న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ – సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్ చాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ – సియో సంగ్ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్‌పై విజయం సాధించింది.
65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్‌కు ముందు 4–1తో సాతి్వక్–చిరాగ్‌లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు.
ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్ పోటాపోటీగా సాగింది. గేమ్ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్‌తో, అనంతరం చిరాగ్ నెట్‌కు కొట్టిన షాట్‌తో కొరియా విజయం ఖాయమైంది.
తైజుకు మహిళల టైటిల్
వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ తై జు 21–16, 21–12తో రెండో సీడ్ చెన్ యు ఫిపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment