BWF
-
సింధు సత్తాకు సవాల్!
కౌలాలంపూర్: ఒలింపిక్స్ చరిత్రలో గతంలో ఏ భారతీయ ప్లేయర్‌కు సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకోవాలంటే... భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు తన కెరీర్లోనే అత్యుత్తమ ప్రదర్శన ఇవ్వాల్సి ఉంటుంది. పారిస్ ఒలింపిక్స్ బ్యాడ్మింటన్ ఈవెంట్ ‘డ్రా’ వివరాలను శుక్రవారం ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) విడుదల చేసింది. 2016 రియో ఒలింపిక్స్‌లో రజతం, 2020 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్యం నెగ్గిన సింధు ‘పారిస్’లోనూ పతకం గెలిస్తే... భారత్ నుంచి ఒలింపిక్స్ చరిత్రలో మూడు వ్యక్తిగత పతకాలు నెగ్గిన ఏకైక ప్లేయర్‌గా రికార్డు సృష్టిస్తుంది. ‘డ్రా’ ప్రకారం సింధుకు గ్రూప్ దశలో సునాయాస ప్రత్యర్థులు ఎదురుకానున్నారు. గ్రూప్ ‘ఎం’లో ఉన్న సింధు ప్రపంచ 75వ ర్యాంకర్ క్రిస్టిన్ కుబా (ఎస్తోనియా)తో, ప్రపంచ 111వ ర్యాంకర్ ఫాతిమత్ నభా (మాల్దీవులు)తో ఆడుతుంది. గ్రూప్ విజేత హోదాలో సింధు ప్రిక్వార్టర్ చేరితే ఆరో సీడ్ హి బింగ్జియావో (చైనా)తో తలపడుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 9–11తో వెనుకంజలో ఉంది. హి బింగ్జియావోపై నెగ్గితే సింధుకు క్వార్టర్ ఫైనల్లో డిఫెండింగ్ ఒలింపిక్ చాంపియన్, ప్రపంచ రెండో ర్యాంకర్ చెన్ యు ఫె (చైనా) ఎదురవుతుంది. ముఖాముఖి రికార్డులో సింధు 6–6తో సమంగా ఉంది. చెన్ యు ఫెను కూడా ఓడిస్తే సింధుకు సెమీఫైనల్లో రియో ఒలింపిక్స్ విజేత, మూడుసార్లు వరల్డ్ చాంపియన్ కరోలినా మారిన్ (స్పెయిన్) సిద్ధంగా ఉండే అవకాశముంది. ముఖాముఖి రికార్డులో సింధు 5–12తో వెనుకంజలో ఉంది. ఒకవేళ మారిన్‌పై ఈసారి సింధు గెలిస్తే పతకం ఖరారవుతుంది. మారిన్ చేతిలో సింధు ఓడిపోతే కాంస్య పతకం కోసం రేసులో నిలుస్తుంది. కాంస్య పతకం కోసం మరో పార్శ్వంలో ఉన్న వరల్డ్ నంబర్‌వన్ అన్ సె యంగ్ (దక్షిణ కొరియా), ప్రపంచ మూడో ర్యాంకర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ), ప్రపంచ ఐదో ర్యాంకర్ అకానె యామగుచి (జపాన్)లలో ఒకరితో సింధు ఆడే చాన్స్ ఉంటుంది. పురుషుల సింగిల్స్‌లో భారత్ నుంచి ప్రణయ్, లక్ష్య సేన్ బరిలో ఉన్నారు. గ్రూప్ ‘కె’లో ప్రణయ్... గ్రూప్ ‘ఎల్’లో లక్ష్య సేన్ ఉన్నారు. లక్ష్య సేన్ గ్రూప్‌లోనే ఈ ఏడాది ఆసియా చాంపియన్, ఆల్ ఇంగ్లండ్ చాంపియన్, ప్రపంచ 3వ ర్యాంకర్ జొనాథన్ క్రిస్టీ (ఇండోనేసియా) ఉన్నాడు. ప్రిక్వార్టర్ ఫైనల్ చేరాలంటే లక్ష్య సేన్ తప్పనిసరిగా క్రిస్టీపై గెలవాల్సి ఉంటుంది. స్థాయికి తగ్గట్టు ఆడితే గ్రూప్ ‘కె’ నుంచి ప్రణయ్ ప్రిక్వార్టర్ ఫైనల్ చేరుకుంటాడు. ‘డ్రా’ ప్రకారం ప్రిక్వార్టర్ ఫైనల్లో ప్రణయ్, లక్ష్య సేన్ ముఖాముఖిగా తలపడే అవకాశముంది. ఈ నేపథ్యంలో ఇద్దరు భారత ఆటగాళ్లలో ఒకరికి మాత్రమే పతకం నెగ్గే అవకాశం ఉంటుంది. మహిళల డబుల్స్‌లో నాలుగు జోడీలు ఉన్న గ్రూప్ ‘సి’లో అశ్విని పొన్నప్ప–తనీషాలకు చోటు లభించింది. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే భారత జోడీ రెండు మ్యాచ్‌ల్లో గెలవాలి.మరోవైపు పురుషుల డబుల్స్ ‘డ్రా’లో ఎన్ని జోడీలు ఉండాలనే విషయంపై కోర్టు ఆఫ్ ఆర్బిట్రేషన్‌లో కేసు నడుస్తున్న నేపథ్యంలో ఈ విభాగం ‘డ్రా’ను ప్రకటించలేదు. ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉండటంతో భారత స్టార్ ద్వయం సాతి్వక్ సాయిరాజ్ –చిరాగ్ శెట్టిపై భారీ అంచనాలు ఉన్నాయి. పారిస్ ఒలింపిక్స్ ఈనెల 26 నుంచి జరగనుండగా... బ్యాడ్మింటన్ ఈవెంట్ 27న మొదలవుతుంది. -
Malaysia Masters 2024: ఫైనల్లో పీవీ సింధు
కౌలాలంపూర్: భారత టాప్ షట్లర్ పూసర్ల వెంకట సింధు ఈ ఏడాది తన తొలి టైటిల్ సాధించేందుకు అడుగు దూరంలో నిలిచింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్–500 టోర్నీ మలేసియా మాస్టర్స్‌లో సింధు ఫైనల్లోకి ప్రవేశించింది. శనివారం హోరాహోరీగా సాగిన సెమీ ఫైనల్లో సింధు 13–21, 21–16, 21–12 స్కోరుతో బుసానన్ ఆంగ్బమ్రున్పన్ (థాయిలాండ్)పై విజయం సాధించింది. తన కెరీర్లో ఐదేళ్ల క్రితం ఒకే ఒక సారి బుసానన్ చేతిలో ఓడిన సింధుకు ఇది ఆమెపై 18వ గెలుపు కావడం విశేషం. వరల్డ్ నంబర్ 20 బుసానన్ తొలి గేమ్‌లో ఆధిక్యం ప్రదర్శించి ముందంజ వేసింది. అయితే వెంటనే కోలుకున్న సింధు ర్యాలీలతో చెలరేగి గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్‌లో సింధు తన స్థాయిలో సత్తా చాటింది. 8–3తో ఆధిక్యంలోకి వెళ్లిన తర్వాత ఆమెకు తిరుగులేకుండా పోయింది. అదే జోరును కొనసాగిస్తూ 17–10తో దూసుకుపోయిన సింధు వరుస పాయింట్లతో మ్యాచ్‌ను సొంతం చేసుకుంది. నేడు జరిగే ఫైనల్లో వరల్డ్ నంబర్ 7 వాంగ్ జి యీ (చైనా)తో సింధు తలపడుతుంది. -
మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌లో సాత్విక్ –చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పురుషుల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో భారత్‌కు చెందిన సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ద్వయం మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌ను సొంతం చేసుకుంది. మంగళవారం విడుదల చేసిన తాజా ర్యాంకింగ్స్‌లో సాత్విక్–చిరాగ్ జోడీ ఒక స్థానం మెరుగుపర్చుకొని 95,861 పాయింట్లతో టాప్ ర్యాంక్‌కు ఎగబాకింది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్ ... మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ శెట్టి ఈ ఏడాది జరిగిన రెండు ప్రధాన టోరీ్నల్లోనూ (మలేసియా ఓపెన్–1000, ఇండియా ఓపెన్–750) అద్భుత ప్రతిభ కనబరిచి రన్నరప్‌గా నిలిచారు. గత ఏడాది అక్టోబర్‌లో ఆసియా క్రీడల్లో స్వర్ణ పతకం సాధించాక సాత్విక్ –చిరాగ్ తొలిసారి వరల్డ్ నంబర్‌వన్‌గా అవతరించింది. పురుషుల సింగిల్స్ ర్యాంకింగ్స్‌లో ప్రణయ్ ఒక స్థానం పురోగతి సాధించి ఎనిమిదో ర్యాంక్‌లో నిలిచాడు. -
సాత్విక్ – చిరాగ్ జోడీకి నిరాశ
న్యూఢిల్లీ: సొంతగడ్డపై జరిగిన ప్రతిష్టాత్మక టోర్నీలో భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్‌శెట్టిలకు చుక్కెదురైంది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ – సూపర్ 750 టోర్నీ ఇండియా ఓపెన్‌లో భారత జోడి రన్నరప్‌గా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో కొరియాకు చెందిన వరల్డ్ చాంపియన్ జంట కాంగ్ మిన్ హ్యూక్ – సియో సంగ్ జె 15–21, 21–11, 21–18 స్కోరుతో సాత్విక్ – చిరాగ్‌పై విజయం సాధించింది. 65 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను సునాయాసంగానే గెలుచుకున్న భారత జోడి ఆ తర్వాత తడబడింది. ముఖాముఖీ పోరులో కొరియా ఆటగాళ్లతో ఈ మ్యాచ్‌కు ముందు 4–1తో సాతి్వక్–చిరాగ్లదే పైచేయిగా ఉంది. అదే తరహాలో చక్కటి ర్యాలీలతో దూసుకుపోయిన వీరిద్దరు తొలి గేమ్‌ను సొంతం చేసుకున్నారు. రెండో గేమ్‌లో 1–5తో ఆరంభంలో వెనుకబడిన మన ఆటగాళ్లు ఆ తర్వాత కోలుకోలేకపోయారు. ఒక దశలో వరుసగా తొమ్మిది పాయింట్లు సాధించిన కొరియా టీమ్ 15–5తో ముందంజలో నిలిచి ఆపై గేమ్‌ను గెలుచుకుంది. మూడో గేమ్ పోటాపోటీగా సాగింది. గేమ్ తొలి అర్ధభాగాన్ని కొరియా ఆటగాళ్లు 11–6తో ముగించారు. అయితే ఆ తర్వాత భారత ద్వయం కోలుకొని మళ్లీ నిలిచారు. 15–16కు, ఆపై 18–19 వరకు స్కోరు వెళ్లింది. అయితే సాత్విక్ బయటకు కొట్టిన షాట్‌తో, అనంతరం చిరాగ్ నెట్‌కు కొట్టిన షాట్‌తో కొరియా విజయం ఖాయమైంది. తైజుకు మహిళల టైటిల్ వరల్డ్ నంబర్ 3 ప్లేయర్ తై జు యింగ్ (చైనీస్ తైపీ) మహిళల సింగిల్స్ టైటిల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్లో నాలుగో సీడ్ తై జు 21–16, 21–12తో రెండో సీడ్ చెన్ యు ఫిపై విజయం సాధించింది. పురుషుల సింగిల్స్ టైటిల్‌ను షి యు కి (చైనా) సొంతం చేసుకున్నాడు. -
అశ్విని –తనీషా జోడీ ర్యాంక్‌లో పురోగతి
ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) మహిళల డబుల్స్ ర్యాంకింగ్స్‌లో అశ్విని పొన్నప్ప–తనీషా క్రాస్టో (భారత్) జోడీ పురోగతి సాధించింది. తాజా ర్యాంకింగ్స్‌లో అశ్విని –తనీషా ద్వయం నాలుగు స్థానాలు మెరుగుపర్చుకొని 28వ ర్యాంక్‌కు చేరుకుంది. గతవారం లక్నోలో జరిగిన సయ్యద్ మోడి ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టో ర్నీలో అశ్విని –తనీషా జోడీ రన్నరప్‌గా నిలిచింది. -
బీడబ్ల్యూఎఫ్ వార్షిక అవార్డు రేసులో సాత్విక్–చిరాగ్ జోడీ
న్యూఢిల్లీ: ఈ సీజన్లో నిలకడగా రాణిస్తున్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) వార్షిక అవార్డు రేసులో నిలిచారు. 2023 సంవత్సరానికిగాను సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టిని ‘పెయిర్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం కోసం బీడబ్ల్యూఎఫ్ నామినేట్ చేసింది. భారత ద్వయంతోపాటు చెన్ కింగ్ చెన్–జియా ఇ ఫాన్ (చైనా), జెంగ్ సి వె–హువాంగ్ యా కియాంగ్ (చైనా), సియో సెంగ్ జే–చె యు జంగ్ (దక్షిణ కొరియా) జోడీలు కూడా ఈ అవార్డు కోసం బరిలో ఉన్నాయి. డిసెంబర్ 11న అవార్డు విజేతను ప్రకటిస్తారు. ఈ ఏడాది సాత్విక్–చిరాగ్ ద్వయం అంచనాలకు మించి రాణించి అద్భుత విజయాలు సాధించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో స్వర్ణం, ఆసియా క్రీడల్లో స్వర్ణం సాధించిన సాత్విక్–చిరాగ్ ద్వయం ఇండోనేసియా సూపర్–1000 టోర్నీలో, కొరియా ఓపెన్ సూపర్–500 టోర్నీలో, స్విస్ ఓపెన్ సూపర్–300 టోర్నీలో డబుల్స్ టైటిల్స్ గెలిచింది. -
మళ్లీ మరీన్ చేతిలో...
