న్యూఢిల్లీ: కొన్నేళ్లుగా అంతర్జాతీయస్థాయిలో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ డబుల్స్ స్టార్స్ సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టిలకు దేశ అత్యున్నత క్రీడా పురస్కారం ‘ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న’ లభించింది. 2023 సంవత్సరానికిగాను కేంద్ర క్రీడా మంత్రిత్వ శాఖ బుధవారం జాతీయ క్రీడా పురస్కారాలను ప్రకటించింది. ఉత్తమ క్రీడాకారులకు ఇచ్చే ‘అర్జున’ అవార్డు 26 మందిని వరించింది. ఉత్తమ కోచ్‌లకు అందించే ‘ద్రోణాచార్య’ అవార్డును రెగ్యులర్ విభాగంలో ఐదుగురికి... లైఫ్‌టైమ్ విభాగంలో ముగ్గురికి ప్రకటించారు.
ఈసారి తెలుగు రాష్ట్రాల నుంచి నలుగురికి క్రీడా పురస్కారాలు దక్కాయి. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన 23 ఏళ్ల రంకిరెడ్డి సాత్విక్ సాయిరాజ్ ‘ఖేల్ రత్న’ అందుకోనుండగా... ఆంధ్రప్రదేశ్‌కే చెందిన అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్) ‘అర్జున’ పురస్కారం పొందాడు. తెలంగాణకు చెందిన బాక్సర్ హుసాముద్దీన్, మహిళా షూటర్ ఇషా సింగ్‌లకు కూడా ‘అర్జున’ అవార్డు దక్కింది. జనవరి 9న రాష్ట్రపతి భవన్‌లో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈ పురస్కారాలు అందజేస్తారు.
♦ ‘ఖేల్ రత్న’ అవార్డీలకు మెడల్, ప్రశంస పత్రంతోపాటు రూ. 25 లక్షలు... ‘అర్జున’ విజేతలకు రూ. 15 లక్షలు... ‘ద్రోణాచార్య’ అవార్డీలకు రూ. 15 లక్షలు... ధ్యాన్‌చంద్ లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డీలకు రూ. 10 లక్షల చొప్పున నగదు పురస్కారం లభిస్తుంది.
♦గుంటూరు జిల్లా మాచర్లకు చెందిన 33 ఏళ్ల అజయ్ 2010 నుంచి భారత అంధుల క్రికెట్ జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. 2016లో టీమిండియాకు కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. అజయ్ సారథ్యంలోనే భారత్ 2017 టి20 వరల్డ్ కప్, 2018 వన్డే వరల్డ్‌కప్, 2022 టి20 వరల్డ్‌కప్ టైటిల్స్ గెలిచింది.
♦ నిజామాబాద్ జిల్లాకు చెందిన 29 ఏళ్ల హుసాముద్దీన్ ఈ ఏడాది తాషె్కంట్‌లో జరిగిన ప్రపంచ చాంపియన్‌షి ప్‌లో కాంస్య పతకం గెలిచాడు. ఇండియన్ ఆర్మీలో సుబేదార్‌గా విధులు నిర్వ హిస్తున్న హుసాముద్దీన్ 2022 ఆసియా చాంపియన్‌షి ప్‌లో... 2018, 2022 కామన్వెల్త్ గేమ్స్‌లో కాంస్య పతకాలు నెగ్గాడు.
♦ హైదరాబాద్‌కు చెందిన 18 ఏళ్ల పిస్టల్ షూటర్ ఇషా సింగ్ ఈ ఏడాది అజర్‌బైజాన్‌లో జరిగిన ప్రపంచ షూటింగ్ చాంపియన్‌షి ప్‌లో 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ మిక్స్‌డ్ టీమ్ ఈవెంట్‌లో, 25 మీటర్ల పిస్టల్ టీమ్ ఈవెంట్‌లో స్వర్ణ పతకాలు గెలిచింది. హాంగ్జౌ ఆసియా క్రీడల్లో ఒక స్వర్ణం, మూడు రజత పతకాలు నెగ్గింది. గత ఏడాది జరిగిన ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో మూడు స్వర్ణాలు, ఒక కాంస్యం సాధించింది.
నిలకడగా...
మహారాష్ట్రకు చెందిన 26 ఏళ్ల చిరాగ్ శెట్టితో కలిసి సాత్విక్ సాయిరాజ్ గత ఐదేళ్లలో పలు అంతర్జాతీయ టోర్నీల్లో అద్భుత ప్రదర్శన చేశాడు. ఈ ఏడాది మొత్తం సాత్విక్–చిరాగ్ జోడీ సూపర్ ఫామ్‌లో ఉంది. దుబాయ్ వేదికగా జరిగిన ఆసియా చాంపియన్‌షి ప్‌లో... చైనాలోని హాంగ్జౌ నగరంలో జరిగిన ఆసియా క్రీడల్లోనూ ఈ జంట స్వర్ణ పతకాలు సాధించింది. స్విస్ ఓపెన్ సూపర్–300, ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీల్లోనూ విజేతగా నిలిచింది.
