మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (అత్యుత్తమ యూనివర్సిటీలు–3): 1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్సర్), 2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్), 3. కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర, హరియాణా). -
వీరులకు బ్రహ్మరథం.. విమానాశ్రయంలో రచ్చ
ఒలింపిక్స్ చరిత్రలోనే ఈసారి అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన భారత క్రీడాకారులు సోమవారం టోక్యో నుంచి స్వదేశానికి చేరుకున్నారు. ఒలింపిక్స్ అథ్లెటిక్స్‌లో భారత్‌కు తొలి పతకం, అదీ స్వర్ణం అందించిన జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా... రజత, కాంస్య పతకాలు సాధించిన రెజ్లర్లు రవి, బజరంగ్.. కాంస్యం నెగ్గిన మహిళా బాక్సర్ లవ్లీనా... 41 ఏళ్ల విరామం తర్వాత విశ్వ క్రీడల్లో పతకం సాధించిన భారత పురుషుల హాకీ జట్టు... నాలుగో స్థానంలో నిలిచిన భారత మహిళల హాకీ జట్టు సభ్యులకు ఇందిరాగాంధీ విమానాశ్రయంలో అభిమానులు ఘనస్వాగతం పలికారు. సాయంత్రం కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆధ్వ ర్యంలో పతక విజేతలకు సన్మాన కార్యక్రమం జరిగింది. తాను సాధించిన పతకం తన ఒక్కడిదే కాదని, దేశ ప్రజలందరిదని నీరజ్ చోప్రా అన్నాడు. నీరజ్ చోప్రా, రవి దహియా బజరంగ్, లవ్లీనా ‘మీరంతా నవతరం హీరోలు...’ ► టోక్యో ఒలింపిక్స్ పతక విజేతలపై ప్రశంసల జల్లు ► స్వదేశంలో ఘన స్వాగతం ► కేంద్ర క్రీడా శాఖ ఆధ్వర్యంలో సన్మాన కార్యక్రమం న్యూఢిల్లీ: టోక్యో ఒలింపిక్స్‌లో భారత క్రీడాకారుల ప్రదర్శన... ప్రపంచాన్ని గెలవాలనుకునే భారత కొత్త తరానికి స్ఫూర్తిగా నిలిచిందని కేంద్ర క్రీడా శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ అన్నారు. మున్ముందు కూడా అన్ని రకాలుగా క్రీడాకారులకు ప్రభుత్వం అండగా నిలుస్తుందని ఆయన ప్రకటించారు. టోక్యో ఒలింపిక్స్‌లో పతకాలు సాధించి సోమవారం స్వదేశం చేరుకున్న అథ్లెట్ నీరజ్ చోప్రా, రెజ్లర్లు రవి దహియా, బజరంగ్ పూనియా, మహిళా బాక్సర్ లవ్లీనా బొర్గొహైన్‌లతో పాటు భారత పురుషుల హాకీ జట్టు సభ్యులకు సోమవారం కేంద్ర ప్రభుత్వం తరఫున ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా ఠాకూర్ మాట్లాడుతూ... ‘స్వీయ క్రమశిక్షణ, అంకితభావం ఉంటే ఎలాంటి ఫలితాలు వస్తాయో భారత అథ్లెట్లు చూపించారు. సన్మాన కార్యక్రమంలో స్వర్ణ పతకంతో నీరజ్ చోప్రా, కేంద్ర క్రీడల మంత్రి అనురాగ్ ఠాకూర్; రజతం నెగ్గిన రెజ్లర్ రవి దహియాకు జ్ఞాపికను అందజేస్తున్న అనురాగ్ ఠాకూర్, చిత్రంలో న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు పతకాలు సాధించే వరకు వారి ప్రయాణం చాలా గొప్పగా సాగింది. నవ భారతంలో వీరంతా నవతరం హీరోలు. ఆటగాళ్ల అద్భుత ప్రదర్శనపై జాతి యావత్తూ సంబరాలు చేసుకుంది. మన దేశంలో తూర్పు నుంచి పశ్చిమం వరకు, ఉత్తరం నుంచి దక్షిణం వరకు అందరినీ ఒక్కచోటికి చేర్చే శక్తి క్రీడలకు మాత్రమే ఉంది. క్రీడల్లో మన దేశం మరింత ఘనతలు సాధించేలా సహకారం అందిస్తాం’ అని ఠాకూర్ అన్నారు. ఒలింపిక్ చరిత్రలో భారత్ ఈసారి ఎక్కువ (7) పతకాలు గెలవడం తనకు చాలా సంతోషం కలిగించిందన్న మాజీ క్రీడా శాఖ మంత్రి, ప్రస్తుత న్యాయ శాఖ మంత్రి కిరణ్ రిజిజు... 2024 పారిస్ ఒలింపిక్స్‌లో మన దేశం మరింత బలమైన శక్తిగా ఎదుగుతుందని ఆకాంక్షించారు. టోక్యోలో రజత, కాంస్యాలు సాధించి కొద్ది రోజుల క్రితమే భారత్‌కు వచ్చేసిన మీరాబాయి చాను, పీవీ సింధు ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు. కేక్ కట్ చేస్తున్న భారత హాకీ జట్టు సభ్యులు విమానాశ్రయంలో రచ్చ... టోక్యో విజేతలకు సోమవారం ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. పెద్ద సంఖ్యలో అభిమానులు, వివిధ క్రీడా సంఘాల ప్రతినిధులు, ‘సాయ్’ ఉన్నతాధికారులు అక్కడకు చేరుకొని తమ ఆటగాళ్లకు ‘వెల్కమ్’ చెప్పారు. అయితే ఈ సందర్భంగా పరిస్థితి అంతా గందరగోళంగా మారిపోయింది. అభిమానులు, ఆటగాళ్ల సన్నిహితులతో విమానాశ్రయం నిండిపోవడంతో బాగా రచ్చ జరిగింది. త్రివర్ణ పతాకాలతో ఎయిర్పోర్ట్ వద్ద డప్పు, ఇతర వాయిద్యాలతో ఫ్యాన్స్ పెద్ద శబ్దాలు చేస్తూ హంగామా సృష్టించారు. సెల్ఫీల కోసం మీద పడిపోతున్న వారి నుంచి తప్పించుకొని బయటకు రావడానికి ఆటగాళ్లు బాగా ఇబ్బంది పడ్డారు. నీరజ్ పోలీస్ భద్రత మధ్య బయటకు రాగా... బజరంగ్ పూనియా, రవి దహియాలను అతని మిత్రులు భుజాలపై ఎత్తుకొని ఊరేగింపుగా తీసుకెళ్లారు. ఒలింపిక్ స్వర్ణం సాధించిన తర్వాత రోజు తీవ్రమైన ఒంటి నొప్పులతో బాధపడ్డాను. అయితే నా విజయం ముందు అది చాలా చిన్న విషయం. జావెలిన్ విసిరిన సమయంలో నేను నా వ్యక్తిగత అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చానని మాత్రమే అనుకున్నాను. అయితే త్రో ఇంకా చాలా దూరం వెళ్లింది. ఈ పతకం నా ఒక్కడిదే కాదు. భారతదేశ ప్రజలందరిది. ప్రత్యర్థి ఎంత బలమైనవాడైనా సరే మన అత్యుత్తమ ఆట ప్రదర్శించాలని, ప్రత్యర్థి గురించి భయపడవద్దని చెబుతా. అదే బంగారు పతకాన్ని తెచ్చి పెట్టింది. నాకూ పొడవాటి జుట్టు ఉంచడమే ఇష్టం. వేడి వల్ల చెమట పట్టి ఇబ్బంది కావడంతో జుట్టు తగ్గించుకున్నా. – సన్మాన కార్యక్రమంలో నీరజ్ చోప్రా -
ఇకపై యోగా కూడా ‘క్రీడ’
న్యూఢిల్లీ: భారత్‌లో ప్రాచీన చరిత్ర ఉన్న యోగాసనాలకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ తాజాగా గుర్తింపునిచ్చింది. ఇక నుంచి యోగాసనాలను అధికారికంగా పోటీ క్రీడగా పరిగణించనున్నట్లు గురువారం తెలిపింది. జాతీయ స్థాయి టోర్నీ ఖేలో ఇండియా క్రీడల్లోనూ యోగాసనాలను భాగం చేస్తామని క్రీడా మంత్రి కిరణ్ రిజిజు చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ‘జాతీయ వ్యక్తిగత యోగాసన క్రీడా పోటీల’ను పైలట్ చాంపియన్‌షిప్‌గా నిర్వహించే యోచనలో ఉన్నట్లు తెలిపారు. సంప్రదాయక, ఆర్టిస్టిక్, రిథమిక్, వ్యక్తిగత ఆల్‌రౌండ్ చాంపియన్‌షిప్, టీమ్ చాంపియన్‌షిప్ విభాగాల్లో పోటీలను నిర్వహిస్తామన్నారు. భారత జాతీయ యోగాసన క్రీడా సమాఖ్య (ఎన్‌వైఎస్‌ఎఫ్‌ఐ)కు ఆర్థికంగా దన్నుగా నిలుస్తామని స్పష్టం చేశారు. -
