మురిపించే ముగింపు ఎవరిదో! | World Tour Finals: Tough road ahead for PV Sindhu; Sameer Verma too eyes knockout berth | Sakshi
Sakshi News home page

మురిపించే ముగింపు ఎవరిదో!

Published Wed, Dec 12 2018 12:42 AM | Last Updated on Wed, Dec 12 2018 4:01 AM

World Tour Finals: Tough road ahead for PV Sindhu; Sameer Verma too eyes knockout berth - Sakshi

గతేడాది అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో అదరగొట్టిన భారత స్టార్‌ క్రీడాకారిణి పీవీ సింధు ఈ ఏడాదీ నిలకడగా రాణించింది. కానీ ఫైనల్‌ చేరిన ప్రతి టోర్నీలోనూ తడబడి ఒక్క టైటిల్‌ కూడా తన ఖాతాలో జమ చేసుకోలేకపోయింది. అయితే ఈ సీజన్‌ను టైటిల్‌తో ముగించేందుకు ఆమెకు వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌ టోర్నమెంట్‌ రూపంలో చివరి అవకాశం వచ్చింది. ఈ ఏడాది ప్రపంచ బ్యాడ్మింటన్‌ సమాఖ్య (బీడబ్ల్యూఎఫ్‌) టోర్నమెంట్‌లలో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన టాప్‌–8 క్రీడాకారుల మధ్య జరిగే ఈ మెగా ఈవెంట్‌లో సింధు ‘ఫినిషింగ్‌ టచ్‌’ ఇస్తుందో లేదో వేచి చూడాలి. మరోవైపు పురుషుల సింగిల్స్‌లో సమీర్‌ వర్మ తొలిసారి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.   

గ్వాంగ్‌జౌ (చైనా): ఈ ఏడాది ఇండియా ఓపెన్, కామన్వెల్త్‌ గేమ్స్, థాయ్‌లాండ్‌ ఓపెన్, ప్రపంచ చాంపియన్‌షిప్, ఏషియన్‌ గేమ్స్‌ ఈవెంట్స్‌లో పీవీ సింధు ఫైనల్లోకి దూసుకెళ్లింది. కానీ చివరి అడ్డంకిని అధిగమించలేకపోయింది. ఈ ఐదు ఈవెంట్స్‌లో ఆమె ఐదుగురు వేర్వేరు ప్రత్యర్థుల చేతుల్లో ఓటమి చవిచూసింది. ఇప్పటి వరకు ఈ సీజన్‌లో సింధు 63 మ్యాచ్‌లు ఆడి 45 విజయాలు నమోదు చేసి, 18 మ్యాచ్‌ల్లో ఓడిపోయింది. ఏడాది పొడవునా నిలకడగా రాణించిన ఆమెకు టైటిల్‌ మాత్రం