చైనా మాస్టర్స్ ఓపెన్ సూపర్–750 టోర్నీలో రన్నరప్ ట్రోఫీ దక్కించుకుంది. దాంతోపాటు డబుల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచి కొత్త చరిత్ర సృష్టించింది. ఇక 2022లో జరిగిన ప్రతిష్టాత్మక థామస్ కప్ టోర్నీలో తొలిసారి భారత్ విజేతగా నిలువడంలో సాత్విక్–చిరాగ్ శెట్టి కీలకపాత్ర పోషించారు. 2022 బర్మింగ్‌హామ్ కామన్వెల్త్ గేమ్స్‌లో సాత్విక్–చిరాగ్ ద్వయం పసిడి పతకాన్ని దక్కించుకుంది.
అంతేకాకుండా ఇండియా ఓపెన్ సూపర్–500, ఫ్రెంచ్ ఓపెన్ సూపర్–750 టోర్నీల్లోనూ టైటిల్స్ కైవసం చేసుకుంది. 2018లో హైదరాబాద్ ఓపెన్, 2019లో థాయ్‌లాండ్ ఓపెన్ టోర్నీల్లోనూ సాత్విక్–చిరాగ్ జంట విజేతగా నిలిచింది. 2018 గోల్డ్‌కోస్ట్ కామన్వెల్త్ గేమ్స్‌లో భారత జట్టుకు మిక్స్‌డ్ టీమ్‌లో స్వర్ణం రావడానికి సాత్విక్–చిరాగ్ ముఖ్యపాత్ర పోషించారు.
అవార్డు గ్రహీతలు...
‘ఖేల్ రత్న’ (2): సాత్విక్ సాయిరాజ్, చిరాగ్ శెట్టి (బ్యాడ్మింటన్).
అర్జున అవార్డీలు (26): ఒజస్ ప్రవీణ్ దేవ్‌తలే, అదితి స్వామి (ఆర్చరీ), శ్రీశంకర్, పారుల్ చౌధరీ (అథ్లెటిక్స్), హుసాముద్దీన్ (బాక్సింగ్), వైశాలి (చెస్), షమీ (క్రికెట్), అనూష్ అగర్వల్లా, దివ్యాకృతి సింగ్ ( ఈక్విస్ట్రి యన్), దీక్షా డాగర్ (గోల్ఫ్), క్రిషన్ బహదూర్ పాఠక్, సుశీలా చాను (హాకీ), పవన్ కుమార్, రీతూ నేగి (కబడ్డీ), నస్రీన్ (ఖో–ఖో), పింకీ (లాన్ బాల్స్), ఐశ్వరీ ప్రతాప్ సింగ్ తోమర్, ఇషా సింగ్ (షూటింగ్), హరీందర్ పాల్ (స్క్వాష్), అహిక ముఖర్జీ (టేబుల్ టెన్నిస్), సునీల్, అంతిమ్ పంఘాల్ (రెజ్లింగ్), రోషిబీనా (వుషు), అజయ్ కుమార్ రెడ్డి (అంధుల క్రికెట్), ప్రాచీ యాదవ్ (పారా కనోయింగ్).
ద్రోణాచార్య అవార్డీలు (రెగ్యులర్ కేటగిరీ–5): లలిత్ కుమార్ (రెజ్లింగ్), ఆర్‌బీ రమేశ్ (చెస్), మహావీర్ ప్రసాద్ (పారా అథ్లెటిక్స్), శివేంద్ర సింగ్ (హాకీ), గణేశ్ ప్రభాకర్ (మల్లఖంబ్).
ద్రోణాచర్య అవార్డీలు (లైఫ్‌టైమ్–3): జస్కీరత్ సింగ్ గ్రెవాల్ (గోల్ఫ్), భాస్కరన్ (కబడ్డీ), జయంత కుమార్ (టేబుల్ టెన్నిస్).
ధ్యాన్‌చంద్ అవార్డీలు (లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్–3): మంజూషా కన్వర్ (బ్యాడ్మింటన్), వినీత్ శర్మ (హాకీ), కవితా సెల్వరాజ్ (కబడ్డీ).
మౌలానా అబుల్ కలామ్ ఆజాద్ ట్రోఫీ (అత్యుత్తమ యూనివర్సిటీలు–3): 1. గురునానక్ దేవ్ యూనివర్సిటీ (అమృత్‌సర్), 2. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (పంజాబ్), 3. కురుక్షేత్ర యూనివర్సిటీ (కురుక్షేత్ర, హరియాణా).
Comments
Please login to add a commentAdd a comment