ఐఓఏపై క్రీడా శాఖ సస్పెన్షన్
కల్మాడీ, చౌతాలా నియామకంపై కేంద్రం సీరియస్ న్యూఢిల్లీ: భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ) జీవితకాల గౌరవ అధ్యక్షుడిగా సురేశ్ కల్మాడీ నియామక వ్యవహారం మరింతగా ముది రింది. ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునే వరకు ఐఓఏను తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్టు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఈ వ్యవహారంపై శుక్రవారం సాయంత్రం వరకు సమాధానమివ్వాల్సిందిగా షోకాజ్ నోటీసు జారీ చేసినా ఐఓఏ నుంచి స్పందన లేదు. దీంతో క్రీడా శాఖ కఠిన చర్యకు దిగింది. అయితే తమ అధ్యక్షుడు ఎన్.రామచంద్రన్ విదేశాలకు వెళ్లిన కారణంగా 15 రోజుల గడువివ్వాలని ఐఓఏ కోరింది. ఢిల్లీ 2010 కామన్వెల్త్ గేమ్స్ సందర్భంగా జరిగిన వేల కోట్ల అవకతవకల్లో ఆరోపణలు ఎదుర్కొంటున్న సురేశ్ కల్మాడీ, అభయ్ సింగ్ చౌతాలాలను ఇటీవల ఐఓఏ తమ జీవితకాల గౌరవ అధ్యక్షులుగా నియమించిన విషయం తెలిసిందే. ‘ఇలాంటి తప్పుడు చర్యలను ప్రభుత్వం ఆమోదించదు. షోకాజ్ నోటీసుకు సమాధానమివ్వకుండా మరింత గడువు కావాలంటున్నారు. అందుకే ఆ నియామకాలను ఉపసంహరించుకునే వరకు ఐఓఏను సస్పెండ్ చేస్తున్నాం. దీంతో ఐఓఏకు కేంద్రం నుంచి ఎలాంటి ఆర్థిక సహాయం, సౌకర్యాలు పొందడానికి లేదు. జాతి గౌరవం, ప్రజల మనోభావాలు ఈ అంశంలో ఇమిడి ఉన్నాయి. అయినా అటు నుంచి ఎలాంటి స్పందన కనిపించడం లేదు. ఇది పారదర్శక పాలనను అతిక్రమించడమే అవుతుంది. వెంటనే తమ తప్పును సరిదిద్దుకోవాలి. చార్జిషీట్ దాఖలైన వ్యక్తులను పదవుల్లోకి తీసుకుని తమ నియమావళినే అపహాస్యం చేసుకుంటున్నారు’ అని క్రీడా మంత్రి విజయ్ గోయెల్ అన్నారు. మరోవైపు ఇదే విషయంలో నిరసన వ్యక్తం చేస్తూ ఐఓఏ అనుబంధ ఉపాధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్టు అంతర్జాతీయ హాకీ సమాఖ్య అధ్యక్షుడు, హాకీ ఇండియా చైర్మన్ నరీందర్ బాత్రా ప్రకటించారు. -
యోగాకు క్రీడగా గుర్తింపు
న్యూఢిల్లీ : ప్రపంచవ్యాప్తంగా ఎంతోమందిని ఆకర్శిస్తున్న యోగాకు ఇక నుంచి క్రీడగా గుర్తింపునిస్తున్నట్టు కేంద్రం ప్రకటించింది. దీనికి ‘ప్రయారిటీ’ విభాగంలో చోటిచ్చింది. అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఫెన్సింగ్ ఆటగాళ్లు మెరుగైన ప్రదర్శన చేస్తుండడంతో ఈ క్రీడను ‘ఇతర’ క్రీడల విభాగం నుంచి ‘జనరల్’కు మార్చారు. అంతేకాకుండా ప్రయారిటీ కేటగిరీలో ఫెన్సిం గ్‌కు యూనివర్సల్ స్పోర్ట్స్ కింద చోటిచ్చారు. వివిధ క్రీడా విభాగాల వర్గీకరణను మంగళవారం కేంద్ర క్రీడా శాఖ సమీక్షించింది. దీంట్లో భాగంగా జనరల్ కేటగిరీలో ఉన్న క్రీడలన్నీ అదే విభాగంలో ఉంచుతున్నట్టు తెలిపింది. ఒలింపిక్స్, ఆసియా గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ తదితర మెగా ఈవెంట్స్ బరిలో ఉండే క్రీడలను జనరల్ కేటగిరీగా పరిగణించేందుకు క్రీడా శాఖ నిర్ణయించింది. -