ఒడెన్స్: పీవీ సింధు, కరోలినా మరీన్ మధ్య మంచి స్నేహం ఉంది. కోర్టులో ప్రత్యర్థులే అయినా కోర్టు బయట తమ సాన్నిహిత్యం గురించి వీరిద్దరు చాలా సార్లు చెప్పుకున్నారు. కానీ శనివారం ఇద్దరి మధ్య జరిగిన హోరాహోరీ పోరు అనూహ్య రీతిలో సాగింది. ఒక దశలో ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. ప్రత్యర్థిపై పైచేయి సాధించే క్రమంలో అరుపులు, కేకలతో పాటు పలు మార్లు ఇద్దరూ అంపైర్ల హెచ్చరికకు కూడా గురయ్యారు. అయితే చివరకు 73 నిమిషాల సమరం తర్వాత భారత షట్లర్ పరాజయం పక్షానే నిలిచింది. ఈ మ్యాచ్‌కు ముందు ముఖాముఖీ రికార్డులో సింధు 5–10తో వెనుకబడి ఉండగా, ఇప్పుడు అది 5–11కు చేరింది. బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ సూపర్–750 టోర్నీ డెన్మార్క్ ఓపెన్ సెమీ ఫైనల్లో సింధు ఓటమిపాలైంది. కరోలినా మరీన్ (స్పెయిన్) 21–18, 19–21, 21–7 స్కోరుతో సింధుపై విజయం సాధించింది. ఇద్దరు ప్లేయర్లు తమదైన శైలిలో చెలరేగడంతో తొలి గేమ్ దాదాపు సమంగా సాగింది. విరామ సమయంలో సింధు 11–10తో ఒక పాయింట్ ముందంజలో ఉంది. ఆ తర్వాతా ఇదే కొనసాగి స్కోరు 18–18కి చేరింది. అయితే మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలుచుకొని గేమ్‌ను తన ఖాతాలో వేసుకుంది. రెండో గేమ్‌లో మాత్రం సింధు దూసుకుపోయింది. చకచకా పాయింట్లు సాధించిన ఆమె ఎక్కడా ఆధిక్యం తగ్గనీయకుండా 11–3కు చేరింది. అయితే ఆ తర్వాత ప్రతిఘటించిన మరీన్ వరుసగా పాయింట్లు గెలుచుకొని అంతరాన్ని తగ్గించింది. సింధు 20–16తో ముందంజలో నిలిచిన తర్వాత మరీన్ వరుసగా మూడు పాయింట్లు గెలవడంతో 20–19గా మారింది. కానీ స్మాష్‌తో పాయింట్ సాధించి సింధు గేమ్ గెలుచుకుంది. చివరి గేమ్ మాత్రం పూర్తి ఏకపక్షంగా మారిపోయింది. మరీన్ జోరు ముందు భారత షట్లర్ నిలవలేకపోయింది. ముందు 3–0, ఆపై 3–2...ఆ తర్వాత ఆమె జోరు సాగిపోయింది. వరుసగా 11 పాయింట్లు సాధించిన మరీన్ 14–2 దాకా వెళ్లింది. అనంతరం మ్యాచ్‌ను ముగించేందుకు ఆమెకు ఎక్కువ సమయం పట్టలేదు. మరీన్ అరుపులు... సింధు అసహనం పాయింట్లు సాధించినప్పుడు అతిగా భావోద్వేగాలు ప్రదర్శించవద్దని అంపైర్ ఇద్దరినీ పిలిచి మ్యాచ్‌లో పలు మార్లు వారించాడు. అయితే మరీన్ తన అరుపులను ఆపకపోగా, సర్వీస్ అందుకునేందుకు సింధు ఎక్కువ సమయం తీసుకుంది. తొలి గేమ్‌ను మరీన్ను మళ్లీ అంపైర్ హెచ్చరించాడు. మూడో గేమ్‌లో సర్వీస్ ఆలస్యానికి సింధును అంపైర్ ప్రశ్నించగా...‘ఆమె అరిచేందుకు అవకాశమిచ్చారు కదా. ముందు ఆమెను ఆపమని చెబితే నేనూ సిద్ధంగా ఉంటా’ అని సింధు బదులిచ్చింది. మరొకరి కోర్టునుంచి షటిల్ తీసుకోవద్దని ఇద్దరికీ చెప్పాల్సి వచ్చింది. చివరకు అంపైర్ ఇద్దరికీ ‘ఎల్లో కార్డు’లు కూడా చూపించాల్సి వచ్చింది. -
ప్రపంచ నంబర్‌వన్ జోడీగా సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి
న్యూఢిల్లీ: ఈ ఏడాది అద్భుతమైన ఫామ్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ పురుషుల డబుల్స్ జోడీ సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి మరో ఘనత సాధించింది. ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) ర్యాంకింగ్స్‌లో పురుషుల డబుల్స్‌లో నంబర్‌వన్ ర్యాంక్‌కు చేరుకున్న తొలి భారతీయ జోడీగా చరిత్ర సృష్టించింది. మంగళవారం విడుదల చేసిన బీడబ్ల్యూఎఫ్ ర్యాంకింగ్స్‌లో సాత్వి క్–చిరాగ్ ద్వయం 92,411 పాయింట్లతో అగ్రస్థానాన్ని అలంకరించింది. గతవారం హాంగ్జౌలో ముగిసిన ఆసియా క్రీడల్లోసాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జోడీ స్వర్ణ పతకం సాధించింది. దాంతో ఈ జంట ఒక స్థానం పురోగతి సాధించి రెండు నుంచి టాప్ ర్యాంక్‌కు చేరుకుంది. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాత్విక్, మహారాష్ట్ర ప్లేయర్ చిరాగ్ ఈ సీజన్లో స్విస్ ఓపెన్, ఆసియా చాంపియన్íÙప్లో, ఇండోనేసియా ఓపెన్, కొరియా ఓపెన్లలో విజేతగా నిలిచారు. గతంలో భారత్ నుంచి పురుషుల సింగిల్స్ విభాగంలో ప్రకాశ్ పదుకొనే (1980లో), శ్రీకాంత్ (2018లో), మహిళల సింగిల్స్‌లో సైనా నెహా్వల్ (2021లో) ప్రపంచ నంబర్‌వన్ ర్యాంక్‌లో నిలిచారు. -
Japan Open 2023 badminton: పోరాడి ఓడిన లక్ష్యసేన్
టోక్యో: బీడబ్ల్యూఎఫ్ టూర్ సూపర్–750 జపాన్ ఓపెన్ బ్యాడ్మింటన్‌లో భారత షట్లర్ లక్ష్య సేన్ ఆట ముగిసింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో లక్ష్య పోరాడి ఓడాడు. ఈ మ్యాచ్‌లో ఇండోనేసియాకు చెందిన ఐదో సీడ్ జొనాథన్ క్రిస్టీ 21–15, 13–21, 21–16 స్కోరుతో సేన్‌ను ఓడించాడు. 68 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన ఈ పోరు తొలి గేమ్‌లో క్రిస్టీ చేసిన పొరపాట్లతో సేన్ 7–4తో ముందంజ వేశాడు. ఆ తర్వాత ఒక్కసారిగా చెలరేగిన క్రిస్టీ 15–12తో ఆధిక్యంలోకి వచ్చేశాడు. రెండో గేమ్‌లో చక్కటి సర్వీస్, ర్యాలీలతో 11–5తో సేన్ ముందంజ వేశాడు. ఆపై పదునైన స్మాష్‌లతో చెలరేగి భారత షట్లర్ రెండో గేమ్‌ను సొంతం చేసుకున్నాడు. చివరి గేమ్‌లో మాత్రం మొదటినుంచి ఆధిక్యం ప్రదర్శించిన క్రిస్టీ చివరి వరకు దానిని నిలబెట్టుకున్నాడు. -
ఫైనల్లో సాత్విక్ – చిరాగ్