ఇంకా ఊరిస్తోంది. గతేడాది దుబాయ్‌లో జరిగిన సీజన్‌ ముగింపు టోర్నీ వరల్డ్‌ టూర్‌ ఫైనల్స్‌లో రన్నరప్‌గా నిలిచిన సింధు ఈసారి మాత్రం స్వర్ణంతో తిరిగి రావాలని... ఈ ఏడాది టైటిల్‌ లేని లోటును తీర్చుకోవాలని పట్టుదలతో ఉంది. అయితే సింధుకు క్లిష్టమైన ‘డ్రా’ పడింది. గ్రూప్‌ ‘ఎ’లో సింధుతోపాటు ప్రపంచ నంబర్‌వన్‌ తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), రెండో ర్యాంకర్‌ అకానె యామగుచి (జపాన్‌), 12వ ర్యాంకర్‌ బీవెన్‌ జాంగ్‌ (అమెరికా) ఉన్నారు. ఈ ముగ్గురూ ఈ ఏడాది సింధును ఓడించడం గమనార్హం.   బుధవారం జరిగే తొలి లీగ్‌ మ్యాచ్‌లో అకానె యామగుచితో సింధు ఆడనుంది. ఇప్పటివరకు వీరిద్దరు 13 సార్లు ముఖాముఖిగా తలపడ్డారు. తొమ్మిది సార్లు సింధు... నాలుగుసార్లు యామగుచి గెలుపొందారు. అయితే చివరి మూడు మ్యాచ్‌ల్లో మాత్రం యామగుచినే విజయం వరించడం విశేషం. యామగుచి తర్వాత తదుపరి రెండు మ్యాచ్‌ల్లో బీవెన్‌ జాంగ్‌తో, తై జు యింగ్‌తో సింధు ఆడాల్సి ఉంటుంది. బీవెన్‌ జాంగ్‌తో ముఖాముఖి రికార్డులో సింధు 3–3తో సమంగా ఉండగా... తై జు యింగ్‌తో మాత్రం సింధు 3–10తో వెనుకంజలో ఉంది. ఈ ఏడాది తై జు యింగ్‌ సూపర్‌ ఫామ్‌లో ఉంది. ఎనిమిది టోర్నమెంట్‌లలో ఫైనల్‌ చేరిన ఆమె ఆరు టైటిల్స్‌ను సొంతం చేసుకుంది. రెండు టోర్నీలలో రన్నరప్‌గా నిలిచింది. మరోవైపు గ్రూప్‌ ‘బి’లో ఐదో ర్యాంకర్, ప్రపంచ మాజీ చాంపియన్‌ నొజోమి ఒకుహారా (జపాన్‌), మూడో ర్యాంకర్‌ చెన్‌ యుఫె (చైనా), ఎనిమిదో ర్యాంకర్, మాజీ విశ్వవిజేత రచనోక్‌ (థాయ్‌లాండ్‌), 16వ ర్యాంకర్‌ మిచెల్లి లీ (కెనడా) ఉన్నారు. గ్రూప్‌ లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాక ఆయా గ్రూపుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన వారు సెమీఫైనల్‌కు అర్హత సాధిస్తారు. 