ఫిజియో కోసం సైనాకు రూ. 9 లక్షలు
న్యూఢిల్లీ : ప్రత్యేక వ్యక్తిగత ఫిజియోథెరపిస్ట్‌ను నియమించుకునేందుకు భారత బ్యాడ్మింటన్ స్టార్ సైనా నెహ్వాల్‌కు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ మేరకు సైనాకు క్రీడా శాఖ రూ. 9 లక్షలను మంజూరు చేసింది. ఈ నెల నుంచి వచ్చే ఏడాది రియో ఒలింపిక్స్ ముగిసే వరకు సైనా ఫిజియోథెరపిస్ట్ సేవలను వినియోగించుకోవచ్చు. ఫిజియోగా ఎవరిని నియమించుకోవాలనే అంశాన్ని సైనాకే వదిలేసినట్టు క్రీడా శాఖ తెలిపింది. ప్రస్తుతం సైనా బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే బ్యాడ్మింటన్ అకాడమీలో శిక్షణ తీసుకుంటోంది. వచ్చే ఏడాది ఆగస్టులో జరిగే రియో ఒలింపిక్స్ వరకు సైనా బెంగళూరులోనే శిక్షణ కొనసాగిస్తుంది. -
‘పారదర్శకంగా ఉండాల్సిందే’
న్యూఢిల్లీ: దేశంలోని క్రీడా వ్యవస్థ పూర్తి పారదర్శకంగా ఉండేందుకు కేంద్ర క్రీడా శాఖ నడుం బిగించింది. భారత ఒలింపిక్ సంఘం (ఐఓఏ), జాతీయ క్రీడా సమాఖ్య (ఎన్ఎస్ఎఫ్)ల కార్యకలాపాలను, ఆర్థిక వ్యవహారాలను తప్పనిసరిగా ఆన్లైన్లో ఉంచాలని ఆదేశించింది. ఈ సూచనలు జాతీయ క్రీడా అభివృద్ధి కోడ్-2011లో భాగమేనని ఐఓఏ, ఎన్‌ఎస్‌ఎఫ్‌లకు రాసిన లేఖలో పేర్కొంది. ఏప్రిల్ 1వ తేదీలోగా అన్ని సమాఖ్యల వెబ్సైట్లలో వారి పూర్తి వివరాలు ఉంచాల్సిందేనని చెప్పింది. -
ఆసియా క్రీడలకు 516 మంది
క్రీడాకారులకు ప్రభుత్వ అనుమతి న్యూఢిల్లీ: ఆసియా క్రీడల్లో భారత్ తరఫున 516 మంది క్రీడాకారులు బరిలోకి దిగనున్నారు. ఈ మేరకు కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. వీరితో పాటు మరో 163 మంది కోచ్‌లు, సహాయక సిబ్బంది కలిపి మొత్తం 679 మంది సభ్యుల బృందం ఏషియాడ్‌కు వెళుతుంది. ఈ నెల 19 నుంచి అక్టోబర్ 4 వరకు దక్షిణ కొరియాలోని ఇంచియాన్‌లో ఆసియా క్రీడలు జరగనున్నాయి. ప్రాధమికంగా ప్రతిపాదించిన 942 మంది సభ్యుల బృందంలో 263 మందిని ప్రభుత్వం తప్పించింది. ఆ ఐదింటికీ అవకాశం... ఆసియా క్రీడలకు పంపాలంటే వ్యక్తిగత విభాగంలో టాప్-6లో, టీమ్ విభాగంలో అయితే టాప్-8లో ఉండాలని గతంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్) షరతు విధించింది. దాంతో ఫుట్‌బాల్, టేబుల్ టెన్నిస్, హ్యండ్‌బాల్, బాస్కెట్‌బాల్, సెపక్తక్రాలలో భారత్ పాల్గొనే అవకాశాలు దాదాపుగా లేకుండా పోయాయి. అయితే అలా చేస్తే భారీ జరిమానా విధిస్తామనే ఆసియా ఒలింపిక్ మండలి హెచ్చరికతో భారత్ పై క్రీడాంశాల్లోనూ జట్లను పంపాలని నిర్ణయించింది. 2010 గ్వాంగ్జూ ఆసియా క్రీడల్లో 35 క్రీడాంశాల్లో పోటీ పడిన భారత్ ఈ సారి 28 ఈవెంట్లకే పరిమితం కానుంది. అప్పటి భారత బృందం సంఖ్య (933)తో పోలిస్తే ఈ సారి చాలా తక్కువ మంది ఈ పోటీలకు హాజరవుతున్నారు.