బాసెల్: భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ద్వయం సాత్విక్ సాయిరాజ్ – చిరాగ్ శెట్టి మరోసారి మేజర్ టోర్నీలో సత్తా చాటింది. బీడబ్ల్యూఎఫ్ సూపర్ సిరీస్–300 టోర్నీ స్విస్ ఓపెన్‌లో సాత్విక్ – చిరాగ్ ఫైనల్లోకి ప్రవేశించారు. ఈ టోర్నీలో ఈ జంట మినహా ఇతర భారత షట్లర్లంతా ముందే నిష్క్రమించగా...వీరిద్దరు మాత్రం తమపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ ముందుకు సాగారు. హోరాహోరీగా సాగిన సెమీఫైనల్లో రెండో సీడ్ సాత్విక్ – చిరాగ్ ద్వయం 19–21, 21–17, 17–21తో మూడో సీడ్ మలేసియా జోడి ఆంగ్ యూ సిన్ – టియో ఈ యీపై విజయం సాధించింది. 69 నిమిషాల పాటు సాగిన ఈ పోరులో తొలి గేమ్‌ను కోల్పోయినా...తర్వాతి రెండు గేమ్‌లలో సత్తా చాటి భారత జంట విజయాన్ని అందుకుంది. నేడు జరిగే ఫైనల్లో చైనాకు చెందిన అన్‌సీడెడ్ జంట రెన్ జియాంగ్ యు – టాన్ ఖియాంగ్‌తో సాత్విక్ – చిరాగ్ తలపడతారు. -
సత్తా చాటిన ముత్తు
శాంటండెర్ (స్పెయిన్): భారత రైజింగ్ షట్లర్ శంకర్ ముత్తుసామి జూనియర్ ప్రపంచ చాంపియన్‌షిప్‌లో పతకాన్ని ఖాయం చేసుకున్నాడు. ఈ టోర్నీలో నాలుగో సీడ్‌గా బరిలోకి దిగిన అతను పురుషుల అండర్–19 సింగిల్స్‌లో సెమీ ఫైనల్లోకి ప్రవేశించాడు. దీంతో ఈ భారత ఆటగాడికి కనీసం కాంస్యమైనా దక్కుతుంది. శుక్రవారం జరిగిన క్వార్టర్ ఫైనల్లో ముత్తుసామి 21–18, 8–21, 21–16తో హు జె అన్ (చైనా)ను కంగుతినిపించాడు. ఒక గంటా 31 నిమిషాల పాటు జరిగిన ఈ పోరులో భారత టీనేజ్ షట్లర్‌కు చైనా ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ ఎదురైంది. తొలి గేమ్‌ను గెలిచేందుకు చెమటోడ్చిన శంకర్‌కు రెండో గేమ్‌లో నిరాశ తప్పలేదు. అయితే నిర్ణాయక మూడో గేమ్‌ను గెలిచి ముందంజ వేశాడు. శనివారం జరిగే సెమీఫైనల్లో భారత షట్లర్ థాయ్‌లాండ్‌కు చెందిన పనిత్చఫొన్ తీరరత్సకుల్తో తలపడతాడు. జూనియర్ ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో పతకం దక్కించుకున్న 9వ భారత ఆటగాడు ముత్తుసామి. లక్ష్యసేన్ 2018లో చివరిసారిగా భారత్‌కు పతకం (కాంస్యం) అందించాడు. -
ప్రపంచ చాంపియన్‌షిప్‌పై కసరత్తు
న్యూఢిల్లీ: జపాన్‌లాంటి కోర్టుల్లో ఆడాలంటే చాలా ఓపిక కావాలని భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్.ప్రణయ్ అన్నాడు. త్వరలో అక్కడ జరగనున్న బీడబ్ల్యూఎఫ్ ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం కసరత్తు చేస్తున్నానని చెప్పాడు. ‘నేను రెండు వారాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను. ఎప్పట్లా రొటిన్‌గానే సన్నద్ధమవుతున్నా. నా ప్రాక్టీస్‌లో తేడా ఏమీ లేదు. కానీ టోక్యోలోని బ్యాడ్మింటన్ కోర్టులు మందకొడిగా ఉంటాయి. అక్కడ ఆడాలంటే నేర్పుంటే చాలదు. చాలా ఓర్పు కావాలి. అందుకే నేను ఆటతీరులో సహనం, సంయమనంపై దృష్టిపెట్టాను’ అని అన్నాడు. ఈ నెల 22 నుంచి టోక్యోలో ప్రపంచ చాంపియన్‌షిప్ పోటీలు జరుగనున్నాయి. స్పెయిన్‌లో జరిగిన గత మెగా ఈవెంట్లో ప్రణయ్ క్వార్టర్ ఫైనల్స్ చేరాడు. ఈ సీజన్లో నిలకడగా ఆడుతున్న అతను ర్యాంకు మెరుగుపర్చుకునే పనిలో పడ్డాడు. ‘ర్యాంకుల్లో ఎగబాకడం ఇప్పుడు అంత సులభం కాదు. ఒక్క రేటింగ్ పాయింట్ కూడా కీలకమే. నేను మళ్లీ టాప్–20 ర్యాంకుల్లోకి రావాలంటే ఒక్కో టోర్నీలో నిలకడగా క్వార్టర్స్, సెమీస్, ఫైనల్స్ చేరుతుండాలి. అప్పుడు అనుకున్న ర్యాంకుకు చేరుకోగలం’ అని అన్నాడు. ఒకానొక దశలో చక్కని ఆటతీరుతో ప్రపంచ ఎనిమిదో ర్యాంకుకు ఎగబాకిన ప్రణయ్‌ని 2020 నవంబర్‌లో కోవిడ్ దెబ్బతీసింది. మహమ్మారి అతని ప్రదర్శనపై పెను ప్రభావమే చూపింది. ఆ తర్వాత ‘గో స్పోర్ట్స్ ఫౌండేషన్’ సహకారంతో ఆరోగ్యాన్ని, తర్వాత ఫిట్నెస్ను మెల్లిగా ఆటతీరును మెరుగుపర్చుకున్నాడు. ఈ సీజన్లో ఇండోనేసియా, మలేసియా ఓపెన్లలో సెమీస్ చేరిన ప్రణయ్ స్విస్ ఓపెన్‌లో రన్నరప్‌తో తృప్తి చెందాడు. థామస్ కప్ విజయంతో ఆత్మవిశ్వాసం పెంచుకున్నాడు. అయితే పెద్ద పెద్ద ఎండార్స్మెంట్లు లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులుంటున్నాయని, మేజర్ టోర్నీల్లో గెలిస్తేనే బ్రాండింగ్ దక్కుతుందని చెప్పాడు. -
కిడాంబి శ్రీకాంత్‌కు ప్రధాని అభినందన
న్యూఢిల్లీ: ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ లో రజతం నెగ్గిన స్టార్ షట్లర్, ఆంధ్రప్రదేశ్ క్రీడాకారుడు కిడాంబి శ్రీకాంత్‌పై భారత ప్రధాని నరేంద్ర మోదీ ప్రశంసల వర్షం కురిపించారు. ‘శ్రీకాంత్‌కు అభినందనలు. రజతంతో చరిత్రకెక్కావు. నీ విజయం మరెంతో మంది క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలుస్తుంది’ అని ప్రధాని నరేంద్ర మోదీ ట్వీట్ చేశారు. Congratulations to @srikidambi for winning a historic Silver Medal. This win will inspire several sportspersons and further interest in badminton. https://t.co/rxxkBDAwkP— Narendra Modi (@narendramodi) December 20, 2021 కాగా, వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్న విషయం తెలిసిందే. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. ఇదిలా ఉంటే, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. -
BWF World Championships 2021 Finals: పోరాడి ఓడిన శ్రీకాంత్..
హుఎల్వా (స్పెయిన్): వరల్డ్ ఛాంపియన్షిప్ టైటిల్‌ను నెగ్గే సువర్ణావకాశాన్ని తెలుగుతేజం కిదాంబి శ్రీకాంత్ తృటిలో చేజార్చుకున్నాడు. హోరాహోరీ సాగిన ఫైనల్లో ప్రపంచ 22వ సీడ్ ఆటగాడు, సింగపూర్‌కు చెందిన లో కియోన్ యో చేతిలో 15-21, 20-22 తేడాతో వరుస సెట్లలో ఓటమిపాలయ్యాడు. 42 నిమిషాల పాటు రసవత్తరంగా సాగిన ఈ మ్యాచ్‌లో 15వ సీడ్ శ్రీకాంత్ అద్భుతంగా పోరాడినప్పటికీ.. కీలక సమయాల్లో ప్రత్యర్ధి పైచేయి సాధించాడు. ఫలితంగా, శ్రీకాంత్ రజతంతో సరిపెట్టుకోగా, కియోన్ కెరీర్లో తొలి టైటిల్ నెగ్గి.. ఈ ఘనత సాధించిన తొలి సింగపూర్ షట్లర్‌గా చరిత్ర సృష్టించాడు. కాగా, వరల్డ్ ఛాంపియన్‌షిప్స్‌లో భారత్ నుంచి పీవీ సింధు మాత్రమే స్వర్ణం గెలిచింది. ఈ టోర్నీలో వరుసగా రెండు సార్లు రజతాలు గెలిచిన సింధు.. 2019లో విజేతగా నిలిచి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. చదవండి: టీమిండియా కెప్టెన్‌గా యశ్ దుల్, ఆంధ్రా కుర్రాడికి వైస్ కెప్టెన్సీ -
BWF World Championships 2021: మహిళల సింగిల్స్ ఛాంపియన్‌గా యమగుచి
హుఎల్వా (స్పెయిన్): ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021 మహిళ సింగిల్స్‌లో జపాన్ క్రీడాకారిణి, వరల్డ్ నంబర్ 3 అకానే యమగుచి విజేతగా నిలిచింది. ప్రపంచ నంబర్ 1, చైనీస్ తైపీ క్రీడాకారిణి తైజు యింగ్‌తో జరిగిన తుది పోరులో 21-14, 21-11తో వరుస సెట్లలో విజయం సాధించి టైటిల్‌ను సొంతం చేసుకుంది. తద్వారా ఈ ఘనత సాధించిన రెండో జపాన్ క్రీడాకారిణిగా చరిత్ర సృష్టించింది. కేవలం 39 నిమిషాల్లో ముగిసిన ఈ మ్యాచ్‌లో యమగుచి పూర్తి ఆధిపత్యం కొనసాగించింది. మరోవైపు ప్రపంచ రెండో సీడ్, థాయ్ జోడీ డెచాపోల్ పువావరనుక్రో, సప్సిరీ టరెట్టనాచాయ్ మిక్స్డ్ డబుల్స్ టైటిల్‌ను ఎగురేసుకుపోయింది. ఈ ద్వయం ఫైనల్లో ప్రపంచ మూడో సీడ్ జపాన్ ద్వయం యుటా వటనాబే, అరిసా హిగాషినోపై 21-13, 21-14 తేడాతో విజయం సాధించింది. చదవండి: బాబర్, రిజ్వాన్ లాంటి ఆటగాళ్లు లేరని భారతీయులు బాధపడతారు.. -
శభాష్ శ్రీకాంత్...
ఒక్కో అడ్డంకిని అధిగమిస్తూ భారత స్టార్ బ్యాడ్మింటన్ ప్లేయర్ కిడాంబి శ్రీకాంత్ విశ్వకిరీటాన్ని అందుకునేందుకు విజయం దూరంలో నిలిచాడు. ఏమాత్రం అంచనాలు లేకుండా ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్లో బరిలోకి దిగిన ఈ తెలుగు తేజం అద్వితీయ ఆటతీరుతో ఫైనల్లోకి దూసుకెళ్లాడు. భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌తో నువ్వా నేనా అన్నట్లు సాగిన సెమీఫైనల్ సమరంలో తుదకు అనుభవజ్ఞుడైన శ్రీకాంత్‌దే పైచేయిగా నిలిచింది. లక్ష్య సేన్ ఓడిపోయినప్పటికీ తన ఆటతీరుతో అందరి మనసులు గెల్చుకున్నాడు. ప్రకాశ్ పదుకొనే (1983), సాయిప్రణీత్ (2019) తర్వాత ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్ షిప్ పురుషుల సింగిల్స్‌లో కాంస్య పతకం సాధించిన మూడో భారతీయ క్రీడాకారుడిగా లక్ష్య సేన్ గుర్తింపు పొందాడు. హుఎల్వా (స్పెయిన్): ఎవరూ ఊహించని విధంగా తొలిసారి ఇద్దరు భారతీయుల మధ్య జరిగిన ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్ సెమీఫైనల్ అందర్నీ అలరించింది. 69 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో ప్రపంచ మాజీ నంబర్‌వన్ కిడాంబి శ్రీకాంత్ 17–21, 21–14, 21–17తో భారత్‌కే చెందిన యువతార లక్ష్య సేన్‌పై విజయం సాధించాడు. ఈ క్రమంలో ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ పురుషుల సింగిల్స్‌లో ఫైనల్ చేరిన తొలి భారతీయ క్రీడాకారుడిగా శ్రీకాంత్ ఘనత వహించాడు. ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరు జిల్లాకు చెందిన 28 ఏళ్ల శ్రీకాంత్ గత నాలుగేళ్లుగా ఒక్క అంతర్జాతీయ టైటిల్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడా లోటును తీర్చుకోవడానికి అతడు కేవలం విజయం దూరంలో నిలిచాడు. ప్రపంచ మూడో ర్యాంకర్ ఆంటోన్సెన్ (డెన్మార్క్), ప్రపంచ 22వ ర్యాంకర్ లో కీన్ యె (సింగపూర్) మధ్య రెండో సెమీఫైనల్ విజేతతో నేడు జరిగే ఫైనల్లో శ్రీకాంత్ తలపడతాడు. భారత కాలమానం ప్రకారం పురుషుల సింగిల్స్ ఫైనల్ నేటి సాయంత్రం 5 గంటలకు మొదలయ్యే అవకాశముంది. అన్ని విభాగాల ఫైనల్స్‌ను స్టార్ స్పోర్ట్స్–3, హాట్‌స్టార్‌లలో ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. హోరాహోరీగా... అంతర్జాతీయ స్థాయిలో తొలిసారి శ్రీకాంత్, లక్ష్య సేన్ తలపడగా... ప్రతీ పాయింట్‌కు ఇద్దరూ హోరాహోరీగా పోరాడారు. ముఖ్యంగా శ్రీకాంత్ కళ్లు చెదిరే రీతిలో స్మాష్‌లు సంధించాడు. అయితే శ్రీకాంత్ సంధించిన స్మాష్‌లకు అంతే చాణక్యంగా లక్ష్య సేన్ తిప్పి కొట్టాడు. 17 నిమిషాలపాటు జరిగిన తొలి గేమ్‌లో శ్రీకాంత్ అనవసర తప్పిదాలతోనే లక్ష్య సేన్ ఖాతాలో ఎక్కువ పాయింట్లు చేరాయి. బెంగళూరులోని ప్రకాశ్ పదుకొనే అకాడమీలో శిక్షణ తీసుకుంటున్న ఉత్తరాఖండ్‌కు చెందిన 20 ఏళ్ల లక్ష్య సేన్ మ్యాచ్ కొనసాగుతున్నకొద్దీ అలసిపోయినట్లు కనిపించాడు. రెండో గేమ్‌లో ఒకదశలో శ్రీకాంత్ 6–9తో వెనుకబడినా తన అనుభవాన్నంతా రంగరించి పోరాడాడు. డ్రాప్ షాట్లు, క్రాస్‌కోర్టు షాట్లతో చెలరేగి వరుసగా ఆరు పాయింట్లు గెలిచిన శ్రీకాంత్ 12–9తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఆ తర్వాత ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న శ్రీకాంత్ రెండో గేమ్‌ను 21 నిమిషాల్లో దక్కించుకొని మ్యాచ్‌లో నిలిచాడు. నిర్ణాయక మూడో గేమ్‌లో ఇద్దరూ తమ అత్యుత్తమ ఆటతీరును ప్రదర్శించారు. ఈ క్రమంలో కొన్ని సుదీర్ఘ ర్యాలీలు కనిపించాయి. తుదకు ఈ సుదీర్ఘ ర్యాలీలకు కళ్లు చెదిరే షాట్లతో ముగింపు ఇస్తూ వీరిద్దరు తమ ఖాతాలో పాయింట్లు వేసుకున్నారు. చివరి గేమ్‌లో రెండుసార్లు శ్రీకాంత్ వెనుకంజ వేసినా వెంటనే తేరుకొని స్కోర్లను సమం చేశాడు. స్కోరు 16–16 వద్ద ఉన్నపుడు శ్రీకాంత్ వరుసగా మూడు పాయింట్లు గెలిచి 19–16తో ఆధిక్యంలోకి వచ్చాడు. ఈ దశలో ఒత్తిడికి లోనైన లక్ష్య సేన్ అనవసర తప్పిదాలు చేసి మూల్యం చెల్లించుకున్నాడు. శ్రీకాంత్ రిటర్న్ షాట్‌ను లక్ష్య సేన్ నెట్‌కు కొట్టడంతో గేమ్‌తోపాటు మ్యాచ్ శ్రీకాంత్ వశమైంది. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో సింగిల్స్ విభాగంలో ఫైనల్‌కు చేరిన మూడో భారతీయ ప్లేయర్ శ్రీకాంత్. గతంలో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు మూడుసార్లు (2017, 2018–రన్నరప్; 2019–విన్నర్), సైనా నెహ్వాల్ ఒకసారి (2015–రన్నరప్) ఫైనల్ చేరారు. పురుషుల సింగిల్స్‌లో మాత్రం భారత్ నుంచి ఫైనల్ చేరిన తొలి క్రీడాకారుడిగా శ్రీకాంత్ నిలిచాడు. -
వరల్డ్ ఛాంపియన్షిప్ టోర్నీలో దూసుకుపోతున్న సింధు..
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ ఛాంపియన్ పీవీ సింధు క్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లింది. థాయ్‌ల్యాండ్‌కు చెందిన పాన్పావీ చోచువాంగ్‌తో గురువారం జరిగిన మూడో రౌండ్ మ్యాచ్‌లో 21-14, 21-18 తేడాతో వరుస సెట్లలో విజయం సాధించింది. 48 నిమిషాల పాటు సాగిన ఈ మ్యాచ్‌లో సింధు ప్రత్యర్ధిపై పూర్తి ఆధిపత్యం చలాయించింది. సింధు తన తదుపరి మ్యాచ్‌లో(క్వార్టర్స్) చైనీస్ తైపీ క్రీడాకారిణి టైజు యింగ్‌తో తలపడనుంది. చదవండి: విరాట్‌లాగే నాకు కూడా అన్యాయం జరిగింది.. టీమిండియా బౌలర్ సంచలన వ్యాఖ్యలు -
మూడో రౌండ్లోకి దూసుకెళ్లిన సింధు.. 24 నిమిషాల్లో ఖేల్ ఖతం
PV Sindhu: స్పెయిన్‌లోని హుఎల్వా వేదికగా జరుగుతున్న ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ 2021లో తెలుగు తేజం, డిఫెండింగ్ చాంపియన్ పీవీ సింధు మూడో రౌండ్లోకి దూసుకెళ్లింది. మంగళవారం జరిగిన రెండో రౌండ్లో స్లోవేకియాకి చెందిన మార్టినా రెపిస్కాను 21-7, 21-9 తేడాతో వరుస సెట్లలో చిత్తుగా ఓడించిన సింధు.. తొలి సెట్‌ను 10 నిమిషాల్లో, మ్యాచ్‌ను 24 నిమిషాల్లో ఖతం చేసింది. ఈ మ్యాచ్‌లో సింధు ఆరంభం నుంచే దూకుడు ప్రదర్శించడంతో ప్రత్యర్ధి రెపిస్కా కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది. కాగా, ఈ టోర్నీలో సింధు సహా కిదాంబి శ్రీకాంత్, లక్ష్యసేన్‌లు కూడా మూడో రౌండ్‌కు చేరుకున్నారు. చదవండి: లంక ప్రీమియర్ లీగ్‌లో కోహ్లి.. శ్రీలంక క్రికెటర్ మనసులో మాట..! -
అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో సింధు
భారత స్టార్ షట్లర్, రెండు ఒలింపిక్ పతకాల విజేత పీవీ సింధు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) అథ్లెటిక్స్ కమిషన్ ఎన్నికల బరిలో నిలిచింది. ఈ ఎన్నికలు డిసెంబర్ 17న జరుగుతాయి. సింధు 2017నుంచి అథ్లెటిక్స్ కమిషన్‌లో కొనసాగుతుండగా... రెండో సారి ఆమె మాత్రమే పోటీ పడుతోంది. ఇందులో అందుబాటులో ఉన్న ఆరు మహిళల స్థానాల కోసం తొమ్మిది మంది ఎన్నికల్లో నిలబడుతున్నారు. -
సైనా, శ్రీకాంత్ ఒలింపిక్స్ ఆశలు ఆవిరి!
న్యూఢిల్లీ: చివరి నిమిషంలో అర్హత నిబంధనలలో మార్పులు చేస్తే తప్ప... టోక్యో ఒలింపిక్స్‌లో భారత బ్యాడ్మింటన్ స్టార్ క్రీడాకారులు సైనా నెహ్వాల్, కిడాంబి శ్రీకాంత్ ఆటను చూసే భాగ్యం లేనట్టే. ఆసియాలో కరోనా వైరస్ ఉధృతి ఇంకా కొనసాగుతుండటంతో... క్రీడాకారులతోపాటు టోర్నీ సహాయక సిబ్బంది, ఇతర వర్గాల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జూన్ 1 నుంచి 6 వరకు జరగాల్సిన సింగపూర్ ఓపెన్ సూపర్–500 టోర్నీని రద్దు చేస్తున్నట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) బుధవారం ప్రకటించింది. టోక్యో ఒలింపిక్స్ అర్హత టోర్నీలలో భాగమైన ఇండియా ఓపెన్, మలేసియా ఓపెన్‌ను కరోనా కారణంగానే వాయిదా వేయగా... సింగపూర్ ఓపెన్‌ను ఏకంగా రద్దు చేయడంతో చివరి అవకాశంగా టోక్యో ఒలింపిక్స్ బెర్త్ ఖరారు చేసుకోవాలన్న భారత స్టార్స్ సైనా, శ్రీకాంత్‌లకు నిరాశ ఎదురైంది. భారత్‌లో కరోనా సెకండ్ వేవ్ కారణంగా భారత్ నుంచి వచ్చే అన్ని విమానాలపై సింగపూర్ నిషేధం విధించింది. మరోవైపు జూన్, జూలైలలో జరగాల్సిన ఇతర టోర్నీలు కొరియా మాస్టర్స్, ఇండోనేసియా మాస్టర్స్ వాయిదా పడగా... ఇండోనేసియా ఓపెన్ సూపర్–1000 టోర్నీ, థాయ్‌లాండ్ ఓపెన్, యూఎస్ ఓపెన్ టోర్నీలు రద్దయ్యాయి. దాంతో ఈ ఏడాది జూలై 23న టోక్యో ఒలింపిక్స్ మొదలయ్యే వరకు అంతర్జాతీయ ఎలాంటి బ్యాడ్మింటన్ టోర్నీలు లేకుండా పోయాయి. ఒలింపిక్ క్వాలిఫయింగ్ టోర్నీలు రద్దయిన నేపథ్యంలో టోక్యో ఒలింపిక్స్ అర్హత నిబంధనల వివరాలపై మరో ప్రకటన విడుదల చేస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. టోక్యో ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ నిబంధనల ప్రకారం సింగిల్స్‌లో ఒకే దేశం నుంచి ఇద్దరు అర్హత పొందాలంటే టాప్–16లో కచ్చితంగా ఉండాలి. ప్రస్తుతం ‘టోక్యో’ క్వాలిఫయింగ్ ర్యాంకింగ్స్‌లో మహిళల సింగిల్స్‌లో పీవీ సింధు ఏడో ర్యాంక్‌లో... సైనా 22వ ర్యాంక్‌లో ఉంది. దాంతో సింధుకు ‘టోక్యో’ బెర్త్ ఖరారయింది. పురుషుల సింగిల్స్‌లో సాయిప్రణీత్ 13వ ర్యాంక్‌లో ఉండగా... శ్రీకాంత్ 20వ స్థానంలో ఉన్నాడు. దాంతో సాయిప్రణీత్‌కు టోక్యో బెర్త్ ఖాయమైంది. పురుషుల డబుల్స్‌లో తొమ్మిదో ర్యాంక్‌లో ఉన్న సాత్విక్ సాయిరాజ్–చిరాగ్ శెట్టి జంట కూడా ‘టోక్యో’ బెర్త్ దక్కించుకుంది. 31 ఏళ్ల సైనా నెహ్వాల్ 2008 బీజింగ్ ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్ చేరగా... 2012 లండన్ ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని సాధించింది. 2016 రియో ఒలింపిక్స్‌లో లీగ్ దశలోనే ఇంటిముఖం పట్టింది. ప్రపంచ మాజీ నంబర్‌వన్ అయిన శ్రీకాంత్ 2016 రియో ఒలింపిక్స్‌లో క్వార్టర్ ఫైనల్లో ఓడిపోయాడు. -
‘వరల్డ్ ఫైనల్స్’ టోర్నీ నిర్వహణపై...
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్ సీజన్ ముగింపు టోర్నీ ‘వరల్డ్ టూర్ ఫైనల్స్’ నిర్వహణపై చైనా నుంచి మరింత స్పష్టత కోరినట్లు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) పేర్కొంది. షెడ్యూల్ ప్రకారం డిసెంబర్లో జరగాల్సిన ఈ టోర్నీకి చైనా ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కరోనా నేపథ్యంలో ఈ ఏడాది 2022 వింటర్ ఒలింపిక్స్ (బీజింగ్) ట్రయల్స్ మినహా... షెడ్యూల్ చేసిన ఏ అంతర్జాతీయ టోర్నీకీ ఆతిథ్యమివ్వబోమని శుక్రవారం చైనా క్రీడా పరిపాలక మండలి ప్రకటించింది. దీంతో గ్వాంగ్జౌ వేదికగా డిసెంబర్ 16–20 వరకు జరగాల్సిన వరల్డ్ టూర్ ఫైనల్స్ టోర్నీపై సందిగ్ధత నెలకొంది. చైనా తాజా నిర్ణయంతో ఈ ఏడాది బ్యాడ్మింటన్ క్యాలెండర్‌పై ఎలాంటి ప్రభావం పడనుందనే అంశంపై చైనీస్ బ్యాడ్మింటన్ సంఘం (సీబీఏ)తో సంప్రదింపులు జరుపుతున్నట్లు బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. వరల్డ్ ఫైనల్స్‌తో పాటు చైనా ఓపెన్ సూపర్–1000 ఈవెంట్ (సెప్టెంబర్ 15–20, చాంగ్జౌ), ఫుజు చైనా ఓపెన్ సూపర్–750 (నవంబర్ 3–8) టోర్నీలు కూడా చైనాలోనే జరుగనున్న నేపథ్యంలో వీటి భవిష్యత్‌పై కూడా బీడబ్ల్యూఎఫ్ వివరణ కోరింది. -
ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ వాయిదా
ఆక్లాండ్: కరోనా వైరస్ నేపథ్యంలో మెగా టోర్నమెంట్ల వాయిదాల పర్వం కొనసాగుతోంది. తాజాగా ఈ జాబితాలో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చేరింది. ముందుగా నిర్ణయించిన షెడ్యూల్ ప్రకారం ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్ ఈ ఏడాది సెప్టెంబర్‌లో న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో జరగాల్సింది. అయితే కరోనా తగ్గుముఖం పట్టకపోవడంతో ఈ మెగా టోర్నీని వచ్చే ఏడాది జనవరి 11 నుంచి 24 వరకు నిర్వహిస్తామని బీడబ్ల్యూఎఫ్ తెలిపింది. సెప్టెంబర్‌లో జరగాల్సిన టోర్నీకి అర్హత పొందిన క్రీడాకారులే వాయిదా పడిన టోర్నీలో ఆడతారని బీడబ్ల్యూఎఫ్ వివరించింది. -
హైదరాబాద్ ఓపెన్‌తో బీడబ్ల్యూఎఫ్ సీజన్ పునః ప్రారంభం
న్యూఢిల్లీ: కరోనా కారణంగా మూలకు పడిన టోర్నమెంట్లను నిర్వహించేందుకు ప్రపంచ బ్యాడ్మింటన్ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్) సిద్ధమైంది. ఈ మేరకు పలు టోర్నీల సవరించిన షెడ్యూల్‌ను శుక్రవారం ప్రకటించింది. ఇందులో భాగంగా ఆగస్టు 11 నుంచి 16 వరకు జరుగనున్న హైదరాబాద్ ఓపెన్‌తో మళ్లీ బ్యాడ్మింటన్ సందడి మొదలు కానుంది. హైదరాబాద్ ఓపెన్ కాకుండా... సయ్యద్ మోదీ ఇంటర్నేషనల్ టోర్నీ (నవంబర్ 17–22), ఒలింపిక్ క్వాలిఫయింగ్ ఈవెంట్ ఇండియా ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–500 టోర్నీ (డిసెంబర్ 8–13) కూడా భారత్‌లో జరుగనున్నాయి. నిజానికి ఇండియా ఓపెన్ మార్చి 24–29 వరకు జరగాల్సి ఉండగా కరోనా ధాటికి వాయిదా పడింది. సవరించిన క్యాలెండర్ ప్రకారం బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ టూర్ స్థాయి టోర్నీలు తైపీ ఓపెన్ సూపర్ 300 (సెప్టెంబర్ 1–6)తో ప్రారంభం కాను న్నాయి. అనంతరం డెన్మార్క్ ఓపెన్ (అక్టోబర్ 3–11) జరుగనుంది. వీటితో పాటు 8 ప్రముఖ అంతర్జాతీయ టోర్నీలను రీషెడ్యూల్ చేశారు. అయితే బీడబ్ల్యూఎఫ్ సవరించిన షెడ్యూల్‌పై భారత అగ్రశ్రేణి క్రీడాకారులు సాయిప్రణీత్, పారుపల్లి కశ్యప్, సైనా నెహ్వాల్ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు నెలల కాలంలో ఏకంగా 22 అంతర్జాతీయ టోర్నీలు ఉండటమేంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అసలు ఆటగాళ్లు ఇంకా ప్రాక్టీసే ప్రారంభించలేదని... ప్రాక్టీస్ మొదలుపెట్టాక మ్యాచ్ ఫిట్నెస్ సంతరించుకోవడానికి కనీసం రెండు నెలల సమయం పడుతుందని సాయిప్రణీత్ అన్నాడు. -
ఉపరాష్ట్రపతిని కలిసిన పీవీ సింధూ ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్ : ప్రపంచ సీనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణం నెగ్గి సరికొత్త చరిత్ర సృష్టించిన తెలుగు తేజం పూసర్ల వెంకట (పీవీ) సింధును ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు అభినందించారు. దేశం ఖ్యాతిని సింధూ ప్రపంచానికి చాటారని ప్రశంసించారు. కుటుంబంతో కలిసి సింధూ ఉపరాష్ట్రపతిని హైదరాబాద్‌లో శనివారం కలిశారు. ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ చరిత్రలో స్వర్ణ పతకం సాధించిన తొలి భారతీయురాలిగా సింధూ కొత్త చరిత్ర లిఖించారని వెంకయ్య అన్నారు. ఆమె సాధించిన విజయాలు, కఠోర శ్రమ యువతకు ప్రేరణనిస్తాయని పేర్కొన్నారు. సింధూలాంటి అథ్లెట్లు దేశ యువతకు రోల్స్‌మోడల్స్‌గా నిలుస్తారని చెప్పారు. కఠినమైన ఆహార నియమాలు, కఠోర శ్రమ, క్రమశిక్షణ లక్ష్యాన్ని సాధించేందుకు ఆమెకు దోహదం చేశాయని వ్యాఖ్యానించారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) హెల్తీ అయితే దేశం వెల్తీ అవుతుంది.. ఇక జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్రమోదీ పిలుపునిచ్చిన ‘ఫిట్ ఇండియా మూవ్మెంట్’ జాతీయోద్యమంగా ముందుకు సాగాలని వెంకయ్య ఆకాక్షించారు. ఆధునిక జీవన విధానంలో ఆరోగ్యంగా ఉండాలంటే ఫిట్‌గా ఉండటం తప్పనిసరని పేర్కొన్నారు. ఆహార పద్ధతుల్లో మార్పులు, వ్యాయామం చేస్తే ఫిట్‌గా ఉండొచ్చని సూచించారు. ఫిట్ ఇండియా మూవ్‌మెంట్‌కు ఇదే సరైన సమయమని అన్నారు. దేశ జనాభాలో 65 శాతం మంది 35 ఏళ్లలోపు వారే ఉన్నారని, వారంతా ఆరోగ్యంగా, యాక్టివ్‌గా ఉన్నప్పుడే దేశం పురోగమిస్తుందని చెప్పారు. ఆరోగ్యం ఉండటం మాత్రమే కాకుండా ఫిట్‌గా ఉంటేనే లక్ష్యాల్ని సాధింంచగులుగుతామన్నారు. దేశం హెల్తీగా ఉంటేనే వెల్తీగా మారుతుందని అన్నారు. -
2020 ఒలంపిక్స్‌లో కూడా స్వర్ణం ఆమెదేనా?
భారత స్టార్ షట్లర్ పీవీ సింధు ప్రపంచ బాడ్మింటన్ ఛాంపియన్షిప్-2019లో స్వర్ణ పతకం సాధించి చరిత్ర సృష్టించిన సంగతి తెలిసిందే. ఆమె సాధించిన ఈ ఘనతపై జాతీయంగా, అంతర్జాతీయంగా సింధుపై అభినందనల పరంపర కొనసాగుతూనే ఉంది. సోషల్ మీడియాలో ఆమెకు సంబంధించిన ప్రతీ చిన్నవిశేషం కూడా క్రీడాభిమానులను, యువతను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరో భారతీయ గోల్డెన్ గర్ల్ , పరుగుల రాణి పద్మశ్రీ పీటీ ఉషతో కలిసి వున్న సింధు చిన్ననాటి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో ఆకర్షిస్తోంది. పీటీ ఉష సింధుకు అభినందనలు తెలుపుతూ పీవీ సింధు చిన్నప్పుడు తనతో కలిసి దిగిన 18 ఏళ్ల క్రితంనాటి ఫోటోను ట్వీట్ చేశారు. దీంతో మీరిద్దరు దేశానికి గర్వ కారణమని నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తుండగా, పలువురు క్రీడాభిమానులు, ఇతర అభిమానులు అరుదైన ఆ ఫోటోకు లైక్స్ కొడుతూ షేర్ చేస్తున్నారు. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందంటూ తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. చదవండి :‘దారుణమైన వర్కవుట్లు; కాబట్టే సింధూ గెలిచింది’ ఛాంపియన్‌షిప్‌లో పీవీ సింధు బంగారు పతకం గెలవడంతో ఆమెని అభినందించిన పీటీ ఉష 2020 టోక్యో ఒలింపిక్స్‌లో పీవీ సింధు స్వర్ణాన్ని గెలుచుకోవాలని ఆకాంక్షించారు. ఆమె ఇప్పటికే రజత పతకం గెలిచింది. పసిడిపై గురి పెడితే కచ్చితంగా చేజిక్కించుకోగలదంటూ ట్వీట్ చేశారు. మరోవైపు పీవీ సింధు ప్రపంచ పోటీకి ముందు కఠోర సాధన చేస్తున్న వీడియో ఒకటి టాక్ ఆఫ్ ది యూత్‌గా నిలిచింది. 2020 స్వర్ణం కూడా సింధూకే సొంతం కావాలంటూ బెస్ట్ విషెస్ చెబుతున్నారు. (చదవండి : సింధు స్వర్ణ ప్రపంచం) The passion and dedication for the sport will always be rewarded when hardwork comes into play. @Pvsindhu1 success will inspire generations to come! Hefty congratulations on winning the Gold at #BWFWorldChampionships2019 🇮🇳 pic.twitter.com/xBP7RgOHnt — P.T. USHA (@PTUshaOfficial) August 25, 2019