ఎవరికెంత... 
15 లక్షల డాలర్ల (రూ. 10 కోట్ల 83 లక్షలు) ప్రైజ్‌మనీతో ఈ టోర్నీని నిర్వహిస్తున్నారు. పురుషుల, మహిళల సింగిల్స్‌ విజేతలకు లక్షా 20 వేల డాలర్ల (రూ. 86 లక్షల 70 వేలు) చొప్పున లభిస్తాయి. రన్నరప్‌గా నిలిచిన వారు 60 వేల డాలర్లు (రూ. 43 లక్షల 34 వేలు) అందుకుంటారు. సెమీఫైనల్లో ఓడిన వారికి 30 వేల డాలర్లు (రూ. 21 లక్షల 67 వేలు) లభిస్తాయి. లీగ్‌ దశలో గ్రూప్‌లో మూడో స్థానంలో నిలిచిన వారికి  16,500 డాలర్ల (రూ. 11 లక్షల 92 వేలు) చొప్పున... చివరి స్థానంలో నిలిచిన వారికి 9 వేల డాలర్లు (రూ. 6 లక్షల 50 వేలు) లభిస్తాయి.  

సమీర్‌ సంచలనం సృష్టించేనా... 
పురుషుల సింగిల్స్‌లో తొలిసారి ఈ ప్రతిష్టాత్మక టోర్నీకి అర్హత సాధించిన సమీర్‌ వర్మ తన స్థాయికి తగ్గట్టు ఆడితే సెమీఫైనల్‌ చేరుకునే అవకాశం ఉంది. ఈ ఏడాది సమీర్‌ వర్మ సయ్యద్‌ మోదీ ఓపెన్, హైదరాబాద్‌ ఓపెన్, స్విస్‌ ఓపెన్‌  టైటిల్స్‌ గెలిచాడు. మధ్యప్రదేశ్‌కు చెందిన 24 ఏళ్ల సమీర్‌ ఈ ఏడాది 47 మ్యాచ్‌లు ఆడాడు. 31 మ్యాచ్‌ల్లో గెలిచి, 16 మ్యాచ్‌ల్లో ఓడిపోయాడు. బుధవారం జరిగే పురుషుల సింగిల్స్‌ గ్రూప్‌ ‘బి’లో ప్రపంచ చాంపియన్, ప్రపంచ నంబర్‌వన్‌ కెంటో మొమోటా (జపాన్‌)తో సమీర్‌ వర్మ ఆడతాడు. స్విస్‌ ఓపెన్‌ టైటిల్‌ గెలిచే క్రమంలో క్వార్టర్‌ ఫైనల్లో మొమోటాపై సమీర్‌ వర్మ గెలుపొందడం గమనార్హం. అయితే ఈ ఏడాది మొమోటా అద్వితీయమైన ఫామ్‌లో ఉన్నాడు. ఈ ఏడాది అతను ఏడు టైటిల్స్‌ సాధించడం విశేషం. మొత్తం 77 మ్యాచ్‌ల్లో కేవలం 7 మ్యాచ్‌ల్లో మాత్రమే ఓడిపోయాడు. మొమోటా ఫామ్‌ చూస్తుంటే సీజన్‌ను మరో టైటిల్‌తో ముగించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఏ గ్రూప్‌లో ఎవరంటే...
మహిళల సింగిల్స్‌ 
గ్రూప్‌ ‘ఎ’: పీవీ సింధు (భారత్‌), తై జు యింగ్‌ (చైనీస్‌ తైపీ), అకానె యామగుచి (జపాన్‌), బీవెన్‌ జాంగ్‌ (అమెరికా). గ్రూప్‌ ‘బి’: నొజోమి ఒకుహారా (జపాన్‌), చెన్‌ యుఫె (చైనా), ఇంతనోన్‌ రచనోక్‌ (థాయ్‌లాండ్‌), మిచెల్లి లీ (కెనడా). 

పురుషుల సింగిల్స్‌ 
గ్రూప్‌ ‘ఎ’: చౌ తియెన్‌ చెన్‌ (చైనీస్‌ తైపీ), షి యుకి (చైనా), సన్‌ వాన్‌ హో (దక్షిణ కొరియా), ఆంథోని సిన్‌సుక్‌ గిన్‌టింగ్‌ (ఇండోనేసియా). గ్రూప్‌ ‘బి’: సమీర్‌ వర్మ (భారత్‌), కెంటో మొమోటా (జపాన్‌), కాంతపోన్‌ వాంగ్‌చరోయెన్‌ (థాయ్‌లాండ్‌), టామీ సుగియార్తో (ఇండోనేసియా).

‘ఈసారి సన్నాహానికి కావాల్సినంత సమయం లభించింది. టోర్నీలో నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తాననే నమ్మకం ఉంది. బ్యాడ్మింటన్‌ సర్క్యూట్‌లో ఇది అతి పెద్ద టోర్నమెంట్‌.అగ్రశ్రేణి క్రీడాకారిణులు బరిలోకి దిగుతారు. కఠిన పరిస్థితులు ఎదురవనున్నా టైటిల్‌ సాధించాలనే కృతనిశ్చయంతో ఉన్నాను’ 
– పీవీ సింధు

►సీజన్‌ ముగింపు టోర్నీలో ఆడటం సింధుకిది వరుసగా మూడో ఏడాది. 2016లో సెమీస్‌కు చేరిన ఆమె... 2017లో రన్నరప్‌గా నిలిచింది.  

►వరల్డ్‌ సూపర్‌ సిరీస్‌ ఫైనల్స్‌ టోర్నీలో భారత క్రీడాకారులు నెగ్గిన పతకాలు. 2009లో జ్వాల–దిజు ద్వయం మిక్స్‌డ్‌ డబుల్స్‌లో రజతం... 2011లో సైనా మహిళల సింగిల్స్‌లో రజతం... 2017లో  సింధు రజతం సాధించారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement